స్వీయ ఉద్ధరణకు శక్తి ఉపాసన!

‘ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవ సాధయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ॥
- భగవద్గీత (6.5)
అందరూ తమను తామే ఉద్ధరించుకోవాలి. వారిని వారు అధోగతి పాలు చేసుకోకూడదు. ఇంద్రియాలను జయించే ప్రయత్నం చేస్తే మనిషి తనకు తానే బంధువవుతాడు. వాటిని జయించకపోతే తనకు తానే శత్రువవుతాడు. ఈ లోకంలో పుట్టిన వారందరూ ఏవో కర్మల కోసమే పుడుతుంటారు. పుట్టిన ప్రతివారు తప్పనిసరిగా తామున్న స్థితి నుంచి ఉన్నత స్థితివైపు ఎదగడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఎవరో వచ్చి తమను ఉద్ధరించే అవకాశం లేదు. తమ కర్మల ప్రకారమే ఎవరైనా తమ చుట్టూ చేరుతారు. అయినా, తమకున్న పుణ్యం వల్లే వారు తమకు ఉపయోగపడతారు. అందువల్ల, అనవసరమైన విషయాలపై మనసు కేంద్రీకరించకుండా, ఉన్నత శక్తిపై దృష్టిసారించినప్పుడు మాత్రమే తమను తాము ఉద్ధరించుకునే అవకాశం కలుగుతుంది.
సమస్యలను చూస్తూ, ఇంద్రియాలకు లోలత్వం పొందుతూ స్వల్ప సంతోషాలకు పొంగిపోతూ, చిన్న బాధలకే కుంగిపోవడం వల్ల ఎదగడం కష్టం. అసలు సమస్యలు ఎందుకు వస్తుంటాయి? తమకే అనేక రూపాల్లో కష్టాలు వస్తుంటాయని కొందరు ఎందుకు భావిస్తుంటారు? తట్టుకునే శక్తి ఉన్నంత వరకు ఏదీ సమస్య కాదు. తట్టుకునే శక్తి లేనప్పుడే దేనినైనా సమస్యగా భావిస్తాం. శక్తి కావాలనుకున్న వారు శక్తి చుట్టూ తిరగాలి. అంతేకాని, సమస్యల చుట్టూ సంచరించకూడదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ ఒక నియమబద్ధంగా సంచరిస్తుంది. దానివల్లే భూమికి అపరిమితమైన శక్తి వస్తుంది. అదేవిధంగా మనకు సమస్యలు ఏర్పడినప్పుడు సమస్యపై దృష్టిని తగ్గించి, పరిష్కార శక్తివైపు దృష్టిసారించాలి. మూలశక్తిని ధ్యానించాలి. పాంచభౌతిక శక్తితో కొంత సాన్నిహిత్యం పెంచుకోవాలి. మన దైవ స్వరూపాలన్నీ ఇలాంటి శక్తి స్వరూపాలే. ఇష్ట దైవానికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా ఉపాసించడం మొదలుపెడితే అసలు సమస్యలే మనకు రాకుండా కాపాడుకునే అవకాశం కలుగుతుంది. నిరంతరం ఉన్నత శక్తితో కలిసి ఉండటం వల్లనే సమస్యలు చిన్నవిగా మారి పరిష్కారమవుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలను నిర్వహించగలిగే శక్తిని సముపార్జించుకునే అవకాశం కూడా వీరికి కలుగుతుంది. అందుకే, తమను తామే ఉద్ధరించుకోవాలి. చుట్టూ ఉన్న వారెవరూ తమను ఉద్ధరించేవారు కారు. వారు తమ కర్మలను పూర్తిచేయడానికి వచ్చినవారే. వారి ద్వారా వచ్చే ఇబ్బందులను అధిగమించాలంటే మనకు అపరిమితమైన శక్తి కావాలి. అందుకే శక్తిని ఉపాసిస్తూ నిరంతరం శక్తితో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఉండాలి.
ఎవరో మనలను ఉద్ధరిస్తారని వారి కోసం ఎదురుచూస్తూ నిరంతరం వారి చుట్టూ తిరగడం అనవసరం. దాని బదులుగా నిరంతరం తాము ఉన్నత శక్తిగా భావించే దైవం చుట్టూ మనసును కేంద్రీకరింపజేస్తూ, దానధర్మాలతో జీవించాలి. అప్పుడు ఆ దైవమే మన సమస్యలకు పరిష్కార శక్తిని ప్రసాదిస్తుంది. మనం ఊహించనివారు వచ్చి మన సమస్యలను తీర్చిపోతూ ఉంటారు. మనల్ని మనం ఉద్ధరించుకోవడం, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి చేరడం వంటి పనులు మన చేతిలోనే ఉంటాయి. ఆ మార్గాన్ని అనుసరించినపుడే వ్యక్తి పూర్ణశక్తిగా, మానవుడు మహనీయుడిగా మారతారు.
-సాగి కమలాకరశర్మ
తాజావార్తలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు