బుధవారం 27 జనవరి 2021
Devotional - Jan 14, 2021 , 01:13:57

భవభయ హారిణి చరణమే శరణం!

భవభయ హారిణి చరణమే శరణం!

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః

త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా

భయాత్‌ త్రాతుం దాతుం ఫలమపి చ వాంచాసమధికం

శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ!

- ఆదిశంకరాచార్యులు (సౌందర్యలహరి: 4)

‘అమ్మా! నీ కన్నా ఇతరులైన దేవతలు మేము వరాలను, అభయాన్ని ఇస్తామంటూ వరద, అభయ ముద్రలను దాల్చి ఉన్నారు. కానీ, నిన్ను శరణు కోరిన వారిని రక్షించడానికి ప్రత్యేకంగా అభినయం చేసే ముద్రలు అవసరం లేదు. సకల లోకాలనూ రక్షించేందుకు నీ చరణాలు మాత్రమే చాలు’ అన్నారు ఆదిశంకరులు. ఆగమశాస్ర్తాన్ని అనుసరించి, ఎడమచేయి కిందికి చూపడం ‘వరద ముద్ర’ అయితే, కుడిచేయి పైకి చూపేది ‘అభయ ముద్ర’!

‘దిత్‌' అనే ధాతువు నుంచి వచ్చిన శబ్దానికి ‘దేవతలు’ అని అర్థం. దివ్యమైన శరీరం కలిగినవారు దేవతలు. వీరికి ‘మానవాతీత శక్తులు’ ఉంటాయి. వీరు వరాలను, సిరి సంపదలను ఇవ్వగలరు. కోరికలూ తీర్చగలరు. కానీ, అన్నింటికన్నా భయంకరమైన ‘భవభయం’ నుంచి కాపాడటం వీరికి సాధ్యపడదు. జనన-మరణాలను శాసించే సామర్థ్యం లేని దేవతలు వరద-అభయ ముద్రలను అభినయిస్తున్నారే కానీ, శాశ్వతత్త్వాన్ని అనుగ్రహించే సామర్థ్యం వారికెక్కడున్నది తల్లీ! బ్రహ్మాది దేవతలైనా నీ చరణాలను ఆశ్రయిస్తే నువు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాలే వారివారి కర్తవ్య పాలనలో ఉపకరిస్తున్నాయి. ‘బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా’ అంటున్నది లలితా సహస్రనామం. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలతో సంస్తుతింపబడిన లలితాంబిక పాదాలను సేవించి, పొందిన శక్తి సామర్థ్యాలతో వారు తమకు అప్పగించిన విధి నిర్వహణను నిర్వర్తించగలుగుతున్నారు. కాబట్టి, ‘భవ భయ హారిణియైన అమ్మ చరణాలను ఆశ్రయిస్తే తప్ప, ఇహపర సౌభాగ్యాన్ని పొందడం ఎవరికీ సాధ్యపడదని’ శంకరులు అంటున్నారు.

ఐహికమైన కోరికలను తీర్చడం ఏ దేవతకైనా సాధ్యమే కానీ, అత్యున్నతమైన కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యం మాత్రం వారికి లేదు. అందువల్ల, పరాధీనులైన దేవతలను కాక త్రిపురసుందరిని ఆరాధిస్తే ఆమె కోరిన లేదా ఆశించిన దానికన్నా ఎక్కువ (ఫలమపిచ వాంఛా సమధికం దాతుం) ఫలితాన్నిస్తుంది’. అనంతమైన శక్తి సంకల్పం వల్ల జనించిన దేవతల శక్తి సామర్థ్యాలు పరిమితమైనవే. దేవతలకూ కాల పరిమితి ఉన్నది. దేవతలకే శాశ్వతత్వం లేదు. సృష్టిలోని సహజమైన ఆరు దోషాల (జాయతే: పుట్టడం, అస్తి: ఉండటం, విపరణమతే: మార్పు చెందటం, వర్ధతే: పెరగడం, క్షీయతే: క్షీణించడం, నశ్యతే: నశించడం)కు వారుకూడా లోబడినవారే. ఈ దోషాలు దేవతలకూ ఉన్నాయి. కాబట్టి, వారే శాశ్వతం కానప్పుడు వారికి భవభయం నుంచి కాపాడి, శాశ్వత సుస్థితిని ప్రసాదించే సామర్థ్యం ఎక్కడ ఉంటుంది!

లలితా త్రిపుర సుందరిని సేవించిన వారికి ఐహిక ఆముష్మిక సౌభాగ్యం లభిస్తుంది. సుందరియే అమ్మవారు, ఆమెయే సచ్చిదానంద స్వరూపిణి. లహరియై ప్రవహిస్తున్న, ప్రసరిస్తున్న విశ్వవ్యాప్తమైన లోకాతీత లావణ్యాన్ని (సౌందర్యాన్ని) సాధకులు ఆరాధిస్తున్నారు. భూత భవిష్య ద్వర్తమానాలలో ఆమెయే వ్యాపించింది. ఆదిమధ్యాంతాలు లేనిది, జన్మ మృత్యుజరాదులు లేనటువంటిది, సత్యం, నిత్యం శాశ్వతమైన అమ్మవారిని ఆరాధించిన వారికి మాత్రమే ‘మోక్షం’ లభిస్తుంది. ‘శివశ్శక్యైక్య రూపిణి’ అంటున్నది లలితా సహస్రనామం. ‘శివుడు, శక్తి.. ఏకరూపాలుగా ఉన్న లలితాదేవిని పూజించాలన్నా ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి’ అని అంటున్నారు శంకరులు. సూర్యుని నుంచి కాంతిని ఎలాగైతే వేరు చేయలేమో అలాగే, శివుని నుంచి శక్తిని కూడా వేరుగా చూడలేం. ఆమె పాదాలను ఆశ్రయించి సమస్త దేవతలూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. మనకూ అదే శరణం.

 పాలకుర్తి 

రామమూర్తి


logo