గురువారం 03 డిసెంబర్ 2020
Devotional - Nov 18, 2020 , 00:16:29

సత్యవ్రతం గొప్పతనం!

సత్యవ్రతం గొప్పతనం!

‘సత్యమేవ జయతే’ (సత్యమెప్పుడూ జయాన్ని కలిగిస్తుంది) అన్న ధర్మసూత్రాన్ని విన్నప్పుడల్లా మనకు వెంటనే స్ఫురించేది ‘సత్యహరిశ్చంద్ర’ జీవితచరిత్రనే. ఎన్ని కష్టాలను, పరీక్షలను ఎదుర్కొన్నా చివరికి సత్యమే విజయం సాధిస్తుందని తెలిపే అద్భుతమైన కథ అది. అంతగా సత్యానికి, మన సనాతన ధర్మానికి భారతీయ ఋషులు అత్యంత ప్రాముఖ్యాన్ని, ఉదాత్తతను కల్పించారు. సత్పురుషులందరూ సత్యాన్నే పాటించారు. సత్యం ద్వారానే ఆత్మజ్ఞానం, మోక్షం వేగవంతంగా లభిస్తాయని వారు నమ్మారు. ‘సత్యంగా జీవించడం’ అంటే కేవలం ‘సత్యవాక్కు’ అని కాదు. ‘పూర్తి జీవన విధానం సత్యంగా ఉండాలని’ అర్థం. సహనం, త్యాగం, ధైర్యం, అహింస, ధ్యానం, క్షమాగుణం.. ఇలా పలు రూపాల్లో సత్యాన్నే గ్రహించి, విధిగా దానినే పాటించాలన్నది ఆర్షవాక్యం. ‘సత్యమే నా తల్లి, అదే నా నిజమైన బంధువు’ అని ‘మహాభారతం’లో ధర్మరాజు ప్రవచించిన గొప్పవాక్యం మానవాళికి అందరికీ ఆదర్శనీయం. ‘శ్రీమద్రామాయణం’లో వాల్మీకి ‘సత్యమే బ్రహ్మ, అదే ధర్మానికి పరాకాష్ఠ’ అన్నాడు. ‘అక్షయమైన వేదాలన్నీ సత్యమే’ అని కూడా చెప్పాడు. ‘యజ్ఞాచరణ, శాస్ర్తాలు, వేదాల అధ్యయనం వంటి వాటివల్ల కలిగే ఫలితం’ మొత్తం ఒక్క సత్యవ్రతాన్ని ఆచరించడం వల్లనే లభిస్తుంది.

వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపు, సత్య వ్రతాన్ని మరోవైపు ఉంచితే, సత్యవ్రతమే ఎక్కువగా తూగుతుందని ‘మహాభారతం’, ‘నారద పురాణం’ నిర్ధారించాయి. సత్యవాక్య పాలన వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చో, ఒక దాసీ కుమారుడైన ‘సత్యకామ జాబాలీ’ వృత్తాంతం విశదపరుస్తున్నది. అతను కేవలం సత్యాన్ని ఆచరించడం ద్వారానే గౌతముని ఆశ్రయాన్ని పొందాడు. ప్రకృతిలోని ప్రాణులనుంచి, ఇంకా స్వయంగా గురువు ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది, మహర్షిగా ఖ్యాతిగాంచిన వాడు ‘సత్యకామ జాబాలి’. గురువైన గౌతముని ఆజ్ఞతో గోవుల కాపరిగా ఉంటూనే, ఆ గోగణంలోని ఒక వృషభం ద్వారా బ్రహ్మ మొదటిపాదంగా చెప్పే ప్రకాశవాన్‌, అగ్నిదేవుని ద్వారా అనంతవాన్‌, హంస నుంచి జ్యోతిష్మాన్‌, ఒక జలపక్షి నుంచి ఆయతనవాన్‌ కళలను పొందాడు. గౌతముని ద్వారా బ్రహ్మ విద్యను శాస్ర్తోక్తంగా అభ్యసించాడు. సత్యానికి అంతటి మహత్తును ఆపాదించారు ఆర్షులు. ‘సత్యవాక్యం’ ఎంత ముఖ్యమో ‘అసత్యం పలుకకపోవడం’ కూడా అంతే ముఖ్యం. అదీ గురువులతో అస్సలు పనికిరాదు. దీనిని మనకు ‘మహాభారతం’లోని కర్ణుని వృత్తాంతం తెలియజేస్తున్నది. సూతపుత్రుడైన కర్ణుడు, జరాసంధుడిని ఓడించి, ఆ తర్వాత ద్రోణాచార్యుల వారిని ‘బ్రహ్మాస్త్ర రహస్యాలు, ప్రయోగ ఉపసంహారాలు’ నేర్పమని కోరతాడు. ‘బ్రహ్మచర్యం పాటించే బ్రాహ్మణులు, తపస్వులైన క్షత్రియులు మాత్రమే దీనిని పొందడానికి అర్హులు’అని కర్ణుని విన్నపాన్ని ద్రోణుడు తిరస్కరిస్తాడు. అప్పుడు కర్ణుడు, ద్రోణుడి గురువైన పరశురాముని ఆశ్రయిస్తాడు. 

తనను తాను బ్రాహ్మణ యువకుడిగా అబద్ధపు పరిచయం చేసుకున్నాడు. అలా, పరశురాముని వద్ద అక్రమమార్గంలో ‘బ్రహ్మాస్త్ర మెలకువల’ను నేర్చుకున్నాడు. తర్వాత ‘కర్ణుడు బ్రాహ్మణుడు కాదని, తనకు అబద్ధం చెప్పాడని’ తెలుసుకున్న పరశురాముడు కోపోద్రిక్తుడవుతాడు. ‘ఆపద సమయంలో నీకు ఈ అస్త్రం ఉపయోగపడదు’ అని శపిస్తాడు. చివరికి అతిపరాక్రమవంతుడైన కర్ణుని చావుకి తాను పాల్పడిన ఈ ‘అసత్యవాక్కు’యే కారణమైంది. ఇంతేకాదు, ‘ఒక్క అబద్ధం ఆడిన ధర్మరాజు ఒకరోజు నరకాన్ని అనుభవించాడు’ అన్న మాట కూడా ప్రచారంలో ఉన్నది. అసత్యవాక్కు, అసత్య- అధర్మాచరణ అన్నవి ముందు ప్రీతికరంగానే తోచినా, చివరికి సత్యమే జయిస్తుందన్నది ఇలాంటి ఎన్నో వృత్తాంతాలు నిరూపిస్తాయి.

-అష్టకాల విద్యాచరణ్‌ ,86390 95147