గురువారం 25 ఫిబ్రవరి 2021
Devotional - Jan 23, 2021 , 00:02:23

సృష్టి మూలంతో అనుసంధానం!

సృష్టి మూలంతో అనుసంధానం!

భారతదేశంలో దేవాలయాలు ఇంత ఎక్కువగా ఉండటానికి ‘శాస్త్రీయ కారణం’ ఉంది. ఆదియోగి శివుడు, అగస్త్య మునిని దక్షిణ భారతదేశానికి పంపాడు. డెక్కన్‌ పీఠభూమికి దక్షిణం వైపున్న అన్ని జనావాసాలను ఏదో రూపంలో ప్రతిష్ఠీకరించడం ద్వారా ‘ఆధ్యాత్మిక ప్రక్రియ’ను అగస్త్య ముని విస్తృత పరిచారు. ఆయన ఏ ఒక్క జనావాసాన్నీ వదలలేదు. ఈ సందర్భంలోనే ఆయన, ‘అభివృద్ధి, విజ్ఞానాల మూలంగా ప్రపంచం గాడితప్పినప్పుడు, విజ్ఞానం నిజంగా విషమైనప్పుడు, మంచి చేయవలసింది చెడుగా మారినప్పుడు.. ఈ పని వికసించి మేలు చేస్తుంది’ అనీ అన్నారు. ‘ప్రతిష్ఠీకరణ’ అనేది ఒక జీవ ప్రక్రియ. ఎలాగంటే, ‘మట్టిని ఆహారంగా చేస్తే ‘వ్యవసాయం’. అదే ఆహారాన్ని రక్తమాంసాలుగా మారిస్తే ‘జీర్ణం చేసుకోవడం’. ఈ మాంసాన్ని మళ్ళీ మట్టిగా చేస్తే ‘ఖననం చేయడం’. శిలను లేక ఆఖరికి ఖాళీ ప్రదేశాన్ని గానీ ‘దివ్యం’గా చేయగలిగితే దానినే ‘ప్రతిష్ఠీకరణ’ అంటారు. 

సృష్టిలో ఉన్నదంతా ఒకటే శక్తి అని, అదే వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్నదని ఆధునిక విజ్ఞానం చెబుతున్నది. ఆ విధంగా చూస్తే ‘దేవుడు అనేదీ, రాయి అనేదీ, పురుషుడు లేక స్త్రీ అనేది, దెయ్యం అనేదీ విభిన్న రీతులలో పనిచేస్తున్న ఒకటే శక్తి’ అని అర్థమవుతుంది. ఉదాహరణకు విద్యుచ్ఛక్తి కాంతిగా, శబ్దంగా, ఇంకా అనేక విధాలుగా సాంకేతికతనుబట్టి ప్రకటితమవుతుంది. అంటే, అది కేవలం అక్కడ వాడిన సాంకేతికతనుబట్టే ఉంటుంది. ఆ సాంకేతికత ఉంటే  చుట్టూ వున్న స్థలాన్ని మీరు ‘ప్రతిష్ఠీకరణ’ చేయగలరు. కేవలం, ఒక రాయిని దేవునిగానో, దేవిగానో చేయగలరు. ఈ విజ్ఞానమే ‘ప్రతిష్ఠీకరణ’. ఈ ప్రక్రియ గురించి ఎంతో విజ్ఞానం భారతీయ సంస్కృతిలో వెల్లివిరిసింది. ఎందుకంటే, దీనిని అతిముఖ్యమైందిగా భావించారు. మీరేం తింటున్నా, ఎలా ఉన్నా, ఎంత కాలం జీవించినా, మీరు ఈ సృష్టి మూలంతో అనుసంధానం కావాలన్న కోరిక మీకు ఏదో సమయంలో వస్తుంది. అటువంటి అవకాశం ప్రపంచంలో కలిగించకపోతే, ప్రతి మనిషికీ ఇది అందుబాటులో లేకపోతే, ఆ సమాజం మనిషికి అసలైన శ్రేయస్సును సమకూర్చడంలో విఫలమైనట్లే. ఈ ఎరుకతోనే నాటి భారతీయ సంస్కృతిలో ప్రతి వీధిలోనూ రెండు, మూడు దేవాలయాలు ఉండేవి. ఒక ఆలయానికి, మరో దేవాలయానికీ మధ్య ఇది పోటీ ఏమీ కాదు. కొద్ది ప్రదేశమైనా ప్రతిష్ఠితం కాకుండా వుండరాదన్నది అందులోని కాంక్ష. ‘ప్రతిష్ఠ’ చేయని ప్రదేశంలో ఎవరూ నివసించకూడదని ఆ కాలంలో ముందు దేవాలయాన్ని కట్టి, ఆ తర్వాత ఇండ్లు కట్టేవారు. 

తమిళనాడు రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది. అక్కడి ప్రముఖ పట్టణాలన్నిటిలో ఒక పెద్ద దేవాలయం, దాని చుట్టూర పట్టణం. ఎందువల్ల అంటే, మీరు నివసిస్తున్న గృహం ముఖ్యం కాదు. మీ ఇల్లు 10,000 చదరపు అడుగులా, 1,000 చదరపు అడుగులా అన్నదీ ముఖ్యం కాదు. ప్రతిష్ఠీకృతమైన చోట మీరు నివాసం ఉండటం ముఖ్యం. అది మీ జీవితంలో ఎంతో తేడాను తీసుకువస్తుంది. ఈ అవగాహనతోనే కనీసం 25 ఇండ్లున్న చోటల్లా ఒక ఆలయం ఉండాలి. ఆ దేవాలయానికి మీరు వెళతారా? పూజలు చేస్తారా, చెయ్యరా? ఆ మంత్రాలు మీకు వచ్చా, రావా? ఇవేవీ ముఖ్యం కాదు. మీరు మీ జీవితంలో ప్రతిక్షణం ప్రతిష్ఠీకృతమైన ప్రదేశంలోనే నివసించాలన్నది ఇక్కడ ప్రధానం.


VIDEOS

logo