గురువారం 25 ఫిబ్రవరి 2021
Devotional - Jan 21, 2021 , 00:08:55

అగ్రజుల ధర్మమే శిరోధార్యం!

అగ్రజుల ధర్మమే శిరోధార్యం!

రామరాజ్యం సుఖసౌభాగ్యాలతో తులతూగడానికి కుటుంబవ్యవస్థే మూలమని ‘రామాయణం’ ప్రకటించింది. కాలం ఏదైనా కుటుంబాల పరిరక్షణతో సమాజం, తద్వారా రాజ్యం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా విరాజిల్లుతా యి. తండ్రి మార్గదర్శనం చేసే సారథి కావాలి. కుటుంబసభ్యులందరూ ఆయనకు సహకరిస్తూ, సూచనలను పాటిస్తూ, సలహాలిస్తూ విధేయులై నడిస్తే ప్రగతి సాధ్యమవుతుంది. సమాజంలోనూ కుల, జాతి, వర్గ భేదాలు లేకుండా అందరూ కష్టపడి పని చేస్తే సత్ఫలాలను అనుభవిస్తారు. సమాజానికి సూక్ష్మరూపమే కుటుంబం. రాజ్యానికి ప్రతిబింబం సమాజం. రామాయణ, మహాభారత ఇతిహాసాలు, పురాణాల కాలాల్లో ప్రజలు ఎవరూ సోమరులు కాకుండా చైతన్యస్ఫూర్తితో జీవించారు. ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా కాకుండా ఉత్తమపౌరులుగా పిల్లలను తీర్చిదిద్దగలిగారు. దీనికి ఉదాహరణలుగా రాముడి పితృవాక్య పాలన, లక్ష్మణాదుల భ్రాతృసేవనం, మాతృ గౌరవం వంటివన్నీ ప్రముఖ పాత్ర పోషించాయి. పాండవులు ధర్మరాజుకు విధేయులై కష్టసుఖాలను సమదృష్టితో అనుభవించారు. ధృతరాష్ర్టుని గుడ్డితనాన్ని గౌరవించిన గాంధారి జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుంది.

తల్లిదండ్రుల క్రమశిక్షణ సంతానాన్ని ప్రభావితం చేస్తుంది. వారు తరచూ గొడవలు పడుతూ, దురలవాట్లకు బానిసలు కావటం వల్ల పిల్లల జీవితాలు అల్లకల్లోలమవుతాయి. మొత్తంగా కుటుంబమే విచ్ఛిన్నమవుతుంది. కొంత త్యాగం, సర్దుబాటు, సహనం కుటుంబసభ్యులందరికీ ముఖ్యమే. కుటుంబ స్థితిగతులపట్ల పిల్లలకు పూర్తి అవగాహన కలిగించాల్సింది తల్లిదండ్రులే. వాస్తవాలను దాచి, పెద్దరికం కోసం శక్తికి మించిన ఊహాలోకాల్లో వారిని తిప్పితే ఫలితాలు చేదుగా వుంటాయి. దర్పం, డాంబికం దరి రాకూండా చూడాలి. కైకేయి కోర్కెలు విన్న దశరథుడు ‘సత్యేన లోకాన్‌ జయతి దీనాన్‌ దానేన రాఘవ గురూన్‌ శుశ్రూషయా వీరో ధనుషాయాభి శాత్రవాన్‌' అంటాడు. కొడుకు ప్రవర్తన, నడతపై తండ్రికి విశ్వాసం ఉండాలి. అలాగే, కైకేయి కోరికలను దశరథుడు ప్రత్యక్షంగా రామునికి చెప్పలేదు. సుమంత్రుని పిలుపుతో వచ్చిన రామునికి కైకేయి తండ్రి మాటగా చెప్పింది. మనస్ఫూర్తిగా పినతల్లిని నమ్మాడు. తండ్రి ఆజ్ఞను పాటించాడు. లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, సీతామాత అందరూ రాఘవుని నిర్ణయాన్ని తలదాల్చారు. ‘మహాభారతం’లో ధర్మరాజు జూదంలో ఓడినా, ద్రౌపది వస్ర్తాపహరణం జరిగినా ఆ బాధ్యతను కుటుంబమంతా అంగీకరించింది.  

ఎదురుగా కనిపించే తల్లిదండ్రులు, గురువులను దేవతలుగా గౌరవించి, ఆదరించాలని ‘రామాయణం’ ద్వారా వాల్మీకి మహర్షి మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారు. ‘కుటుంబ వాత్సల్యం’ అన్నది ప్రేమానురాగాలతో కట్టుబడిన ఒక పవిత్రబంధం. రాజ్యం శాసనాలద్వారా పాలిస్తుంది. వసిష్ఠునిద్వారా భార్య హక్కులు, బాధ్యతలను వాల్మీకి వివరించాడు. స్త్రీ మగనికి అర్థాంగి. హక్కులు, బాధ్యతలలో సమానభారం వహించాలన్న ఉపదేశంతో వనితాలోకాన్ని అద్వితీయంగా గౌరవించింది రామరాజ్యం. అనివార్య కారణాలతో భర్త కుటుంబానికి దూరమైనప్పుడు భార్యే సంతానాన్ని పెంచి పోషించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంది. ఎన్ని కష్టాలు పడి అయినాసరే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దుతుం ది. నాడైనా, నేడైనా, ఏనాడైనా.. రాజ్యానికి- సమాజం, సమాజానికి- కుటుంబం పునాదిగా పటిష్ఠబంధం కలిగి ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమని ‘రామాయణం’ సూత్రీకరించింది. నేటి సమాజానికి ‘సక్రమ కౌటుంబిక వ్యవస్థ’ ఆవశ్యకతను, కుటుంబసభ్యుల సమైక్యత, సదవగాహనలలోని గొప్పతనాన్ని ఈ రకంగా తెలియజెప్పిన రామాయణ, మహాభారత గాథలను మానవాళి సరైన పంథాలో అవగాహన పరచుకోవలసి ఉంది.


VIDEOS

logo