శనివారం 23 జనవరి 2021
Devotional - Dec 03, 2020 , 02:00:48

ప్రాకృతిక శక్తికి ప్రతీక ‘శ్రీమాత’

ప్రాకృతిక శక్తికి ప్రతీక ‘శ్రీమాత’

‘సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి

త్వద్వందనాని దురితాహరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు నాన్యమ్‌'.

- కళ్యాణ వృష్టి స్తవం

శ్రీసూక్తం ఓజోన్‌ పొరనే ‘హిరణ్య ప్రాకారం’ అని వర్ణించింది. ఈ పొర లోపలి పాంచభౌతిక వాతావరణమే మనం జీవించడానికి కావలసిన అవకాశాన్ని కలిగించింది. ప్రకృతి శక్తులను ఆరాధించే భారతీయ వైజ్ఞానిక జీవనం ఈ పాంచభౌతిక శక్తిని ‘లలితాదేవి’గా అభివర్ణించింది. ‘ప్రపంచం’ అంటే పంచభూతాలన్నీ కలిసి ఒక ప్రకృష్టంగా తయారైన ప్రదేశం. ‘కృతం’ అంటే ‘చేయబడింది’, ‘కృతి’ అంటే ‘రచించింది’. ‘ప్రకృతి’ అంటే ‘ఒక స్పష్టతతో రూపొందింది’ అని అర్థం. భారతీయ ధర్మంలో పూజ లేదా ఆరాధన అంటే అంతా మన చుట్టూ, మనతో ఉండే పాంచభౌతిక, ప్రాకృతిక శక్తులకు, వాటి మూలాలకు చేసే ఆరాధన మాత్రమే. మన భూమి ఆకృతితోసహా శివలింగానికి ప్రతీక. భూమ్యాకర్షణ గణపతి. విద్యుదయస్కాంత వలయం కుమారస్వామి. ఓజోన్‌ పొర లోపలి పాంచభౌతిక ప్రకృతిని మనం శ్రీమాత (లలితాదేవి)గా ఆరాధిస్తున్నాం.

పంచభూతాలు కేవలం మన చుట్టూనే కాకుండా మనలోనూ అదేలా విస్తరించి ఉన్నాయి. శరీరంలో ఇవి ఒక స్పష్టతతో ఉన్నంతవరకు మనకు పూర్ణమైన శారీరక, మానసిక ఆరోగ్యం ఉంటుంది. చుట్టూ ఉన్న పంచభూతాలు ఒక పద్ధతిలో ఉంటే మనకు ప్రకృతి బీభత్సాలు కూడా ఉండవు. ఈ ప్రకృతి సమతుల్యత కోసం చేసే ఆరాధనే లలితాదేవి ఆరాధన. జీవుల జీవనానికి, సృష్టికి ఆమె ఆధారం కావడం వల్ల లోకానికంతటికీ తల్లి అయింది. మన ఆలోచనలన్నీ కూడా ఈ పాంచభౌతిక శక్తిలోనే నిక్షిప్తమవుతుంటాయి. కనుకే, ఆమె శ్రీమాత. ఆమెను ఆరాధించే మార్గం ‘శ్రీ యంత్రం’. పంచభూతాలు ఈ భూమి చుట్టూ ఏ విధంగా నిక్షిప్తమయ్యాయనే అంశాన్ని విశ్లేషించేదే ‘శ్రీచక్రం’ (మేరువు). లలితాదేవి చిత్రాన్ని దర్శించినప్పుడు కూడా ఈ సంగతి మనకు తెలుస్తుంది. ఆమె సింహాసనాన్ని మోసే ఐదుగురు ప్రముఖుల్లో శివునిపైన తాను కూర్చున్నట్లుగా మనకు కనిపిస్తుంది. శివుడంటే ఇక్కడ భూమికి ప్రతీక. భూమి చుట్టూ ఉండి, భూమితో కలిసి ఇక్కడ సృష్టికార్యాన్ని నిర్వహిస్తున్న మాతృత్వ స్వరూపమే లలితాదేవి. గణపతి, కుమారస్వామి ఇద్దరూ ముందుగా ఉంటారు. భూమి చుట్టూ ఉండే గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత తరంగ శక్తులకు వీరు ప్రతీకలు. లలితాదేవికి తోడుగా సపర్యలు చేసే ఐశ్వర్యం, జ్ఞానసంపదలు లక్ష్మీ, సరస్వతులుగా దర్శనమిస్తున్నాయి. ఇవి కూడా ఒక రకమైన ప్రకృతి శక్తులే. ఈ మూడూ ఎప్పటికీ కలిసే ఉంటాయి.

పంచభూతాలను ప్రత్యేకంగా దర్శించే సంప్రదాయం గురించి మనం అధ్యయనం చేయాలి. అప్పుడే అమ్మవారి భావన వెనుక ఉన్న విజ్ఞానం, శక్తుల ఆరాధనకు మూలమైన తత్త్వం వంటివన్నీ మనకు బోధపడతాయి. అమ్మవారు అని పేరు కలిగిన అన్నీ ప్రకృతిలోని వేర్వేరు శక్తులే. ఓజోన్‌ పొర లోపలి ఈ పాంచభౌతిక శక్తి సక్రమంగా ఉంటేనే సూర్యకాంతి వడగట్టబడి వచ్చి మన జీవనానికి కావలసిన శక్తిని, ఆనందాన్నిస్తుంది. దీన్ని కాపాడుకోవడానికే శ్రీసూక్తం, బిల్వ వృక్షాలను నాటడం, హోమాలు వంటివి చేయడమనే ప్రక్రియలు వాడకంలో ఉన్నాయి. దీనికి ప్రతీకగానే శివారాధనలో భాగంగా శివలింగానికి బిల్వ, తులసీదళాలు వంటివాటితో పూజించడం. ఇట్లా చేసే పని ప్రతీ దానిలోనూ వైజ్ఞానికతను చూసింది భారతీయత. ఇంతటి ప్రాధాన్యం గల పాంచభౌతికశక్తి స్వరూపంగా చెప్పే లలితాదేవి అమ్మవారిని నిరంతరం ఆరాధిద్దాం. కామిత ఫలాలన్నీ పరిపూర్ణంగా పొందుదాం.

-సాగి కమలాకరశర్మ


logo