గురువారం 26 నవంబర్ 2020
Devotional - Oct 23, 2020 , 01:33:51

పిరికితనాన్ని పోగొట్టే జ్ఞానజ్యోతి!

పిరికితనాన్ని పోగొట్టే జ్ఞానజ్యోతి!

కార్పణ్య దోషోపహత స్వభావః 

అపృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢ చేతాః

యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే 

శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌

- భగవద్గీత (2-7)

మానవుని బలహీనతల్లో పిరికితనం ఒకటి. మనల్ని సర్వ అనర్థాలకు, అనేక ఇబ్బందులకు గురిచేసే లక్షణం పిరికితనానికి ఉంది. మనిషి పురోగతికి, ధర్మాచరణానికి, సమాజ ప్రగతికి ప్రధానమైన అవరోధం పిరికితనమే అన్నది ప్రపంచమంతా అంగీకరించే సత్యం. అర్జునుడు కూడా శ్రీకృష్ణభగవానుని ప్రార్థిస్తూ ‘పిరికితనమనే దోషానికి గురైన బుద్ధితో ధర్మ నిర్ణయం విషయంలో నేను అశక్తుడనై మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ స్థితిలో నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని బోధించగలరు. నేను మీకు శిష్యుడను, శరణాగతుడను. నాకు తగిన ఉపదేశాన్ని ప్రసాదించగలరు’ అని ప్రార్థించాడు. అర్జునుని ఈ ప్రార్థనలో కొన్ని మౌలికమైన సత్యాలు తెలుస్తున్నాయి. మనిషికి జ్ఞానప్రదాతలైన గురువులు అతనిలోని పిరికితనాన్ని పోగొట్టే మార్గదర్శనం చేయగలరు. భగవంతుని శరణాగతి చేయడం వల్ల కూడా మానవుడు మానసికంగా ఎదిగి ఈ దోషం నుంచి విముక్తి కాగలడు. ముఖ్యంగా పిరికితనమనేది ‘పెద్ద దోషమే’ అన్న సంగతిని కూడా ఈ మాటలు తెలుపుతున్నాయి. అర్జునుడు తనకు విధించిన కర్తవ్య నిర్వహణ చెయ్యాల్సిన ముఖ్యమైన సమయంలో పిరికితనాన్ని పొంది, ‘నేను యుద్ధం చెయ్యలేనన్న’ నిరాశా నిస్పృహకు లోనైనాడు.

ప్రతి వ్యక్తీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇటువంటి ‘కార్పణ్య దోషాని’కి గురవుతుంటాడు. అప్పుడు ఈ దోషం నుంచి రక్షించవలసినవాడు జ్ఞానప్రదాత అయిన గురువే. మనిషికి, మానసిక బలహీనత ఆవరించినప్పుడే గురువు చేయూత ముఖ్యం. అతనిలోని ‘కార్పణ్యాన్ని’ పోగొట్టి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయగలిగే శక్తి గురువచనాలకు ఉంటుంది. అందుకే, జగద్గురువైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఇక్కడ అర్జునుడు తనను తాను శిష్యునిగా తెలుసుకొని, శరణు వేడాడు. తన పిరికితనంతో తాను పోగొట్టుకున్న స్వీయ స్వభావాన్ని పొందాలనుకున్నప్పుడు గురువును ఆశ్రయించడమే ధర్మంగా భావించాలన్న సందేశాన్ని అర్జునుని మాటలు సూచిస్తున్నాయి. అర్జునుడు సహజ స్వభావమైన క్షత్రియధర్మాన్ని పోగొట్టుకోవడానికి అతనిలో ప్రవేశించిన పిరికితనమే కారణం. అందుకే, తిరిగి ఆ దోష విముక్తిని పొందడానికి స్వామిని వేడుకొన్నాడు. దానివల్ల గురువు, దైవమైన కృష్ణస్వామి దయను పొందడానికి అర్హుడయ్యాడు. కార్పణ్య దోషానికి తాను పాల్పడ్డ సంగతిని గ్రహించి, తన సహజ స్వభావాన్ని తిరిగి పొందాలంటే ఏం చెయ్యాలో, తన కర్తవ్యమేమిటో తెలుపవలసిందిగా చిత్తశుద్ధితో వేడుకున్నాడు. ఈ ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు తమ జీవితాల్లో సాధించవలసిన ఎన్నో పనులను పిరికితనం కారణంగానే సాధించలేకపోతున్నారు. తమను ఆవహించిన ఈ దోషాన్ని తొలగించుకొన్నప్పుడు లెక్కలేనన్ని విజయాలను వారు సాధించగలరు.

అమేయ శక్తిసంపన్నుడైన భగవంతునిపై విశ్వాసం కలిగినప్పుడు, చేసే ఏ పనైనా భగవత్‌ కార్యంగా భావించినప్పుడు, అతనినే గురువుగా విశ్వసించి ముందుకు సాగినప్పుడు.. విజ  యం తథ్యం. జీవితంలో గురువు గొప్పదనాన్ని భగవద్గీతలోని ప్రతీ అక్షరం మనకు బోధపరుస్తుంది. ‘నరుడే శిష్యునిగా, నారాయణుడే గురువుగా’ ఈ లోకానికి అందిన గొప్ప సందేశం గీత. ఇందులోని బోధనలు మనలోని పిరికితనాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపగలిగే గొప్ప సత్యాలు. భారతీయ సనాతన ధర్మం గురువుకు పెద్దపీట వెయ్యడానికి కారణమూ ఇదే. గురువును ‘త్రిమూర్త్యాత్మకుని’గా గౌరవించిన ధర్మం మనది. మనలో జ్ఞానాన్ని సృష్టించి, దాన్ని సరైన మార్గంలో నడిపి, అజ్ఞానాన్ని పోగొట్టగలిగే జగద్గురువు విశ్వరూపాన్నే ‘భగవద్గీత’లో మనం చూస్తాం. మానవ జీవితానికి ఒక శాపంగా పరిణమించిన పిరికితనాన్ని పోగొట్టి, విముక్తిని కలిగించే జ్ఙానజ్యోతి ఇదే మరి.


- గన్నమరాజు, గిరిజామనోహర బాబు