శుక్రవారం 04 డిసెంబర్ 2020
Devotional - Oct 31, 2020 , 00:21:35

ప్రజ్ఞానమే పరబ్రహ్మ తత్తం!

ప్రజ్ఞానమే పరబ్రహ్మ తత్తం!

మన పూర్వులు మనకు ప్రసాదించిన నాలుగు మహా వాక్యాలలో ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ ఒకటి. వేదసారాన్ని రంగరించి బోధించేవి ఉపనిషత్తులు. వీటిలోని సారాన్నంతా ఒకటి రెండు పదాలతోకూడిన ఒకే ఒక్క వాక్యంలో చెప్పడమనేది సామాన్యులకు ఊహకందని విషయం. ప్రాచీన భారతీయ మహర్షులకు మాత్రం ఇది వెన్నతో పెట్టిన విద్య. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అన్నది ‘ఋగ్వేదం’లోని ‘ఐతరేయోపనిషత్తు’ ప్రసాదించిన మహావాక్యం. గొప్ప జ్ఞానమే బ్రహ్మ. సంపూర్ణ జ్ఞానమే బ్రహ్మ. ‘సమస్తమూ బ్రహ్మమయమే’ అని గుర్తించడమే గొప్పనైన లేదా సంపూర్ణమైన జ్ఞానం.

‘ప్రజ్ఞానం’ అంటే ఏమిటో ‘అమరకోశం’ తెలియజేస్తున్నది. ‘ప్రకృష్టం జ్ఞానం, ప్రజ్ఞాయతే అనేనేతిచ ప్రజ్ఞానం. జ్ఞా అవబోధనే’. ప్రకృష్టమైన జ్ఞానం దీనితో చక్కగా తెలుస్తుంది కనుక అది ప్రజ్ఞానం. ప్రజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ‘బ్రహ్మజ్ఞానం’ అర్థమైనట్టే. ఇక్కడ ‘బ్రహ్మ’ అంటే త్రిమూర్తులైన ‘బ్రహ్మ విష్ణు మహేశ్వరుల’లోని బ్రహ్మదేవుడు కాదు. సృష్టి స్థితి లయలకు మూలస్వరూపమైన పరబ్రహ్మ తత్తం. దీనిని గురించిన సంపూర్ణ జ్ఞానమే ‘బ్రహ్మజ్ఞానం’ అవుతుంది. ‘జ్ఞానం’ అంటే ‘తెలివిడి’. ఒక విషయాన్ని గురించిన ఎరుక. ‘జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం’ ఈ మూడింటిలోనూ స్థాయీ భేదం ఉందన్నది మన పూర్వీకుల నిశ్చితాభిప్రాయం. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అన్న ఉపనిషత్‌ వాక్యంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి మన దైనందిన మాధ్యమ పరికరమైన ‘టీవీ’ (టెలివిజన్‌), తత్‌ ప్రసారాలు, వాటిలోని సాంకేతికతలను ప్రతీకగా చెప్పుకోవచ్చు.

‘టెలివిజన్‌' సెట్‌ను కొనడం దగ్గర్నుంచి చానల్స్‌లో కావలసిన దృశ్యాలను దర్శించడం వరకు ‘జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన’ విషయాలన్నీ ఉంటాయి. టీవీ నమూనా, ప్రామాణికత, నాణ్యత, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మొత్తంగా వస్తు వినియోగ నైపుణ్యం అంటే, ప్రకృతిని మానవుడు తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటున్నాడు. వంటివన్నీ ఒకరకమైన ‘జ్ఞానం’ కిందికి వస్తాయి. టీవీ స్టూడియోకు, అంతరిక్షంలోని మానవనిర్మిత ఉపగ్రహానికి మధ్య వైజ్ఞానిక శాస్త్రసంబంధం, సాంకేతిక పరికరాలు, వాటి నిర్వహణ తీరుతెన్నులు ఇలాంటి విశేషాలన్నిటినీ ‘విజ్ఞానం’గా భావించాలి. ‘ఒకచోట జరిగే పాంచభౌతిక సంఘటనను మరొక చోటు నుంచి చూడటం సాధ్యమా? వీక్షకుని ఎదుట ఉన్నవి సంఘటన తాలూకు ప్రతిబింబ దృశ్యాలే అయినా, పాంచభౌతిక భ్రాంతి అన్నది ఒకటి కలుగుతుంటుంది. ఎందువల్ల? స్థూలరూప దృశ్యం సూక్ష్మాతిసూక్ష్మ సంకేతాలుగా మారి అంతరిక్షంలోకి పయనించి కృత్రిమ ఉపగ్రహాన్ని చేరుకొని, టెలివిజన్‌ పరికరంలోకి చేరి, మనకు ‘నిజరూప దర్శనాన్ని’ అందిస్తాయి. ఇదంతా ఎలా సాధ్యమవుతున్నది?’

తమలోని వస్తువు చెడిపోకుండాను, చెదిరిపోకుండాను టీవీ సాంకేతికత ఎలా కాడుకుంటున్నది? ప్రత్యక్ష ప్రసారంగా మాత్రమే కాకుండా వివిధ విషయాలను ఆ తరంగాలు ఎలా నిలువ ఉంచుకోగలుతున్నాయి?- ఇలాంటి విషయాలను కనిపెట్టి మానవ వినియోగంలోకి తేవడాన్నే ‘ప్రజ్ఞానం’గా మనం అర్థం చేసుకోవాలి. దీనినంతా మనం ‘వైజ్ఞానికాంశం’గా అంగీకరిస్తున్నాం. ఇదే పద్ధతిలో సృష్టిలోని ‘మూలవస్తు స్వభావం’ గురించి తెలుసుకోవడమే ‘బ్రహ్మ జ్ఞానం’. ఉదాహరణకు పైన పేర్కొన్న రీతిలో ‘దృశ్య శ్రవణ సంఘటనలను మోసుకెళ్లే సంకేతాలను సృష్టించిందెవరు?’ అన్న విషయాన్ని తెలుసుకోమని చెప్పడమే ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అన్న మహావాక్యంలోని అంతరార్థం.