శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Devotional - Jan 24, 2021 , 23:14:48

మాంగల్య రక్షణకే గౌరీపూజ!

మాంగల్య రక్షణకే గౌరీపూజ!

పుష్యమాసంలో ఆదివారాలు గౌరీపూజ చేయాలంటారు. దాని విశిష్టత ఏమిటి? అలాగే, ఆ ఆదివారాల్లో సాయంకాలం ఆరు గంటల లోపు ఆహారం (అన్నం) తీసుకోవాలంటారు. దీనిలోని ఆంతర్యం ఏమిటి? - డి.అహర్ణి, హైదరాబాద్‌

సనాతన భారతీయ సంప్రదాయంలో గౌరీదేవిని సరస్వతి (జ్ఞానం), లక్ష్మి (ఐశ్వర్యం), పార్వతి (సౌభాగ్యం) ‘సమష్టి శక్తి’గా చెప్తారు. ఈ పరిపూర్ణ సమష్టి శక్తి సుమంగళత్వానికి, సుభగత్వానికి ప్రతీక. ప్రతి స్త్రీ ఆనందంగా, సుమంగళిగా ఉండేందుకు శ్రద్ధతో ఆచరించే వ్రతాలలో ‘గౌరీపూజ’ ప్రధానమైంది. మహా పతివ్రత సతీ సావిత్రి యమధర్మరాజు (మృత్యువు)ను ఎదిరించి, తన పతి ప్రాణాలను రక్షించుకున్నట్లుగా పరమశివుడు హాలాహలం మింగినా తన సౌభాగ్యాన్ని గౌరీదేవి రక్షించుకున్నట్లుగా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మాంగల్యాలు కూడా రక్షింపబడతాయని స్త్రీలు విశ్వసిస్తారు.  

పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఈ కాలంలో గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి పూజించడం వల్ల సకల శుభాలను పొందుతాం. భాద్రపదం నుండి పుష్యమాసం వరకు ప్రతి నెలలో గణపతి, శక్తి, శివుడు, విష్ణువు, భాస్కరులకు ప్రాధాన్యాన్ని ఇచ్చి వ్రతాలను ఆచరించడం ‘పంచాయతన దీక్ష’గా చెప్తారు. దీని ప్రకారం, పుష్యమాసం జ్ఞానప్రదాతయైన సూర్యునికి సంబంధించింది. అందులోనూ ‘ఆదివారం’ మరింత ప్రధానమైంది. కనుక, ఈ మాసంలో ఆదివారం నాడు శ్రద్ధతో ఆచరించిన గౌరీవ్రతం వల్ల మహిళలంతా సౌభాగ్యాన్ని పొందుతారన్నది శాస్త్రం. 

‘గౌరీపూజ’ను ప్రదోషకాలంలో అంటే పగలు నుండి రాత్రికి మారుతున్న సంధ్యా సమయానికి ముందుగా ఆచరించి భోజనాదులు ముగించడాన్ని ‘ఛాయానక్తం’గా చెప్తారు. దీనివల్ల జీర్ణప్రక్రియ సరిగా పని చేస్తుందనే శాస్త్రీయాంశం కూడా ఇందులో ఇమిడి ఉన్నది. ఈ ప్రదోషకాలం పరమేశ్వరుడు తాండవ నృత్యం చేసే సమయం. ఆ నృత్యం గౌరీదేవికి ప్రీతిపాత్రమైంది. అందుకే, ఆ వేళ వ్రతాన్ని ముగించి అతిథులతోకూడి భుజించడం శుభప్రదంగా మారింది.

-పాలకుర్తి రామమూర్తి

VIDEOS

logo