గురువారం 26 నవంబర్ 2020
Devotional - Oct 21, 2020 , 00:23:19

ధార్మిక పాలనే ఉత్తమోత్తమం!

ధార్మిక పాలనే ఉత్తమోత్తమం!

రాజు దుష్టుడై, అధర్మపాలన చేయడం వల్ల జరిగే అనర్థాలు, రాజు ధర్మబద్ధుడైన వాడైతే రాజ్యం ఎలా సస్యశ్యామలమై ప్రజలు సుఖ జీవనం గడుపవచ్చునో మనకు వేనుడు, పృథువుల వృత్తాంతాల ద్వారా తెలుస్తున్నది. శ్రీమద్భాగవత మహాపురాణం ‘చతుర్థస్కం ధం’లో మైత్రేయుడు దీనిని విదురునికి వివరించాడు. స్వాయంభువ మనువు మనవడైన ధృవుని తర్వాత ఏడవతరం రాజు అంగుడు. ఆయన శ్రీహరిని ప్రార్థిస్తూ పుత్రకామేష్టి యజ్ఞం చేయడంతో ‘వేనుడు’ అనే కుమారుడు జన్మిస్తాడు. వేనుడు చిన్నతనం నుంచే దుర్మార్గుడవుతాడు. పిల్లల్ని, సాధు జంతువులను వేధించే పరమ క్రూరుడిగా మారతాడు. తదుపరి రాజుగా పరిపాలనలోనూ ప్రజా కంటకుడై సజ్జనులను పీడించసాగాడు. యజ్ఞయాగాదులు మానేసి ‘తననే దైవంగా పూజించమని’ శాసనాలు చేస్తుంటాడు. తట్టుకోలేని ఋషులు కోపించి, హుంకరించడంతో వేనుడు ప్రాణాలు విడిచాడు. దాంతో మళ్లీ అది రాజు లేని రాజ్యమైంది. ‘రాజ్యానికి రాజు కావాలి. అలాగే, వంశం అంతం కాకుండా ఉండాలి’. కనుక, వేనుడి మృత శరీరభాగాలను మథింపగా, ఊరువుల నుంచి నిషాదుడు, భుజాల నుంచి సాక్షాత్తు విష్ణువు అంశతో ‘పృథువు’- లక్ష్మీదేవి అంశతో ‘అర్చి’ అనే ఇరువురూ దివ్యతేజస్సుతో ఉద్భవిస్తారు. వీరిద్దరిని దంపతులుగా నిర్ణయించి, ఋషులు పృథువును రాజుగా పట్టాభిషక్తుణ్ణి చేశారు.

ప్రజలంతా రాజు దర్శనానికి వచ్చి తమ దుస్థితిని, రాజ్యంలో నెలకొన్న కరువు పరిస్థితిని వివరించారు. ‘సకాలంలో వర్షాలు కురుస్తున్నా ఈ క్షామం ఎందుకు?’ అని రాజు విచారించాడు. కారణం ‘ఈ భూమియే ప్రజలకు సరైన పంటలను ఇవ్వడం లేదు. పృథ్వినే దోషిగా నిర్ణయించి శిక్షించాలని’ అనుకున్నాడు. దాంతో భూమి పృథువు బాణాల నుంచి తప్పించుకోవడానికి గోవురూపం ధరించి, అతని ముందుకువస్తుంది. అప్పుడు భూమి పలికిన మాటలు కలియుగంలోని ప్రస్తుత పరిస్థితులకు చక్కగా అమరుతాయి. ‘రాజా! నీకు తెలియని నిజం చెప్తాను. బ్రహ్మ సృష్టించిన విత్తనాలను క్రమంగా దుష్టులు దోచుకోవడం, వాటిని పండించేవారికి అందకుండా చేయ డం, కష్టపడేవారి కడుపు కొట్టడం జరుగుతున్నది. ఇది మరీ శ్రుతి మించితే, పంటలు పండించడానికి ఆ కొద్ది ఓషధాలు కూడా కరువవు తాయని, నేనే వాటిని చాలాకాలంగా నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు వాటంతటవి మొలకెత్తవు. గోవు రూపంలో ఉన్న నానుండి పాల రూపంలో ఆ విత్తనాలను పితకాలి. అంతేగాదు, భూమ్మీద ప్రజల సంఖ్య పెరుగుతున్నది. వారందరికీ సరిపడా పంటలు పండించాలి. అందుకోసం, సరిపడా నేలను చదును చేయాలి. వర్షం నీరు సముద్రం పాలవకుండా ఒడిసిపట్టి భూమ్మీదే నిలిపే ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడు భూమిగా నేను సుభిక్షంగా ఉంటాను. ఇలా చేసినప్పుడు ప్రజల కష్టాలు తొలగుతాయి’ అని హితవు పలికింది. 

స్వాయంభువ మానవుని దూడగా రమ్మని ప్రార్థించిన పృథువు తన అరచేతినే పాత్రగా ఉపయోగించి, స్వయంగా పాలు పితికాడు. భూమి ఔదార్యానికి ప్రసన్నుడైన పృథువు భూదేవిని కూతురుగానూ స్వీకరించాడు. వెంటనే పృథ్విని చదును చేయించి పశుపాలనకు, వ్యవసాయానికి, నివాస యోగ్యంగా ఉండటానికి గ్రామాలను రాజ్యమంతా విస్తరిం చాడు. అంచలంచెలుగా రాజ్యాన్ని పటిష్టపరచడమే గాక సుభిష్టంగా ఉండేలా వసతులన్నీ సమకూర్చాడు. ఇలా రాజ్య పాలనను వ్యవస్థీకృతం చేసినవారిలో పృథువు ప్రథముడిగా గుర్తింపు నొందాడు. ‘రాజ్యాధికారం అనుభ వించే రాజుకు ప్రజల పుణ్యాల్లో, పండించే పంటల్లోనూ భాగం లభిస్తుంది. దానివల్ల రాజులు భూలోకంలో, స్వర్గలోకంలో సకల సౌఖ్యాలు పొందుతారు. అయితే, అటువంటి ఉత్తముడైన రాజుకు తన ప్రజలను రక్షించే బాధ్య తా ఉంటుంది. ప్రజల్లో అన్ని రకాలవారూ ఉంటారు. అందరినీ సమా న దృష్టితో చూస్తూ ధర్మబధ్ధంగా పరిపాలించే రాజులను దేవతలు కూడా అనుగ్రహిస్తారు’ అని ఈ పృథువు కథ నిరూపిస్తున్నది.