శనివారం 28 నవంబర్ 2020
Devotional - Nov 20, 2020 , 23:20:46

ధర్మం వైపే దేవుడు!

ధర్మం వైపే దేవుడు!

ఒకటిఁ గొని రెంటి నిశ్చల యుక్తిఁ జేర్చి

మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి

యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు

విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు.

-తిక్కనామాత్యుడు (మహాభారతం, ఉద్యోగపర్వం: 2-37)

ఈ పద్యంలో ఉత్తమ మానవుల ధర్మాలన్నీ వున్నాయి. మన బుధ్ధి (మేధోశక్తి)తో ‘శాశ్వతమైన, అశాశ్వతమైన’ వాటిని, ‘చేయవలసిన, చేయకూడని’ వాటిని యుక్తితో, జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మిత్రులు, తటస్థులు, శత్రువులు ముగ్గురినీ ‘సామ దాన భేద దండో’ పాయాలతో వశపరచుకోవాలి. జ్ఞానేంద్రియాల (కండ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం) కోరికలకు తలొగ్గక, వాటిని ఎప్పటికప్పుడు జయిస్తుండాలి. దీనితోపాటు అంతఃశ్శత్రువులైన అరి షడ్వర్గాల (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు)నూ కనిపెడుతుం డాలి. సప్తవ్యసనాల (మద్యపానం, వ్యభిచారం, జూదం, జంతువేట, కోపంతో ఇతరుల మనసు నొప్పిస్తూ ఎప్పుడూ శారీరకంగా హింసిస్తూ బాధ పెడుతుం డటం, ఇతరుల ధనం కోసం ప్రయత్నించడం, ధనాన్ని నిందించడం: మహా భారతం, శాంతిపర్వం 2-285)ను విడిచిపెట్టి జీవించేవాడే ‘వివేకవంతుడు’ అనే సందేశమూ ఇందులో వుంది. ప్రతి మానవుడు వివేకవంతునిగా ఎదగ డానికి ప్రయత్నించాలి. ‘పంటలకోసం ఉపయోగించే నేలకు విత్తనాలు తోడ్పడినట్లే, వివేకవంతులైన మానవుల ఉత్తమమైన ప్రయత్నాలకు దేవుడు  కూడా తప్పక తోడ్పడతాడని’ మన సనాతన ధర్మం బోధిస్తున్నది. 

‘శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. దైవ నియోగం ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది’ అన్నది మన నమ్మకం. ధర్మం తప్పని వాళ్ళను, ధర్మబద్ధమైన నడవడికతో ఉండేవాళ్ళను, పరోపకార పారీణులను, సద్గుణ సంపన్నులను, అంతఃశ్శత్రువులను జయించిన వారినీ పాపాల పాలు కాకుండా ఆ దేవుడే ఎల్లప్పుడూ కాపాడుతుంటాడు. ప్రారంభంలోనే బాగా ఆలోచించి చేసే మంచి పనులనూ ఫలవంతం చేయడానికి ‘దైవసంకల్పం’ అనుకూలిస్తుంది. అందుకే, ఒక్కోసారి సాధ్యం కావనుకున్న పనులుకూడా దేవుని దయవల్ల విజయవంత మై ఫలసిద్ధిని అందిస్తాయి. ధర్మం తెలిసిన వాళ్ల అనుమతితో చేసే మంచి పనులకు దైవసహాయం తప్పకుండా లభిస్తుంది. రైతులు తమ శక్తియుక్తులను ఉపయోగించి చేసే సేద్యానికి వాతావరణం అనుకూలించి, తగిన వర్షం కురిసి నప్పుడే ఫలవంతమైనట్టుగా మానవ యత్నాలకు భగవంతుని తోడ్పాటు ఉంటే నే అవి ఫలిస్తాయి. కనుక, ధర్మబధ్ధమైన జీవితాన్ని గడిపే తమ శ్రేయోభిలాషుల మనసుకు నచ్చిన పనులనే చేయడానికి పూనుకోవాలి. మానవ యత్నాలు విఫలమైనప్పుడు ‘దైవం అనుకూలించలేదని’ అర్థం చేసుకోవాలి. విత్తనమనేది వేయకుంటే సస్యశ్యామల క్షేత్రమైనా సరే ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వదు. అలాగే, మానవ ప్రయత్నానికి దేవుని సహాయం లేకపోతే విజయం అసాధ్యమనేది పెద్దల అనుభవం కూడా. ఎంతటి వాళ్లయినా కొత్త పని ప్రారంభించే ముందు దైవానుగ్రహం కోసం తమ స్థాయికి తగినట్టుగా దేవుని ఆరాధించడమనేది భారతీయ సంప్రదాయంగా మారింది. 

ఏ ప్రయత్నమూ చేయక, సోమరితనంతో వున్నా కూడా దేవుడు ఫలితాన్ని ఇవ్వలేడు. శ్రమించేవారిని కరువు కాటకాలు పీడించవు. ప్రయత్నంతో పనులను చేపట్టినప్పుడే భగవంతుడు వాటిని సఫలీకృతం చేస్తాడు. అప్పుడే జగత్తంతా సుభిక్షంగా వర్ధిల్లుతుందనేది మన సనాతన ధర్మం ఇస్తున్న సందేశం. 

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం మౌనేనః కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం.

‘కష్టపడి వ్యవసాయం చేసే రైతులుంటే కరువు అనేది ఉండదు. అలాగే, దేవున్ని స్తోత్రం చేస్తే పాపం మాత్రం రాదు. మౌనం పాటించేవారికి వివాదాల బాధలుగానీ, జాగ్రత్తగా ఉండేవాళ్లకు భయాల బాధలుగానీ ఏవీ ఉండవనేది’ మన పెద్దల బోధ. దేనికైనా మానవ ప్రయత్నమనేది సహేతుకంగా, సంపూర్ణంగా, సకాలంలో ఉండాలి. అప్పుడే ఆ ఉత్తమ ప్రయత్నం దైవానుగ్రహంతో విజయవంతమవుతుంది.

డాక్టర్‌ శాస్ర్తుల రఘుపతి

94937 10552