గురువారం 25 ఫిబ్రవరి 2021
Devotional - Jan 22, 2021 , 00:08:36

సర్వం ఖల్విదం బ్రహ్మ!

సర్వం ఖల్విదం బ్రహ్మ!

‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్న గొప్ప వాక్యాన్ని ‘ఛాందోగ్యోపనిషత్తు’ మనకు ప్రసాదించింది. ‘సర్వం ఖలు ఇదం బ్రహ్మ’. ‘సర్వం’ అంటే చరాచర సృష్టి సమస్తమూ, ‘బ్రహ్మం’ అంటే ‘పరమాత్మతో నిండి వున్నదని’ అర్థం. ‘చరం’ అంటే కదిలేది. ‘అచరం’ అంటే కదలనిది. వీటినే ‘స్థావర జంగమములు’ అని కూడా అంటారు. ‘చెవులు, చర్మం, కండ్లు, నాలుక, నాసిక’ అన్నవి మనకున్న జ్ఞానేంద్రియాలు. ఇవి వరుసగా ‘శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల’ను మనకు పట్టిస్తవి. జ్ఞానేంద్రియాల ద్వారా మన మనస్సు గ్రహించి తన అనుభవంలోకి తెచ్చుకొంటున్న పదార్థం పేరు ‘ప్రకృతి’. ప్రకృష్టమైన (శ్రేష్ఠమైన) కృతి ‘ప్రకృతి’. ‘కృతి’ అంటే, చేయబడింది లేదా సృజించబడింది. ఎవరివల్ల సృజించబడింది అంటే పరమాత్మవల్ల!

‘కదల గలిగిన వస్తువులు చైతన్యభరితాలని, కదల లేనివి చైతన్యరహితాలని’ మన భావన. ‘చైతన్యమే బ్రహ్మం’ అన్న ప్రతిపాదన పైన జనకుని సభలో ఒకానొకప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. చైతన్యభరితాలైన పదార్థాలు కొన్నాళ్లకు చైతన్యరహితాలై మట్టిలో కలిసి పోతున్నాయి. చైతన్యమున్న వస్తువు తన చైతన్యాన్ని కోల్పోవడం సృష్టి నియమం అయినప్పుడు ఏదో ఒక దశలో చైతన్యరహిత పదార్థం చైతన్యభరితం కావడం కూడా సృష్టి నియమమై ఉండాలి. విత్తనం మన చేతిలో వుంటే మొలకెత్తదు. దానిని భూమిలో పాతి నీరు పోస్తేనే మొలకెత్తుతుంది. మన చేతిలోని బీజంలో ప్రాణశక్తి వున్నందుననే అది మొలకెత్త గలుగుతున్నది. విత్తనంలోని ప్రాణశక్తి మనం పోసిన నీటి సహాయంతో భూమిలోని చైతన్యాన్ని గ్రహించి, మొలకెత్తుతున్నది. విత్తనం మొలకెత్తడానికి వేడి కావాలి. సూర్యుని సహాయంతో భూమి వేడిని కలుగజేస్తున్నది. ‘వేడి’ అంటే ‘అగ్ని’. విత్తనం గాలిని పీల్చుకొన్నప్పుడే అది తన చైతన్యాన్ని ప్రదర్శింపగలుగుతుంది. గింజను పాతే ముందు నేలను తవ్వి గుల్లగా చేస్తాం. తద్వారా విత్తనానికి కావలసిన గాలి లభిస్తుంది. కొత్తగా పుట్టే మొక్కకు తన అస్తిత్వాన్ని ప్రదర్శింపగలిగే అవకాశాన్ని ఆకాశం ఇస్తున్నది. పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) కారణంగానే ఈ సృష్టి మనకు దృశ్యమానమవుతున్నది.

‘చైతన్యరహితంగా కనిపించే విత్తనం’ చైతన్యం లేని భూమిలో నాటబడినప్పుడు ‘చైతన్యభరితమైన మొక్క’గా పుట్టుకొస్తున్నది. జడ పదార్థాలుగా కనిపించే పదార్థాలలోని చైతన్యం ‘సుషుప్తి’లో అంటే ‘గాఢనిద్ర’లో ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు మేల్కొంటుంది. కనుక, చైతన్యరహితమైన పదార్థమన్నదే ఈ సృష్టిలో లేదన్నది జనకుని సభ తీర్మానం. ఈ చరాచర ప్రకృతి మనకు ఐదు రకాలుగా అనుభవంలోకి వస్తున్నది. అవి: అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం. ‘అస్తి’ అంటే ఉండటం. ‘భాతి’ అంటే ఆ వస్తువు ఉన్నట్టుగా మనకు తెలియడం. ‘ప్రియం’ అంటే ఆ వస్తువు వున్న కారణంగానో లేక మన వినిమయంలోకి వచ్చిన కారణంగానో మనకు ఆనందం కలగడం. విషయం గుర్తుండటానికిగాను పదార్థం లేదా వస్తువుకు మనం పేరు పెట్టుకొంటాం, అది ‘నామం’. వస్తువు ఆకారాన్ని గుర్తు పెట్టుకొంటాం, అది ‘రూపం’. ప్రకృతి సిద్ధంగానో, మానవయత్నం కారణంగానో వస్తువుల రూపాలు మారుతాయి. రూపం మారినప్పుడు ఆయా వస్తువుల నామాలు సైతం మారుతాయి. కానీ, ఆ వస్తువు మూలరూపంలో లేదా మారినరూపంలో కావచ్చు- ఉండటం, ఉన్నట్లుగా మనకు తెలియడం, ఆ తెలియడం వల్ల మనకు లభించే సంతోషంలో మార్పు ఉండదు. మార్పు చెందని అస్తి, భాతి, ప్రియాలను ‘సత్‌, చిత్‌, ఆనందాలు’గా అనువదించుకోగలిగితే చాలు, సృష్టి సమస్తమూ మనకు ‘పరమాత్మ స్వరూపం’గా గోచరిస్తుంది. అప్పుడే ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్న గొప్ప వాక్యానికి అర్థం బోధపడుతుంది.

వరిగొండ కాంతారావు

94418 86824

VIDEOS

logo