ఆదివారం 17 జనవరి 2021
Devotional - Nov 30, 2020 , 01:49:03

జీవన కాంతి!

జీవన కాంతి!

దీపం జ్యోతి స్వరూపం. ఆత్మలో వెలిగే జ్ఞానజ్యోతిని గుర్తించి వెలిగించుకొని, ఆ కాంతిలో మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దీనికి ప్రతీకగానే కార్తీక పూర్ణిమ వేళ చీకటి పడ్డాక బయట దీపాలు వెలిగిస్తాం. ‘శివరాత్రి’కి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో  ఈ రోజుకు అంతే ప్రాధాన్యం ఉన్నది.

ఈ పౌర్ణమినే ‘లింగ పౌర్ణమి’ అనికూడా అంటారు. ‘దీపాలంకరణ’ జరుగుతుంది కనుక, ఇది ‘దేవ దీపావళి’. ఇవాళ చంద్రోదయం పిమ్మట దీపారాధన చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రివేళలో కౌముదీ పూజ చేసి పాలు లాంటివి చంద్రునికి నివేదించి, ఆ వెన్నెలలు సోకిన అమృతమయమైన పాలను తీర్థంగా స్వీకరించాలి. ఇలా చంద్రుని ఆరాధించడం వల్ల మనసు ప్రశాంతమవుతుంది. 

వెన్నెలలు అమృతత్త్వానికి ప్రతీకలు. వెన్నెల కాంతిలో తడవడం వల్ల మనసు ప్రశాంతమౌతుంది. భగవత్‌ సాధనలో ఏకాగ్రత కుదురుతుంది. ఇవాళ కౌముదీ (చంద్రకాంతి) పూజ విశేషం. ‘శాంభవీ శారదారాధ్యా శరత్చంద్ర నిభాననా’ అంటున్నది లలితా సహస్ర నామం. సంతోషాన్ని కలిగించే చిఛ్చక్తిని ఇచ్చేది శాంభవియే. స్వఛ్ఛమైన విద్యాధిదేవత సరస్వతితో ఆరాధనలు అందుకొన్నది, శరత్కాల చంద్రునివలె ప్రకాశించే ముఖం కలిగి వున్నది లలితాదేవి. పౌర్ణమినాడు ఆమెను అర్చించడం వల్ల ముక్తి కలుగుతుందన్నది సాధకుల ప్రగాఢ విశ్వాసం. 

కార్తీక పౌర్ణమికి ‘త్రిపుర పౌర్ణమి’ అనే పేరు కూడా ఉన్నది. తారకాసురుని ముగ్గురు కుమారులు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. ‘తమను ఒకే బాణంతో ఒకేసారి కొట్టగలిగిన వాని చేతిలో తప్ప, మరణం లేకుండా’ వరం పొందారు. వారి ఆగడాలను భరించలేని దేవతలు శివుని శరణు వేడితే ఆయన ఒకే బాణంతో వీరి మూడు పురములను (పట్టణాలను) కూల్చేసి వీరిని వధించినట్లుగా పౌరాణిక కథ ఉన్నది. ‘మూడు పురములు’ అంటే ‘స్థూల సూక్ష్మ కారణ’ శరీరాలు. వీటి నిర్మూలన అంటే జనన మరణ చక్రబంధం నుండి విముక్తి పొందడం. అంటే, శివానుగ్రహం వల్ల సాధకుడు శివ సాయుజ్యాన్ని పొందడంగా దీనిని భావించాలి. ఈ మాసంలో ఉసిరి చెట్టు సమీపంలో నిర్వహించుకునే వనభోజనాదులు విశిష్టతను కలిగి ఉన్నాయి. ఉసిరి, తులసి వద్ద నిర్వహించే విష్ణువు ఆరాధన సమస్త క్షేత్రాలలో ఆరాధించిన ఫలితాన్ని ఇస్తుంది. 

ఒకవైపు సామాజిక బంధాన్ని పటిష్టం చేస్తూనే, మరోవైపు మనం నిర్వహించే పూజాదులలో సమష్టి చైతన్యం కనిపిస్తుంది. ఈవేళ ‘క్షీరాబ్ధి శయన వ్రతమూ’ చక్కని ఫలితాన్నిస్తుంది. క్షీరసాగరంలో శయనించే మహావిష్ణువు ద్వాదశినాడు బృందావనంలో లక్ష్మీదేవితోసహా ఉంటాడని, ఆనాడు ఆయన ఉపాసన మహాపుణ్యప్రదమని శాస్త్ర వచనం. భక్తితో మాత్రమే భగవంతుడు బంధితుడౌతాడు. అందుకే, ఆయన దామోదరుడు. దామం అంటే ‘కట్టి వేసే తలుగు‘. కృష్ణుడిని యశోద భక్తి అనే తాడుతో ఱోటికి కట్టివేసింది. కృష్ణుడా ఱోటిని ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్ల మధ్యనుండి వెళ్ళాడు. ఆ ఱోలు తాకిడికి ఆ చెట్లు కూలడం, ఆ మద్దిచెట్ల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం కలగడం పురాణ గాథ.

-పాలకుర్తి రామమూర్తి