శుక్రవారం 15 జనవరి 2021
Devotional - Dec 01, 2020 , 00:44:26

లక్ష్మీ కటాక్షం కలగాలంటే..

లక్ష్మీ కటాక్షం కలగాలంటే..

ప్రకృతి పరిపూర్ణ రూపాలైన ఐదింటిలో రెండవది లక్ష్మీదేవి. ఆదిమూలమైన ఒకే తల్లిని మనం ఐదు రూపాలుగా, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్నే ప్రధానంగా భావిస్తూ ఆరాధిస్తుంటాం. ‘లక్ష్మీ అష్టోత్తర శతనామం’ పూర్తిగా అమ్మవారి తత్వం. ఈ నామాల రూపంలో జ్ఞానాన్ని మనకందించారు భారతీయ ఋషులు. ‘లక్ష్మి’ అంటేనే ‘ఐశ్వర్యం’. ఆ భావానికి ఒక శక్తి ఉన్నది. సృష్టిలో ఐశ్వర్యం లేకుంటే సర్వశక్తులు నశించినట్లే. ‘ఐశ్వర్యం’ అంటే అన్ని శక్తుల సమాహారం. ‘లక్ష్మి’ అంటే శుద్ధసత్వ స్వరూపం. రజో, తమో గుణాలు లేకుండా, కేవలం సత్వగుణం మాత్రమే వున్న రూపమే లక్ష్మీదేవి. ‘సంపద’ అంటే ఒక్క డబ్బే కాదు. ‘దేవి భాగవతం’ లక్ష్మికి గొప్ప నిర్వచనం ఇచ్చింది. మంచి ఆలోచన, మంచి ఆచరణ. ‘మంచి’ అనేదంతా ఒక దగ్గర పెడితే అదే లక్ష్మీదేవి రూపం. తుష్టి, పుష్టి, విద్య, జ్ఞానం, ఉత్సాహం, ప్రేమ, దయ ఇవన్నీ రాశీభూతం చేసి చూడగలిగితే అదే ‘శుద్ధసత్వ స్వరూపిణి’. ఆ నిర్మలమైన స్వరూపాన్ని మనసులో ఉంచుకొని ఆ తల్లిని ఉపాసించాలి. ఒక గొప్ప వస్తువును మనం ఉపాసిస్తుంటే కాలక్రమంలో దాని గొప్పతనం మనకూ సంక్రమిస్తుంది. 

కర్పూరం చేతిలో ఉంచితే దాన్ని వదిలినా కొంత సమయం వరకు ఆ వాసన మన చేతిని వదలదు. ‘లక్ష్మీదేవి’ అంటే అన్నిటికంటే మొదట ‘ఉత్సాహం’. ఇంట్లో ఒకరిపట్ల ఒకరికి పరస్పర ప్రేమ, మమకారం ఉండటమే ఒక లక్ష్మీకళ. ముఖంలో శాంతం, సౌమ్యత ఉన్నప్పుడు మనం చూడగానే ‘ఆమెలో లక్ష్మీకళ ఉందని’ అనుకుంటాం. ‘లక్ష్యతే ఇతి లక్ష్మిః’. అందరూ ‘ఎవరి చూపు తమమీద పడాలనుకుంటారో..’ ఆ తల్లికే ‘లక్ష్మి’ అని పేరు. ఒక భక్తునిలోని భక్తి అతని లక్ష్మి. ఒక గాయకునిలోని గానం అతని లక్ష్మి. పచ్చటి చేనులో కోతకొచ్చి ఊగిపోతున్న కంకులు ఆ చేనుకు లక్ష్మి. చెట్టునిండా కాయలు, పండ్లు ఆ చెట్టుకు లక్ష్మి. నలుగురైదుగురు పిల్లలతో వున్న తల్లి సంతానలక్ష్మి. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించి కడుపునిండా, తృప్తిగా భోజనం పెట్టే ఇల్లాలు గృహలక్ష్మి. ‘లక్ష్మి ఎక్కడ ఉంటుంది?’ అంటే ఇలా అంతటా ఉంటుంది. ఇంటికి లక్ష్మి ఇల్లాలే. పెండ్లిపీటల మీదకు వరుడు నడిచే వస్తాడు. కానీ, వధువును మాత్రం పద్మంలో కూర్చోబెట్టి తెస్తారు. ఎందుకంటే, ఆమె అత్తారింటికి కాబోయే లక్ష్మి. ఇంతటి సుసంపన్నమైన ధర్మం మనది. 

‘ఒక ఇంట్లో లక్ష్మి ఏ కారణంతో నిలబడుతుంది?’ అంటే, ‘ఏ భార్యాభర్తలు కీచులాడుకోరో, అస్తమానం ఒకరినొకరు నిందించుకోరో, సరళంగా మృదువుగా మాట్లాడుకుంటారో.. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది’ అని ‘మహాభారతం’ పేర్కొన్నది. ‘శ్రీ సూక్తం’ వేదప్రోక్తం. అందులోని మొట్టమొదటిదే ‘సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి- శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా’. ఒక సంకల్పాన్ని పూర్తి చేసే ఉత్సాహం ఉన్నప్పుడే సదరు కార్యం సిద్ధిస్తుంది. అదే సిద్ధలక్ష్మి. ఇక్కడ మోక్షమంటే విడుదల. ఆ కార్యం నుండి విముక్తి కావడం. ఇలా ఒకరి తర్వాత ఒకరు లక్షులంతా మనలను అనుగ్రహిస్తుంటారు. ‘వర’ అంటే ‘శ్రేష్ఠం’. ఈ లక్ష్ములన్నీ ‘వరలక్ష్మి’లో ఏకమైపోతాయి. అంతేగాని, ‘లక్ష్మీ కటాక్షం’ అంటే కేవలం ‘డబ్బు మాత్రమే’ కాదు. ఈ ప్రపంచమనే పండులో రసం (శక్తి) వంటిది అమ్మవారు. ఇంతేకాదు, లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణుశక్తే. నిత్యలక్ష్మిగా ఆ తల్లి ఎప్పుడూ అతని వక్షస్థలంలో ఆసీనురాలై ఉంటుంది. ఆమె అనుగ్రహం కోసమే మనమంతా ఎదురుచూసేది.

వేముగంటి శుక్తిమతి

99081 10937