గురువారం 04 మార్చి 2021
Devotional - Jan 24, 2021 , 23:14:39

మాధవుని మానస దర్శనం!

మాధవుని మానస దర్శనం!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఉద్ధవునికి బాల్యంలోనే బాలకృష్ణుని యందు ప్రేమాభక్తి బలపడ్డది. ఐదేండ్ల వయసులో ఒకనాడు కృష్ణునితో కలిసి క్రీడిస్తున్న కుర్రాళ్లతో ఒకణ్ణి కృష్ణునిగానే భావించి భజిస్తూ-సేవిస్తూ ఉన్నాడట. తల్లి వచ్చి ప్రాతర్భోజనానికి (అల్పాహారం) పిలిచినా పుండరీకాక్షుని పాదాంబుజ పూజా పరిచర్యలో పరవశించి పలుకనే లేదట! ‘ఉద్ధవ’ శబ్దానికి ఉత్సవమని కూడా అర్థం. ఉరుక్రముని (కృష్ణుని) చిరు సాహచర్యం కూడా ఉద్ధవునికి ఉత్సవ సమానమై ఉండేది. ఆయన అచ్యుతునికి అమాత్యుడు, ఆచార్యుడే కాక అంతేవాసి (శిష్యుడు) కూడా! ఉద్ధవ సమాగమం విదురునికి విందు భోజనమయింది.

ఉభయుల సంభాషణ వినువారికి వీనుల విందుగా సాగింది. ఉద్ధవుడు విదురునితో అన్నాడు- అనఘా! కంసుని సంహరించి ఆద్యంత రహితుడు, అనంతుడు అయిన అరవిందాక్షుడు అతని తండ్రికి-ఉగ్రసేనునికి సామ్రాజ్యం సమర్పించి ఆయనకు భృత్యు(దాసు)డై ఆయన ఆజ్ఞలను ఆనందంతో తలదాల్చటం తలచుకుంటే నా స్వాంతం (మనసు) సంతాప సంభరిత మవుతూ ఉంటుంది. ఉత్తమ భాగవతుడు, సత్పురుషుడు అయిన ఉగ్రసేనుని సేవించడంలో ఏమంత విస్మయం లేదు. కాని, కంసుడు పంపగా తనను వధించాలనే విషమ బుద్ధితో వక్షఃస్థలానికి విషం పూసుకొని మాతగా వచ్చి పాలిచ్చిన పరమ పాతకి పూతనను కూడా ప్రేమతో పాలించి దాదికి దక్కవలసిన పరమపదం ప్రసాదించాడంటే అట్టి దయాళువుకి కాక మరెవరికి దాసోహ మనాలి?

పూత- పవిత్రమైంది, న-కాదు, అని ‘పూతన’ పేరుకు పరమార్థం. అంటే, అత్యంత అపవిత్రమైంది అని భావం. ఆధ్యాత్మికంలో ‘అజ్ఞాన’మంత అపవిత్రమైంది లేదు, ‘న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే’ (గీత)- ఆత్మజ్ఞాన మంత పవిత్రమైందీ లేదు. అనాది అయిన అజ్ఞానం లేక అవిద్యయే పూతన. ఆదిత్యుని సన్నిధిలో అంధకారం నిలువనట్లు చిదాదిత్యు (జ్ఞానసూర్యు)ని సమక్షంలో అజ్ఞానం మనలేదు. ‘అజ్ఞాన దూరీకరణం ఆంతరం శౌచముచ్యతే’- అజ్ఞానం అంతరించటమే అంతశ్శుద్ధి! ఇలా చిన్ని కృష్ణుని చిలిపి లీలలన్నీ భవబీజాలను భస్మం గావించే చిదగ్ని కీలలు. పోతన పదవ స్కంధంలో పూతనా మోక్షణ లీలను పరమార్థ విచక్షణతో ఎంతో విలక్షణ శైలిలో విశదంగా వర్ణించాడు. 

పూతనా ముక్తి లీలను విని పూతచరితుడైన విదురుడు చాల విస్మయ మంది- ‘భక్త వత్సలుడు, భాగవత రక్షకుడు అయిన ముకుంద భగవానుడు తన ఏకాంత (అనన్య) భక్తులకు ప్రసాదించే పరమ పదాన్ని క్రూర కృత్యాలు చేసే ఘోర అసురులకు ఎలా అనుగ్రహించాడో చెప్పమ’ని ఉద్ధవుని అర్థించగా ఆయన ఇలా అన్నాడు-

విదురా! నా దృష్టిలో అసురులు కూడా అచ్యుత భక్తులే! వీరందరూ మరణకాలంలో మాధవ దర్శనం పొందారు. అసురులు అనేక మారులు అవక్ర పరాక్రమంతో ఆహవ రంగంలో ఆదిదేవునికి - చక్రపాణికి చుక్కలు చూపించారు! ‘ఓరీ హరీ! అసుర వైరీ! అచ్యుతా, ఆగరా! పద్మనాభా, పారిపోకురా! దైత్యారీ, దాగకురా! నలువ (బ్రహ్మదేవుడు) తండ్రీ! నిలువుము రా!’ అని ఆ నళినాయ తేక్షుని నామాన్నే అంటూ, ముఖ కమలాన్నే కనుగొంటూ కదన రంగంలో కుప్పకూలిన వారై ఆ క్రన్యాదు (రాక్షసు)లందరూ గొప్పదైన మోక్షపదాన్ని అప్పనంగా (శుద్ధమైన భక్తి-రక్తి లేకనే) అందుకున్నారు. ‘క్రోధోపి దేవస్య వరేణ తుల్యః’- అమృతానంద రూపుడైన అనిరుద్ధ భగవానుని అనుగ్రహం కన్నా ఆయన ఆగ్రహమే మిన్న అన్న దానిని అసురులు అనుభవించి ఆస్వాదించారు. ఈ సందర్భంలోనే ఉద్ధవుడు భగవంతుని గోకుల-బృందావన, మథుర, ద్వారకల లీలాత్రయాన్ని విదురునికి సంగ్రహంగా వర్ణించి వినిపిస్తాడు.

విదురా! దామోదరుడు ద్వారకలో అనేక వత్సరాలు వసించాడు. అఖిల భోగాలు, ఐష్టెశ్వర్యాలు- ‘సాంఖ్య మాస్థితః’- ‘నిస్సంగుడై యుండి సంసారి పగిది’ (ఏమీ అంటనివాడై కూడా సంసారి లాగా) అనాసక్తితో అనుభవిస్తూ లోకానికి సాంఖ్యయోగం యొక్క ఆచరణాత్మక విధానం ఆదర్శంగా ప్రదర్శించాడు.-నిత్య యవ్వనం,  నిరతిశయ సౌందర్యం కల్గిన ఎందరు అంగనలో (భార్యలో) అన్ని రూపాలు ధరించిన యోగేశ్వరేశ్వరుడు నందనందనుడైన గోవిందుడు వారందరితో అభినవ-నిత్య నూతన, ఆనందంతో ఎన్నో వర్షాలు విహరించి, క్రీడించాడు. ఇలా ద్వారకలో విహరించగా-విహరించగా హరికి గృహస్థాశ్రమం పట్ల- సువర్ణ ద్వారక, అనంత భోగ భాగ్యాలు, సుఖ సామగ్రి, అత్యంత సౌందర్యవతులైన 16,108 భార్యామణుల యెడల పర వైరాగ్యం- ‘విరాగః సమజాయత’ కలిగింది.  ఆహా! ఆశ్చర్యం! మహాభోగికి, మహాధనికునికి (మహాభోగో మహాధనః- విష్ణు సహస్రం) వైరాగ్యం, విరక్తి! కారణం? ఏముంటుంది కుటుంబమే! కంసాంతకుడైన త్రివిక్రమునికి కూడా సంసారం వల్ల తలనొప్పి తప్పలేదు మరి!

అర్థాంగినుల పరస్పర వ్యర్థ ఈర్ష్యాద్వేషాలు, ఒక్కగానొక్క అన్నగారైన బలరామునితో భిన్న(భేద) అభిప్రాయం- శమంతక మణి వ్యవహారంలో అన్న కూడా తనను బాహాటంగా అనుమానించుట, కొడుకుల మనుమల మాట వినమి- స్వేచ్ఛా వర్తనం. ఎంతటి వాడికైనా, ఎప్పటికైనా దేహ గేహాలే (గృహాలే) వైరాగ్య కారణాలు. స్వామి ఇలా సంకల్పించాడు- ఇప్పటి వరకు చూపిన రాగం చాలు. ఇక, వైరాగ్యం పూని లోకానికి చాటాలి! జగన్నాథుని జీవితంలో కూడా రాగ-విరాగాలు, ధర్మాధర్మాలు, సుఖదుఃఖాలు అన్నీ ఉన్నాయి. కాన, వైరాగ్యం పొంది ఉద్ధవునికి విద్యాదానం-జ్ఞానదానం చేసి అవతార పురుషుడు, జగద్గురువు జనార్దనుడు అంతర్ధానం చెందాడు. 

ఉద్ధవ ఉవాచ- విదురా! భోక్తలైన జీవులు, వారి భోగసాధనలు, భోగశక్తి అన్నీ భగవంతుని అధీనంలోనే ఉంటాయి. మహా యోగి, మహా భోగి, అయిన భగవంతునికే వాని యెడల వైరాగ్యం కల్గినప్పుడు భక్తియోగం అభ్యసిస్తూ భగవంతుని అనుసరించే భక్తులు భోగ సాధనలు, సామగ్రిని విశ్వసించి అంటి పెట్టుకుని ఉంటారా? ఉంటే, భక్తులవుతారా? అసలు మన చేతుల్లో ఏముందని? ‘క్రీడా మృగా వయం’- విధికి ఆటబొమ్మలం కాదా?

మహర్షుల శాపంతో ముసలం పుట్టి యదువంశం నశించింది. విధ్వంసమంతా చూచాడు వాసుదేవుడు. జీవులకు సృష్టి, స్థితులంటేనే సుఖం, సంతోషం, అభయం. లయమంటే చచ్చే భయం! కాని, ఆనంద స్వరూపునికి లయం కూడా ఆనందమే! సర్వాశ్రయుడు, అనాశ్రయుడు (తనకు ఏ ఆధారం అవసరం లేనివాడు), శోభాధాముడు, మేఘశ్యాముడు, ప్రియతమ ప్రభువు సరస్వతీ నదీతీరంలో ఒంటరిగా ఒక చెట్టు మొదట్లో కూర్చున్నాడు. నన్ను తన వద్దకు రమ్మని ‘ఉద్ధవా! ఇక నువ్వు బదరీవనానికి వెళ్లు’ అని చెప్పి నన్ను మాయ పుచ్చి లేచి ఎటో వెళ్లిపోయాడు! స్వామి లీలా సంవరణానికి (అవతార సమాప్తికి) సిద్ధమవుతున్నాడని గ్రహించి, పాదారవింద వియోగం ఓర్వలేక వలదన్నా ఆయన అడుగుజాడలను అనుసరించా. వెళ్లగా వెళ్లగా ఒక లేత రావిచెట్టును ఆనుకొని దేహకాంతి దేవీప్యమానంగా వెలుగుచుండగా ఎడమ తొడపై కుడి పాదం ఉంచి, నాల్గు భుజాలతో విరాజిల్లుతూ ఆసీనుడై ఉన్న- ‘పరుని ప్రసన్నార్తి హరుని భక్త విధేయున్‌'- శరణాగతుల ఆర్తి హరించువాడు, భక్తులకు విధేయుడైన వాసుదేవుని- నన్ను గన్న తండ్రిని, ఆనంద మయుణ్ణి కన్నుల కరవు తీర దర్శించా.

ఈ మహద్దర్శన మహదానంద సమయంలో ఉద్ధవునితోపాటు తానుకూడా మాధవుని మానస దర్శనం చేస్తూ పరవశించి మేను పులకించగా, భక్త కవి పోతన శ్రవణ సుభగాలైన రెండు స్వతంత్ర పద్యాలు- ఆపాత మధురం- ఆలోచనామృతంగా రచించి అజరామరుడయ్యాడు.‘ఆహా! ఆహా! ఏమి నా భాగ్యం? నా నిధిని కన్నాను. నా నాథుని కనుగొన్నాను. సంసార సాగరాన్ని సంతరించాను. ఆశ్రిత రక్షకుని అవలోకించాను. యోగి రాజుల హృదయాలలో విరాజిల్లు వానిని వీక్షించాను. దయాసింధువు, ఆత్మబంధువును దర్శించాను. ముక్కంటి దేవర కూడా కనలేని సాటిలేని వేల్పును సందర్శించాను. కమలాక్షుని కనులారా కాంచగలిగాను. ముక్తి నిధానమైన ముకుందుని కని, చేకొని మురిశాను. ఆనంద నిధి సన్నిధానం శోధించి సాధించాను’. ఇది అమాత్యుని (పోతన) ఆనందానుభూతికి అక్షర విభూతి!

తే.‘సతత యౌవన సుందరీ యుత విహారు

డగుచు సతులెంద ఱందఱ కన్ని రూప

ములను గ్రీడించె బెక్క బ్దములు సెలంగి

నందనందను డభినవానంద లీల’-

మ.‘దనుజా నీక మనేక వారములు దోర్దర్పంబు సంధిల్లగా

వినతా సూను భుజావరోహుడగు నవ్విష్ణున్‌ సునాభ్రాస్ర్తు దా

రని లో మార్కొని పోకు పోకు హరి! దైత్యారాతి యంచుం దదా

ననముం జూచుచు గూలి మోక్షపదమున్‌ బ్రాపింతురత్యున్నతిన్‌.


మత్త.‘కంటి గంటి భవాబ్ధి దాటగ గంటి నాశ్రిత రక్షకుం

గంటి యోగి జనంబు డెందము గంటి జుట్టము గంటి ము

క్కంటికిం గనరాని యెక్కటి గంటి దామర కంటి జే

కొంటి ముక్తి నిధానముం దలకొంటి సౌఖ్యము లందగన్‌'


-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ,  98668 36006 


VIDEOS

logo