శనివారం 06 మార్చి 2021
Devotional - Jan 24, 2021 , 23:14:39

దేవుడు ఎవరిని ఆదుకొంటాడు?

దేవుడు ఎవరిని ఆదుకొంటాడు?

కలడందురు దీనుల యెడ

గలడందురు పరమయోగి గణములపాలన్‌

గలడందు రన్ని దిశలను

గలడు కలం డనెడి వాఁడు గలఁడో లేడో?

- భాగవతం (8.86)

ఇది గజేంద్రునికి కలిగిన సందేహం. నేటికీ మనుషులలో కొందరికి కలుగుతూనే ఉన్నది. అనాదిగా ఈ సందేహం మానవులను వెంటాడుతూనే ఉన్నది. ‘ఉన్నాడనే’ వారు ఆస్తికులు. లేడనే వారు ‘నాస్తికులు’. ఈ లోకంలో ఇన్ని ఘోరాలు, నేరాలూ జరుగుతుంటే ‘ఆయన’ ఉంటే, ‘ఇలా చూస్తూ ఊరుకుంటాడా?’ అన్నది వారి ప్రధాన ప్రశ్న.

కలడంబోధి గలండు గాలి గల డాకాశంబునం గుంభినిన్‌

గలడగ్నిన్‌ దిశలం బగళ్ళ నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలన్‌

గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంతటన్‌

గలడీశుండు గలండు దండ్రి వెదకంగానేల యీ యా యెడన్‌.

- భాగవతం (7-274)

అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునకు చెప్పాడు. ‘ఇక్కడా అక్కడా అని సందేహం లేదు, అంతటా ఉన్నాడు’ అని తేల్చాడు. అక్కడెక్కడో వైకుంఠపురంలో ఉంటాడని అనుకోనక్కరలేదు. అక్కడా ఇక్కడా ఏకకాలంలో ఉంటాడని జ్ఞానులు కూడా తేల్చేశారు. భగవంతుని గురించి వెతకాలి, శోధించాలి, పరితపించాలి. అప్పుడు ఆయన మనకు కనిపిస్తాడు. అలా, వెతికేవారు నాలుగు రకాలని భగవంతుడే ఉద్ఘాటించాడు.

చతుర్విధా భజంతే మాం జనాః స్సుకృతినో ర్జున

ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥

- భగవద్గీత (7-16)

‘భరతులలో శ్రేష్టుడా! నాలుగు రకాలైన ధర్మ పరాయణులు నాపట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జనకు ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, జ్ఞానంలో స్థితులై ఉన్నవారు’. వీరంతా ఎవరెవరి స్థాయినిబట్టి, ఆర్తినిబట్టి వారు ప్రయత్నిస్తుంటారు. వారిని స్థాయికి తగ్గట్లుగానే ఆయనా అనుగ్రహిస్తుంటాడు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు వెదకిన అంత మాత్రమే నీవు’ అని మన అన్నమయ్య ఇదే సంగతిని తన సంకీర్తన ద్వారా తెలియపరిచారు. ఆ గజరాజుకు కూడా తర్వాత తన సందేహం కాస్తా తొలగిపోయింది. 

ఆర్తితో ప్రార్థించిన తర్వాత, శ్రీ హరి స్వయంగా పరిగెత్తుకుంటూ (సిరికి కూడా చెప్పకుండా, తన వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించకుండానే, చేత శంఖుచక్రాదులనేవీ ధరించకుండానే) విచ్చేసి, ‘మకరిని దునిమి కరిని గాచిన’ సంగతి మనకెరుకే. కాబట్టి, మనం అర్థం చేసుకోవలసింది ‘శరణాగతి’, ‘నీవే తప్ప వేరే దిక్కు లేదు స్వామీ!’ అని వేడుకోవడం. అప్పుడు ఆయన తప్పక రక్షిస్తాడు. మరి, ‘ఈ ఘోరాల సంగతి ఏమిటనే’ సందేహం రావచ్చు. దేనికైనా సమయం రావాలి కదా. పాపం పండితే దానికి తగ్గ పరిహారం జరుగుతుంది. తెలిసీ తెలియని పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మన్నించినట్లు ఆయనా మన్నిస్తాడు. మారడానికి అవకాశం ఇస్తాడు. హితవు చెప్పినా వినకపోతే చివరికు తగిన దండన విధిస్తాడు. 

రావణునికి సీతమ్మ ఇలానే హితవు చెప్పింది. రాములవారూ అవకాశం ఇచ్చారు. అతడు వినలేదు. శిశుపాలునికి నూరు తప్పులు చేసేవరకూ అవకాశం ఇచ్చాడు శ్రీ కృష్ణుడు. వారెవ్వరూ ఆ అవకాశాల్ని ఉపయోగించుకోలేదు. సర్కారు సొమ్ముతో భద్రాద్రి రామాలయాన్ని నిర్మించిన రామదాసుని బందిఖానలో ఉంచిన తానీషాకు కనబడి రామమాడల రూపంలో బాకీ తీర్చేసిన దయామయుడు ‘ఆయన’. తానీషాకు బుధ్ధి వచ్చింది, తప్పు మన్నించమని రామదాసుని చెర విడిపించాడు. కాబట్టి, దేవుడు ఉన్నాడనే పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థిస్తూ, శరణు కోరడమే మన కర్తవ్యం. అటువంటి వారిని దేవుడు తగిన సమయంలో తప్పక రక్షిస్తాడు.

-లంకా శివరామకృష్ణ శాస్త్రి, 97013 67992

VIDEOS

logo