శుక్రవారం 04 డిసెంబర్ 2020
Devotional - Oct 28, 2020 , 00:03:27

సమర్పణ భావంతోనే సత్ఫలితాలు!

సమర్పణ భావంతోనే సత్ఫలితాలు!

‘ఏడాదిన్నరగా యోగా చేస్తున్నాను. నిరాశగా ఉంది. ఇప్పటికి నేను ఏ స్థాయికి చేరుకున్నానో తెలియడం లేదు?’- ఇది సర్వసాధారణమైన ఫిర్యాదు. జిజ్ఞాసులు ఎవరైనా తమ ఆధ్యాత్మిక పథంలోని పురోగతిని తెలుసుకోలేనప్పుడు నిరాశ చెందడం సహజమే. స్థాయిలు సాపేక్షమైనవి. ‘ఒక సంవత్సరం ముందు ఆరంభించిన వారికన్నా తామే ఒక స్థాయి ముందుండాలని కోరుకోవడం.. వంటి ఆలోచనలున్నంత వరకు ఆధ్యాత్మికతలో పరిపక్వత సిద్ధించదు. పైగా, నిరాశతో యోగాపైనే విసుగొచ్చేస్తుంది. అందుకే, ఒక ‘సమర్పణ భావం’తో సాధన చేయాలి. ఈ మొత్తం ‘యోగా ప్రక్రియ’ ఎలా నిర్మితమైందంటే, ఆ మేరకు ‘జాగరూకత లేకపోతే చేయలేరు’. ఎప్పుడైతే మీరు జాగరూకులై, ఏ విధమైన ఆకాంక్షా లేకుండా, కేవలం సాధన మాత్రమే చేస్తూ ఉంటారో.. అప్పుడు మీలో ఒక ‘విస్ఫోటనం’ పుడుతుంది. ‘నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఒక అడుగు ముందుకువేస్తున్నానా?’ వంటి ఆలోచనలు విపరీతమైన పోటీవల్ల కలుగుతాయి. ఫలితంగా మీరు ఉన్నచోటే ఉంటారు. కనుక, స్థాయిలను గురించి మర్చిపోవడం మంచిది.

పూర్తి అంకితభావంతో ఉంటూనే దానిలో చిక్కుకోకపోవడమే దీని సారాంశం. ఉదయాన్నే సాధన చేయండి. మిగతా అంశాల పట్ల రోజం తా జాగరూకులై ఉండండి. మీ జీవితంలో ప్రతి విషయం యోగమ యం అయ్యేలా ఆచరించండి. మీరు కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా, నిద్రిస్తున్నా ప్రతిదీ యోగమే అవ్వాలి. ఈ తరహా ‘యోగా’ మిమ్మల్ని మీ ఉత్కృష్ట స్వభావానికి చేరువ చేస్తుంది. మీరు మీ శరీరం, మనసు, భావోద్వేగాలు, ఇంకా శక్తిని ఉపయోగించి భవబంధాల్లో చిక్కుకుపోవాలనుకుంటున్నారా? లేక, వాటి నుంచి విముక్తి పొంది అత్యున్నతమైన, అద్భుతమైన పరమానంద స్థితికి చేరుకోవాలని అనుకుంటున్నారా? తేల్చుకోండి. మిమ్మల్ని నిర్భంధించేవి, మీకు విముక్తిని కలిగించేవి అయిన సాధనాలు నిజానికి వేర్వేరు కాదు. శరీరం, మనసు, భావోద్వేగం, శక్తి .. ఇవన్నీ పనిచేస్తుంటాయి. కానీ, అవి వేర్వేరు మనుషులకు వేర్వేరు స్థాయిల్లో ఉంటాయి. కొందరిలో శరీరం ఆధిపత్యం వహించవచ్చు. మరికొందరిలో మనసు, ఇంకొందరిలో భావోద్వేగాలు, మిగిలిన కొందరిలో శక్తి ఆధిపత్యాలు వహించవచ్చు. ఈ కల్పనలో పాళ్లు ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా లేదా వైవిధ్యంగానూ ఉండొచ్చు. కానీ, అందరిలో ఇవే నాలుగు అంశాలు. ఈ నాలుగింటి (శరీరం, మనసు, భావోద్వేగాలు, శక్తి) సమాహారమే మీరు. వీటినీ సరైన పరిమాణాల్లో సమతుల్యం చేస్తూ, మిమ్మల్ని ముందుకు నడిపించేదే యోగ.

ప్రాథమిక ‘సాధన’ ప్రధానాంశాలను జాగృతం చేస్తుంది. దీనికి ఒక్కొక్కరికి ఒక్కో సమయం పట్టడానికి వివిధ కారణాలుంటాయి. నిబద్ధతతో, ఒక అర్పణలా చేస్తూ పోవడమే. వ్యర్థమైన ఆలోచనలన్నీ పక్కనపెట్టేయాలి. కేవలం సాధనపైనే దృష్టిపెట్టాలి. ఆధ్యాత్మికతైనా, మరేదైనా సరే, కేవలం మీరు కోరుకున్నంత మాత్రాన జీవితంలో అన్నీ జరిగిపోవు. మీరు మీ సామర్థ్యాన్ని అందుకు అనుగుణంగా మార్చుకున్నప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది. ఒకతను ఓ సెప్టిక్‌ ట్యాంక్‌లో పడ్డాడు. బయటకు రావడానికి చాలా ప్రయత్నించాడు కానీ, రాలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత ‘మంటలు.. మంటలు’ అని అరవటం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వారు ఇది విని ‘ఫైర్‌ బ్రిగేడ్‌' వాళ్లను పిలిపించారు. వారొచ్చి చుట్టూ చూశారు కానీ, మంటలు కనిపించలేదు. వారు ఈ వ్యక్తిని చూసి బయటకు లాగారు. ‘ఎందుకు మంటలు.. మంటలు’ అని అరిచావు? అవి ఎక్కడా లేవుగా?’ అనడిగారు. అప్పుడతను ‘నేను మురుగు.. మురుగు’ అని అరిస్తే ఎవరైనా వచ్చేవారా?’ అనడిగాడు. మనం సరైన పనులు చేసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయన్నది మరిచిపోవద్దు.


- సద్గురు జగ్గీ వాసుదేవ్‌