గురువారం 03 డిసెంబర్ 2020
Devotional - Nov 19, 2020 , 01:31:38

దేహాలయంలో అంతర్యామి దర్శనం!

దేహాలయంలో అంతర్యామి దర్శనం!

దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః 

త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్‌ ॥

- ఆదిశంకరాచార్యుల సాహిత్యం

దేహ, మానసిక మలినాలను శుభ్రం చేసుకోవడం ముఖ్యమేకాదు, ధర్మం కూడా. మానవ జన్మ ఏర్పడటం అంటేనే కొంత మలినం మిగిలి ఉందనే అర్థం. దానినే ‘నిర్మాల్యం’ అంటున్నాం. రోజుకు రెండుసార్లు స్నానం చేస్తూ, విశేషమైన రోజుల్లో అభ్యంగన స్నానాదులతో భౌతిక దేహాన్ని నిరంతరం శుద్ధి చేసుకుంటూ వుంటాం. ఇది బాహ్య శుభ్రత. నిరంతరం యోగాభ్యాసాదులు, ప్రాణాయామాలను చేయడం ద్వారా మన ‘అంతర దేహం’ శుద్ధిని పొందుతుంది. దీనివల్ల కొంత ‘దైవత్వం’ సిద్ధిస్తుంది. అప్పుడు మన ఆలోచనా విధానాల్లో మార్పులు వస్తాయి. అదే పనిగా వచ్చే సాధారణ ఆలోచనల ప్రభావాల నుండి దూరం కావాల్సి ఉంటుంది. దీనికోసమే నిరంతరం జపం, ధ్యానం చేయవలసిన అవసరం ఉంటుంది. 

మనుషులకు ఈ మలినాలు పూర్వకర్మల గుణదోషాల నుండి వస్తాయి. అజ్ఞానం ఉన్నంత కాలం చేసే పనుల్లో అహంకార, మమకార వాసనలు కూడా అంటుకుంటుంటాయి. అవన్నీ మనలో పొరలు- పొరలుగా తెట్టె గట్టి ఉంటాయి. దీనిని బలమైన ప్రయత్నంతో పూర్ణంగా శుద్ధి చేయాల్సి వుంటుంది. అప్పుడే లోకం, ప్రకృతి, మూలశక్తి అన్నీ మనకు స్పష్టంగా విశదమవుతాయి. ‘మనం ఎక్కడ ఉండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో’ అర్థమవుతుంది. ఇలా ‘అజ్ఞాన నిర్మాల్యాన్ని’ వదులుకున్న దేహమే దేవాలయం అవుతుంది. అందులోని జీవుడే దేవుడుగా పరిగణింపబడతాడు. ఉదాహరణకు మానవ దేహాన్ని ఒక కారుగా భావిస్తే దీనిని నడిపించే సారథి ‘మనసు’ అవుతుంది. మనసు చెప్పిన పనులనే శరీరం చేస్తుంది. అదే కారు (శరీరం)లో కనిపించకుండా కూర్చునే ‘ఆత్మ’కూడా ఉంటుంది. కారుకు, సారథికి రెండింటికీ ఆత్మనే ఆధారం. కానీ, ఆత్మ (యజమాని) అనే ఒకరు ‘వెనుక సీటులో వున్నారనే’ భావన కూడా లేకుండా సారథి కారు నడుపడమే ‘అజ్ఞానం’. అంతేకాదు, చాలామంది మార్గమధ్యంలో ‘అరిషడ్వర్గాలనే’ వారిని ఎక్కించుకుంటూ, వెనుక వున్న ఆత్మను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆఖరుకు ఆ కారులో తనకే స్థలం లేక ఆ యజమాని నెమ్మదిగా డోర్‌ తీసుకుని దిగిపోతాడు. అందుకే, శంకరాచార్యుల వారు దేహాన్ని దేవాలయంగా మార్చుకోవాలంటే ‘అజ్ఞానమనే నిర్మాల్యాన్ని జ్ఞానమనే ప్రార్థన, ధ్యానం ద్వారా శుద్ధి చేయాలని’ సూచించారు. 

ఎవరైనా పెద్దవాళ్ళు మన కారులో ప్రయాణిస్తామంటే వాహనాన్ని బాగా శుద్ధి చేసుకొంటాం. వాళ్లు ఎక్కిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ డ్రైవింగ్‌ చేస్తాం. అయితే, మన శరీరమనే కారుని నడిపే మనసు అనే డ్రైవరుకు మాత్రం తన కారులో అత్యుత్తమమైన ఆత్మశక్తి ఉందనే జ్ఞానం వుండదు. దీనివల్లే మనిషి మలినాల బారిన పడుతున్నాడు. ఫలితం పతనావస్థ! దేహం దేవాలయంగా, జీవుడు దైవంగా మారాలంటే అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తొలగించుకోక తప్పదు. మన దేహంలోనే అంతర్యామి కొలువై వున్నాడనే పరిపూర్ణ విశ్వాసభావనతో పూజ, స్తోత్రం, జపం, ధ్యానాదులు వంటి ఆరాధనలన్నీ నిరంతరం చేస్తుండాలి. అలా బాహ్య, అంతర దేహాలను రెండిటినీ శుద్ధి చేసుకొంటూ, అదే సమయంలో అవి మలినం కావడానికి మూలమైన మనసు శుద్ధిపైనా దృష్టిని పెట్టాలి. ఇలా మనలోని ఆత్మశక్తివైపు ఆలోచనల ప్రయాణాన్ని సాగించాలి. అంతవరకు ఈ ఆధ్యాత్మిక తపస్సు సాగాల్సిందే. అప్పుడే దేహం దేవాలయమే అన్న సత్యం బోధపడుతుంది.

-సాగి కమలాకరశర్మ