సోమవారం 18 జనవరి 2021
Devotional - Dec 02, 2020 , 01:16:32

‘శాశ్వత ఆనందామృతం’ అంటే?

‘శాశ్వత ఆనందామృతం’ అంటే?

స్మిత జ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం

చకోరాణామాసీ దతి రసతయా చంచు జడిమా

అతస్తే శీతాంశో రమృత లహరీ మామ్ల రుచయః

పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా.

 -ఆదిశంకరులు (సౌందర్యలహరి: 63)

‘అమ్మా! అత్యంత సౌందర్యవంతమైన నీ ముఖమనే చంద్రునినుంచి వెలువడే చిరునవ్వుల వెన్నెలల ప్రవాహాన్ని చకోర పక్షులు తమ ముక్కులతో తాగుతున్నాయట’. అంతేకాదు, ‘అమ్మది చంద్రునిలాంటి ముఖం కాదు. ఆమె ముఖం బింబం, చంద్రుడు ప్రతిబింబం. కాబట్టి, ‘వదన చంద్రుడు’ అన్నారు శంకరులు. ‘అవి చాలా మధురంగా ఉండటం వల్ల ఎంత తాగినా తమకు తనివి తీరడం లేదు. ఆ చిరునవ్వులను ఆస్వాదిస్తూ మనసులు సంతృప్తమై కొంత సమయానికి వాటి ముక్కులు మొద్దుబారిపోయి ఆ అమృతంపై మొహం మొత్తి జడత్వమయ్యాయట’. 

ఇది సహజ ప్రక్రియయే. ఎందుకంటే, అత్యంత మధురమైన ఆ చిరునవ్వుల వెన్నెలల అమృతాన్ని ఎక్కువగా తాగడం వల్ల దానిపై మొహంమొత్తి మరొక దానికై వెంపర్లాడటం సహజం కదా. అయితే, ఆ జడత్వాన్ని పోగొట్టుకునే ప్రక్రియలో భాగంగా ఆ వెంపర్లాటలో అవి సాధారణ చంద్రబింబం నుంచి వచ్చే వెన్నెలలను నిరంతరం ఆస్వాదించాయి. అవి తమకు కొద్దిగా పుల్లగా, పుల్లటి గంజిలాగా అనిపించిందట. సాధారణంగా చకోరపక్షులు వెన్నెలలను మాత్రమే తాగి జీవిస్తాయని చెప్తారు. అమ్మవారి మందస్మిత జనితమైన అమృతమయ వెన్నెలలను ‘చైతన్యం’(ఎఱుక)గా చెపుతూ, వాటిని గ్రోలడం వల్ల పరమేశ్వరునికి శాశ్వతత్వం కలిగిందని, అలా కాని లౌకికమైన వెన్నెలలు మహాప్రళయంలో లయమౌతాయని చెబుతున్నారు శంకరులు. 

కొద్దిగా వికసించిన పెదవులపై, పలు వరస కనిపించకుండా ప్రశాంతమైన మనసుతో గంభీరంగా వెలుగుచూసేది ‘స్మితం’. ‘మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా’ అంటున్నది లలితా సహస్ర నామం. తన చిరునగవు కాంతి (వెన్నెలల) ప్రవాహంలో తన భర్త కామేశ్వరుని ఓలలాడించే చిద్రూపిణి లలితాదేవి. ఆమె చిరునవ్వులు చంద్రకాంతికన్నా ప్రశాంతమైనవి. నిజానికి మన కన్నులు దేనినైతే చూస్తున్నాయో అవే చైతన్య లహరులై మనసులో ఆనంద లహరులను ప్రవహింపచేస్తున్నాయి. ఒకటి కనులకు విందు చేస్తున్నది, రెండవది ఆత్మకు భోజనమౌతున్నది. నిజానికి ఆ తల్లి చిరునవ్వులను ఆస్వాదించే చకోరాలు సాధారణ చకోరాలు కావు, అవి భక్త చకోరాలు. భక్తులు ‘నిశి నిశి’ (అహరహమూ) అంటే నిత్యమూ తపస్సు చేసి ఆ తల్లి సాలోక్య సామీప్యాలను సాధించారు. ఆమె చెంతన కూర్చొని తన ముఖచంద్రునినుంచి జాలువారే వెన్నెలలు తాగుతున్నారు. అంటే, ఆమెను నిరంతరం చూస్తూ ఆనంద పరవశులౌతున్నారన్నమాట. 

కొంత కాలానికి వారి పుణ్యగరిమ వ్యయమై వారు మళ్ళీ మనుషులుగా జన్మించారట. దీనినే ‘మొహం మొత్తడం’ అన్నారు ఆచార్యులు. కాకపోతే, వారి సాధనా బలం వారికి ఉన్నత స్థాయిని ప్రసాదించడం వల్ల వారాస్మృతిలోనే జీవిస్తూ లౌకికమైన చంద్రబింబ ఉత్పన్నమైన వెన్నెలలను గ్రోలుతూ అవి పుల్లగా గంజిలాగా ఉన్నయనుకుంటున్నారట. అంటే, లౌకిక సంస్కారాలను కాదనుకుంటూ మళ్ళీ తమకు ఉత్తమగతులను సాధించుకునే క్రమంలో వారు సాధన చేస్తున్నారు. అమ్మ తలపై చంద్రుడు ఉంటాడు. యోగులు తమ సాధనలో కుండలినీ శక్తిని సహస్రారం చేర్చిన వేళ అక్కడి లలితా పరమేశ్వరి అమృతాన్ని కురిపిస్తుంది. అదే ‘గంగావతరణం’ (శాశ్వత ఆనందామృతం). దీనిని సాధించే క్రమంలోనే మనందరం చకోరాలమై ఆ అమ్మ పాదాలవద్ద నిలుద్దాం. ఆమె చిరునవ్వుల వెన్నెలలను నిరంతరం ఆస్వాదించడానికి ‘శాశ్వతానందలహరి’లో ఓలలాడే సౌభాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థిద్దాం.

పాలకుర్తి 

రామమూర్తి