గురువారం 03 డిసెంబర్ 2020
Devotional - Nov 17, 2020 , 00:11:34

సులభ ముక్తి సాధనం ‘శ్రీరామ’నామం!

సులభ ముక్తి సాధనం ‘శ్రీరామ’నామం!

చరాచర సృష్టిలో మానవజన్మ ఉత్తమోత్తమమైంది. జీవిత చరమాంకంలో ఉన్న చాలామంది ‘రామా! శ్రీరామా!’ అనుకోవడం కద్దు. అంటే, ‘శ్రీరామ’ నామానికి ఉన్న మహత్తరమైన శక్తి ఎంతటిదో అర్థమవుతున్నది. ‘శ్రీరామ’నామం జపించడంతోనే మరణానంతరం జీవులకు పాపాలన్నీ తొలగిపోయి, పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయన్న విశ్వాసం బలీయమైంది. దుఃఖమయ సంసారాన్ని ఈదడానికి దీనిని మించిన సులభ తరుణోపాయం మరొకటి లేదు. ఓ పదునైన గొడ్డలి పెద్దపెద్ద వృక్షాలను నరికినట్లుగా మితిమీరిన దురాచారాలను, దుష్ట నడవడికలను ‘రామనామ పారాయణం’ నాశనం చేస్తుంది. ‘తారకరామ’లో ‘తారక’ అంటే ‘తరింపజేసేవాడు’ లేదా ‘దాటించేవాడు’ అని అర్థం. సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు భగవత్‌ స్వరూపుడు. ‘శ్రీరామ నామం’ సంసార సాగరాన్ని దాటించే ‘సులభ సాధనం’. అందుకే, ఆయన ‘తారకరాముడై’నాడు. కష్టాలతో కూడిన ఈ మానవజన్మకు శాశ్వత సుఖాన్నిచ్చే మోక్షం సిద్ధించాలంటే ‘తారకనామమే’ అత్యంత శ్రేష్ఠం. పడవను నడిపే సరంగు క్లిష్టమైన నదీ ప్రవాహాన్ని సులభంగా దాటించినట్లుగా శ్రీరాముడు మానవ జన్మను సుఖమయం చేయడమే కాక జన్మాంతర ముక్తినీ ప్రసాదిస్తాడు.

జీవులకు జన్మ అన్నది ఒక నదీ ప్రవాహం వంటిది. శ్రీ రాముడు నావికుని వంటివారు. పడవను నడిపే సరంగు, శ్రీరాముడు ఇద్దరూ నదిని దాటింపజేసేవారే. కష్టాల్లో ఉన్నవారికి, జీవన్ముక్తిని కోరుకొనేవారికి ‘రామనామం’ కంటే గొప్పనైన ‘తారకమంత్రం’ మరొకటి లేదు. గంభీరమైన సముద్రంలో బడబాగ్నివలె అది సముద్రాన్ని, భూమిని శీతలభరితం కాకుండా కాపాడుతుంది. సముద్రంలా ఉప్పొంగే లోకం పోకడలకు అపకారం తలపెడితే ఆ చెడు అగ్నిబారిన పడి ఉన్నఫలాన ఇంకిపోతుంది. లోకంలో పాపాలు ప్రబలినప్పుడు, దుష్టులు పేట్రేగిపో యినప్పుడు భగవంతుడే స్వయంగా అవతరించి వారిని నిర్మూలించి, శాంతిని పునరుద్ధరిస్తాడు. ‘..ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగేయుగే’ (భగవద్గీత: 4.8) అనేది ఉత్తమోత్తమమైన గీతావాక్యం. పాపాలు ఎవరు చేసినా భగవంతుడు వారిని సర్వనాశనం చేస్తాడు. అందుకు నిదర్శనమే తాటకి సంహారం. తాటకి వధ తర్వాత మునుల యజ్ఞాలు నిరాటంకంగా సాగాయి. మానవజన్మ చిత్రాతిచిత్రం. ఎవరికీ అపకారం చేయక, అందరికీ మేలు చేసేవారు కూడా ఒక్కోసారి బాధలు, వ్యథలకు గురికాక తప్పదు. అటువంటివాడే ప్రహ్లాదుడు. పరమ విష్ణుభక్తుడు. ఎప్పుడూ శ్రీ హరిని ధ్యానించడమే పనిగా పెట్టుకున్నాడు. అతని హృదయం నిండా ‘హరినామ’ స్మరణమే. అయినా, తనకు కృత్యదవస్థ తప్పలేదు. దుష్టుడైన తన తండ్రి హిరణ్యకశిపుని వల్లే అనేక కష్టాలు కలిగాయి. ప్రహ్లాదుడు వాటికి ఏ మాత్రం తొణకక హరిని మదినిండా నింపుకున్నాడు. చివరికి భగవంతుని అనుగ్రహంతో అతని కష్టాలన్నీ గట్టెక్కాయి.

మానవ సంసారమూ ఇంతే. ఈతిబాధలు, చిక్కులనుంచి తప్పుకోవాలంటే ‘శ్రీరామనామం’ చక్కటి పరిష్కార మార్గం. ఒక్కోసారి మానవులు కూడా చెడుబుద్ధికి లోనవుతారు. చెడు ప్రవర్తనలకు అలవాటు పడతారు. ఇలాంటి ‘దుర్మతుల’ (చెడు బుద్ధి, స్వభావం కలవారు)ను అణచడానికి, వారు చేసిన పాపాల వల్ల లోకానికి నష్టం కలక్కుండా చూడటానికి, అలాంటి వారినుంచి సమాజాన్ని కాపాడటానికి భగవంతుడే మానవరూపంలో శ్రీరాముడుగా త్రేతాయుగంలో వెలిశాడు. అందుకే, మనోరంజకమైన, పరమ పవిత్రమైన ‘శ్రీరామనామం’ మనందరికీ సకల శ్రేయోదాయకం. గత, ప్రస్తుత పాపాలు, శాపాలు, కష్టానష్టాలను తొలగించే దివ్యధామం ‘శ్రీరామనామం’. అంతటి దివ్యశక్తి అనుభవంలోకి వస్తే తప్ప ఎవరికైనా తెలిసేది కాదు.


కనుమ ఎల్లారెడ్డి

93915 23027