మంగళవారం 01 డిసెంబర్ 2020
Devotional - Oct 29, 2020 , 23:40:29

చరాచర జగత్తంతా శక్తి మయమే!

చరాచర జగత్తంతా శక్తి మయమే!

యాదేవీ సర్వభూతేషు చేతనేత్యభి ధీయతే

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥

- దుర్గా సప్తశతి

‘ఏ దేవి అనుగ్రహం వల్ల సృష్టిలోని సమస్త చరాచర ప్రకృతి చైతన్యమయం అవుతుందో, ఏ దేవి కరుణా కిరణాలు సోకకపోతే ఈ జగత్తు అంతా స్తబ్ధమై (జడమై) పోతుందో.. ఆ జగన్మాతకు నమస్సులు’. లోకంలోని అన్ని వెలుగులకు, కదలికలకు మూలకారణం పరమాత్మ సంకల్పమే. అందుకే, ‘కదిలే ప్రాణుల్లోన నీవే, కదలని స్ధాణువనగ నీవే, సదయా! జంగమయుడ వీవే..’ అన్న మహాత్మ అప్పాల విశ్వనాథశర్మ (శ్రీ పాండురంగాశ్రమం, మరుకూకు) వారి మాటలు ఈ సందర్భంగా అక్షరసత్యాలు. తల్లిగర్భంలో పిండరూపంలో కదిలే ప్రాణితో సహా పరమాణువు నుంచి బ్రహ్మాండం దాకా ప్రతిదీ కదిలేదే. ప్రతిదీ సంచలనాలకు నిలయమే. మన కండ్లకు కదలనట్టుగా కనపడే భూమి కూడా తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిచుట్టూ తిరుగుతున్నది.

‘పూర్వం పర్వతాలకు రెక్కలుండేవని, అవి యథేచ్ఛగా ఎగురుతూ ఎక్కడంటే అక్కడే వాలిపోయేవని, ఇంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికివేశాడని, అందుకే అవి ఎక్కడివక్కడ స్తబ్ధంగా పడిఉన్నాయని’ పురాణాలు చెప్తున్నాయి. భూకంపాలు, అగ్నిపర్వతాలు, సుడిగుండాలు, తుపానులు,  బడబాగ్నులు, కార్చిచ్చులు, కాలబిలాలు, ఉల్కాపాతాలు, పాలపుంతలు వంటి జగత్తులోని మహోత్పాతాలన్నీ మానవ మాత్రులకు అంతుపట్టని రహస్యాలే. అయితే, ఏ చైతన్యశక్తి సకల సృష్టి స్థితులకు ఆధారభూతమై నిలుస్తున్నదో.. అదే ఈ తరహా సమస్త విలయాలకూ కారణమవుతున్నది. ఆశ్చర్యమైన దీనిని ఆదిశంకరులు ఆనాడే స్పష్టం చేశారు.

శివశ్శక్త్యాయుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం

నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి

అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి

ప్రణంతుంస్తోతుంవా కథమకృత పుణ్యః ప్రభవతి

- ఆదిశంకరాచార్య (సౌందర్య లహరి)

శివుడు శక్తియుక్తుడైనప్పుడే అంటే అమ్మతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే శక్తిమంతుడవుతున్నాడు. లేకుంటే, ఆ స్వామి స్పందించడానికి కూడా సిద్ధం కాడట. అందుకే, హరిహర బ్రహ్మాదులు సైతం జగన్మాతనే విధిగా ఆరాధిస్తారు. ఇందులోని అంతరార్థాన్ని లోతుగా పరిశీలించి, శివుని నిశ్చలతత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ అమ్మ దయ తప్పనిసరి. అమ్మవారిది (చైతన్య) గతిశక్తి అయితే, అయ్యవారిది స్థితిశక్తి. వాగర్ధాలైన వారిరువురి కలయికే ‘ప్రకృతి పరమాత్మల సంయోజనం’. అదే ప్రాణశక్తి. అదే జీవచైతన్య శక్తి. పరమాత్మకు ప్రత్యక్షరూపాలైన పంచభూతాలూ (నేల, నీరు, నిప్పు, గాలి, నింగి) ప్రకృతి చైతన్యానికి ప్రతిరూపాలే. ఆధునిక భౌతికశాస్త్ర పరిశోధనలో ‘అణుధార్మిక భౌతికశాస్త్రం’ కూడా కదలని వస్తువుల్లోని సంచలనాలపై అద్భుతమైన విషయాలను వెల్లడిస్తున్నది.

లోకం దృష్టిలో కొండలు, బండలు వంటివన్నీ అచలాలు (కదలనివి). కానీ, వాటిలోనూ అంతర్గత కదలికల రహస్యాలను పై ఆధునిక విజ్ఞానశాస్త్రం సశాస్త్రీయంగా నిరూపిస్తున్నది. బాలభానుని లేలేత కిరణాల స్పర్శతో పుడమి పులకించిపోతుంది. వేణు మాధవుని మురళీ స్వరానికి రేపల్లెలోని ప్రతి అణువూ పరవశించింది. కరిమబ్బుల గర్జనకు పురివిప్పి మయూరి నాట్యమాడుతుంది. మహామౌనాకాశంలోంచి ప్రణవం ఉద్భవించినట్లు నిశ్శబ్దంలోంచి శబ్దం, ప్రగాఢాంధకారంలోంచి పరంజ్యోతి ప్రకాశం వెలుగుచూస్తాయి. దాన్నే ‘చైతన్యమయమైన దైవీశక్తి’గా మన పూర్వులు తరతరాలుగా ఆరాధిస్తున్నారు. ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారానే అనేకమంది యోగులు ఎన్నెన్నో అద్భుతాలను

సాధించారు.