శుక్రవారం 22 జనవరి 2021
Devotional - Jan 12, 2021 , 00:57:26

జీవులు నిత్యముక్తులు కాలేరు!

జీవులు నిత్యముక్తులు కాలేరు!

పరమాత్మను ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అని ఉపనిషత్తులు అభివర్ణించాయి. పరమాత్మ శాశ్వతమైన ఉనికి కలిగినవాడు కనుక ‘సత్యం’. ‘సత్‌' అంటే ఎల్లప్పుడూ ఉండేది. ‘సత్‌'నుంచి వచ్చిందే సత్యం. పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. కనుకే.. సృష్టి తర్వాత ప్రళయం, ప్రళయం తర్వాత సృష్టి నిరంతరాయంగా ఏర్పడుతున్నాయి. జీవులు చేసే భిన్నమైన కర్మలకు ఫలాలిచ్చేవాడు పరమాత్మనే. వేద ప్రకారం ‘మూడు సత్తులు’ (ఉనికి) గల పదార్థాలున్నాయి. అవి: పరమాత్మ, ప్రకృతి, జీవులు. వీటిలో పరమాత్మ శ్రేష్ఠుడు. కనుక ‘సత్యం’ అనే పేరుతో పిలువబడుతున్నాడు. ‘సత్సు యది ఉత్తమం తత్‌ సత్యమ్‌' అని సత్యపద నిర్వచనం. ‘సత్యమేవ జయతే’ అన్నప్పుడు పరమాత్మవల్ల విజయం లభిస్తుందని భావించాలి. ప్రపంచానికి ఉపాదాన కారణమైన ప్రకృతి నశించదు. కనుక, ఇదీ సత్తు. అదే విధంగా, జీవులకు జనన మరణాలు శరీర సంబంధమైనవే తప్ప, సహజమైనవి కావు. కాబట్టి, జీవులుకూడా ‘సత్తు’ పేరుతోనే పిలువబడతారు. ఐతే, జీవ-ప్రకృతులకు అధిపతి అయిన పరమాత్మ మాత్రం ‘నిత్య సత్య’మని, ‘సత్యస్వరూపుడని’ పిలువబడుతున్నాడు.

‘పరమాత్మ’ అంటే ‘పూర్ణ జ్ఞానమే’. ‘తత్రనిరతిశయం సర్వజ్ఞబీజం’ (యోగ: 1-25) అని యోగ దర్శనకారుడు పతంజలి అన్నాడు. హెచ్చుతగ్గులు లేనిదై, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండే జ్ఞానాన్ని స్వరూపం (లక్షణం)గా కలిగినవాడు పరమాత్మ మాత్రమే. ప్రకృతి జడం. కనుక, దానికి జ్ఞానం లేదు. సత్వ, రజస్‌, తమో గుణాణువులను కలిగింది ప్రకృతి. దానికి జ్ఞానం (తెలివి) లేదు. మిగిలిన జీవుల్లో ‘లోకో భిన్నరుచిః’ అన్నట్లు ఒక్కొక్కరికి ఒక్కో జ్ఞానం ఉంటుంది. ప్రకృతి జ్ఞానం లేనిది. జీవులు అల్పజ్ఞులు. పరమాత్మ మాత్రమే సర్వజ్ఞుడు. పరమాత్మ సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడే కాడు, అనంతుడు కూడా. పరమాత్మ శక్తి అనంతం. అతని స్వరూపం అనంతం. అతని వ్యాపకత్వం, ప్రకాశం అనంతం. అతనిలోని ఆనందం అనంతం. ఆద్యంతాలు లేని తత్త్వమే పరమాత్మ. కనుక, అతని లీలలూ అనంతం. పరమాత్మ బ్రహ్మకూడా. అంటే, గొప్పవాడు. ప్రపంచాన్ని సృష్టించి, లయం చేసేవాడు కనుక, అతడు బ్రహ్మ. జీవులకు ఉపభోగార్థమై వారి కర్మలకు అనుగుణంగా శరీరాలు ఇస్తాడు, ముక్తినికూడా ప్రసాదిస్తాడు. సూర్యచంద్రాదులకంటే అత్యధిక స్వయంప్రకాశ శక్తి కలిగిన పరమాత్మ వేదాలను ప్రకాశింపజేస్తాడు. అందుకే, గొప్పవాడైనాడు. పరమాత్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు కూడా. ప్రపంచం ప్రవాహరూపంలో ఉంటుంది. కనుకనే అది అనిత్యం. అది ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. కనుక, ప్రపంచానికి ఉపాదాన కారణమైన ప్రకృతికూడా ‘సత్‌' అయినా, దాని పరిణామ రూపమైన ప్రపంచం నిత్యమైంది కాదు. 

జీవులూ సత్యమే అయినా వారి జీవనయాత్రలు, శరీరాలూ నిత్యమైనవి కావు. పరమాత్మ నిత్యుడైనట్లే పరిశుద్ధుడు కూడా. అతడు పాపం లేనివాడు, పాపం అంటనివాడు. ఎల్లప్పుడు పరిశుద్ధుడేకాక నిత్య బుద్ధుడుకూడా. ఆయనలోని జ్ఞానం ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. అన్నిటికీ మించి నిత్యముక్తుడు. అతనికి ఏ బంధనాలు లేవు. దేహధారి కావడానికి కావలసిన కర్మలు చేయడు. జీవులకు వలె మూడు విధాలైన దుఃఖాలు అతనిని అంటవు. అతనిలో మిథ్యాజ్ఞానం లేదు. కనుక, దుఃఖం లేదు. అందుకే, అతనిని ‘ఆనంద స్వరూపుని’గా లెక్కిస్తారు, ఉపాసిస్తారు. పరమాత్మ వలె జీవులు నిత్య ముక్తులు కాలేరు. జీవులు ఒకవేళ ముక్తిని సంపాదించుకొన్నా అది ప్రళయం వరకే! మళ్లీ వచ్చే సృష్టిలో జన్మలెత్త వలసిందే. సాధారణంగా జీవులను ముక్తజీవులుగా పేర్కొన్నా వేదోపనిషత్తులు మాత్రం పరమాత్మనే నిత్యముక్తునిగా నిర్ధారించాయి. 

ఆచార్య మసన ,చెన్నప్ప

98856 54381


logo