ఆదివారం 29 నవంబర్ 2020
Devotional - Oct 26, 2020 , 23:55:13

భగవానుని పురుషావతారాలు!

భగవానుని పురుషావతారాలు!

జగత్తు సృష్టికోసం శ్రీ కృష్ణ భగవానుని ‘సంపూర్ణ స్వాంశ’ మూడు విష్ణురూపాలను దాలుస్తుంది. మొదటిది: ‘మహావిష్ణువు మహత్తత్త్వం’ (భౌతిక శక్తిని సృష్టిస్తుంది). రెండవది: ‘గర్భోదక శాయి విష్ణువు’ (వివిధ వ్యక్తీకరణలకోసం అన్ని విశ్వాలలోకీ ప్రవేశిస్తుంది). మూడవది: ‘క్షీరోదక శాయి విష్ణువు’ (సకల విశ్వలలోని పరమాత్మ, అణువణువులోనూ వుంటాడు). ప్రభుపాదవారు పేర్కొన్న ‘సాత్వత తంత్రం’ (భగవద్గీత, శ్లో॥ 7.4) ప్రకారం ‘ఈ ముగ్గురు విష్ణువుల తత్తాలను తెలుసుకొన్నవారు భవబంధం నుండి ముక్తినికూడా పొందగలరు’.  ఈ భౌతిక సృష్టి మొత్తం భగవంతుని ఈ (మూడు) పురుషావతారాల లీలా కారణాలతోనే ఉద్భవించింది. జగత్తు అంతా ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సంకల్పంతోనే ఉద్భవించి, ఆ మేరకే కొనసాగుతూ, కాలాంతరంలో లయమవుతున్నది. 

శ్రీకృష్ణుడు ఎల్లవేళలా తన శాశ్వత సన్నిధానమైన ‘గోలోక బృందావనం’లోనే తన అత్యంత ప్రియ సన్నిహితులతో లీలా విన్యాసాలను గావిస్తుంటాడు. గోప, గోపికల విశుద్ద మాధుర్య భక్తి రసామృతాన్ని మధుపంలా అనునిత్యం స్వామి ఆస్వాదిస్తుంటాడు. ఈ చిద్విలాస రసిక శేఖరుడైన శ్రీకృష్ణునికి లోకంలో ప్రత్యేకంగా ఒసగవలసిన కార్యాలంటూ ఏమీ వుండవు. ఈ విషయమే ‘న తస్య కార్యం కరణం చ విద్యతే’. ‘భగవంతుడు నిర్వహింపవలసిన కర్మలంటూ ఏవీ వుండవు’ అని శ్వేతాశ్వతరోపనిషత్తు’ (6.7-8) పేర్కొన్నది. భగవంతుడంటే సకల సర్వావస్థల్లోనూ ఆనంద నిలయుడే. శ్రీకృష్ణుడు తన స్వీయసంకల్పంతో ఈ జగత్తును సృష్టించేందుకు ‘మహావిష్ణువు, గర్భోదక శాయి, క్షీరోదక శాయి’ త్రిరూపాల (పురుషావతారాలు)లో పరివ్యాప్తుడవుతాడు. విచ్ఛిన్నం కాని స్థితిలో సమ్మిళితమైనప్పుడు సమస్త భౌతికశక్తిని ‘మహత్తత్త్వం’గా పిలుస్తారు. దీనిని సృజించిన మహావిష్ణువు తన కండ్లతో దాన్ని చూసిపుడు సమస్త విశ్వ నిర్మాణానికి మూలమైన ‘షోడశ (పదహారు) మూల ఉపతత్త్వాలు’గా అది విచ్ఛిన్నమవుతుంది. శ్రీ మహావిష్ణువు కారణోదక జలాలలో శయనించి వున్నప్పుడు తనను ‘కారణోదక శాయి విష్ణువు’ అనికూడా అంటారు.

అండ, బ్రహ్మాండాలు ఆవిర్భవించిన తర్వాతనే ప్రతి విశ్వంలోని గర్భోదక జలాలలో ‘గర్భోదక శాయి’ రూపంలో అనంతశేష శయనుడై మహావిష్ణువు కొలువు దీరుతాడు. తన ఆంతరంగిక శక్తి స్వరూపిణియైన లక్ష్మీ అమ్మవారు.. స్వామి పాదపద్మాలను సేవిస్తుండగా, తన మహాద్భుత నాభీ కమలం చతుర్దశ లోకాలకు నిలయమైన విధాతకు నివాసయోగ్య స్థానాన్ని కల్పిస్తుంది. ఈ బ్రహ్మదేవుడే ఉపసృష్టికర్తయై సకల లోకాలలోని చరాచర జీవకోటికి తగిన దేహాలను నిర్మింప చేసి, కర్మానుసారం వారిని వివిధ లోకాలలో నెలకొల్పుతాడు. మూడవ పురుషావతారమైన ‘క్షీరోదక శాయి’ ప్రతి విశ్వానికీ చెందిన శ్వేతద్వీప లోకంలోని క్షీరసాగరంలో శేషశయనుడై స్థితికారక లీలావిన్యాసాలను గావిస్తుంటాడు. పరమ భక్తాగ్రేసరుడైన ధ్రువుడు వుండే ధ్రువనక్షత్ర మండలంలో ఇది నెలకొని వుంటుందని ‘భాగవతం’లో ఉంది. ఈ క్షీరోదక శాయి విష్ణువే సృష్టిలోని అణువణువులోనూ, సమస్త చరాచర జీవకోటి హృదయాంతర్యాలలోనూ ‘పరమాత్మ’గా కొలువుదీరి, వాటి చలనాలకు కారణమవుతాడని ‘భగవద్గీత’ వెల్లడించింది.

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి

భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా

- భగవద్గీత (18.61) 

‘ఓ అర్జునా! పరమ పురుషుడు సమస్త ప్రాణుల హృదయాలలో స్థితుడై ఉంటాడు. భౌతిక శక్తితో నిర్మితమైన దేహమనే యంత్రాన్ని అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి కర్మలకు అనుగుణంగా నిర్దేశిస్తుంటాడు’. ఈ విధంగా మూడు విష్ణు స్వరూపాల వల్లనే సమస్త భౌతిక సృష్టి జరుగుతున్నది. ఎవరైతే ఈ సృష్టి ప్రక్రియను శ్రద్ధాలువులై విని, అర్థం చేసుకోగలరో వారు తప్పక మోక్షాన్ని పొందగలరని పైన తెలిపిన శ్లోకం స్పష్టం చేస్తున్నది. హరే కృష్ణ.

శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ

93969 56984