శనివారం 24 అక్టోబర్ 2020
Devotional - Oct 18, 2020 , 23:29:59

ఆది పరాశక్తి పాలయమాం!

ఆది పరాశక్తి పాలయమాం!

ఆశ్వీయుజ మాసంలో నవరాత్రులు నిర్వహించి ఆదిశక్తిని ఆరాధించడం ఆనవాయితీ. శరత్కాలంలోని తొలి తొమ్మిది రాత్రిళ్లు దుర్గాదేవి (పరాశక్తి)ని పూజిస్తే భక్తుల జన్మజన్మల పాపాలు, బాధలు దూరమవుతాయని మహర్షులు ప్రబోధించారు. 

దేవిని ఉపాసిస్తూ నిర్వహించే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. ఇవి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి కాబట్టి, వీటికి ‘నవరాత్రులు’ అని పేరు వచ్చింది. ‘రాత్రి’ అంటే ‘తిథి’ అనే అర్థమూ ఉంది. దీని ప్రకారం ఆశ్వీయుజ శుద్ధపాడ్యమి నుండి శుద్ధనవమి వరకు ఇవి జరుగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతున్నది. మూల నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు. దశమి రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పడం ఆనవాయితీగా వస్తున్నది.

తొమ్మిది రాత్రులుగా నిర్వహించే ఈ ఆరాధనా పద్ధతిలో ఆదిశక్తిని మూడు దశలుగా భావిస్తే, మొదటి మూడు రోజులు పార్వతీ దేవిగా, మధ్యమూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిగా పూజిస్తాం. పార్వతీ మాతను సౌభాగ్యానికి, లక్ష్మిదేవిని అభ్యుదయానికి, సరస్వతిని జ్ఞానానికి ప్రతీకలుగా భావిస్తూ అర్చించడం మన సంప్రదాయం. వ్యక్తి ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేందుకు ఈ మూడూ తప్పనిసరి. ‘సరస్వతి రూపంలో బ్రహ్మతో సృష్టి చేయిస్తున్నది, లక్ష్మిదేవి రూపంలో విష్ణుమూర్తితో పాలన చేయిస్తున్నది, పార్వతీదేవి రూపంలో రుద్రునితో లయం చేయిస్తున్నది నువ్వే. అటువంటి నీకు నమస్కారం’ అని ఆదిశంకరులు (కనకధారా స్తోత్రం) అంటారు. 

మన సనాతన ధర్మం భౌతిక జీవితాన్ని, పారలౌకిక జీవితాన్ని విడిగా చూడలేదు. ప్రతి వ్యక్తికీ ప్రగతి కావాలి, సుగతీ కావాలి. ఈ రెంటినీ ప్రసాదించేది అమ్మయే. ఆమెనే ఆదిశక్తి. ఈ నవరాత్రులూ అమ్మవారిని తొమ్మిది రూపాలలో అర్చించడం ద్వారా ఈ పుణ్యఫలం సిద్ధిస్తుందన్న విశ్వాసం మనలో ఉన్నది. తొమ్మిది రూపాలను ‘నవదుర్గలు’గా చెప్తారు. అవి: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. మొదటి రోజు శైలపుత్రినే గాయత్రీదేవిగా, రెండవ రోజు బ్రహ్మచారిణినే బాలాత్రిపురసుందరిగా, మూడవరోజు చంద్రఘంటనే అన్నపూర్ణగా, నాలుగవ రోజు కూష్మాండనే మహాలక్ష్మిగా, అయిదవ రోజు స్కందమాతనే దుర్గాదేవిగా, ఎనిమిదవ రోజు మహాగౌరినే మహిషాసుర మర్దినిగా, తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రినే రాజరాజేశ్వరిదేవిగా పూజిస్తాం. 

‘సిద్ధిధాత్రి’ అంటే ‘తనను తాను తెలుసుకోవడం’, తానే పథం నుండి వచ్చాడో అక్కడికి చేరడం, తన లక్ష్యాన్ని సిద్ధింప చేసుకోవడం. దక్షునితో అవమానానికి గురైన సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించిన పిదప పర్వతరాజ దంపతులైన మేనక- హిమవంతుల పుత్రికగా అవతరించడం వల్ల ఆమెను ‘శైలపుత్రి’ అన్నారు. పరమశివుని భర్తగా పొందడమే లక్ష్యంగా బ్రహ్మదేవునిపైనే మనసు నిలిపి తపస్సు చేయడం వల్ల ఆమెను ‘బ్రహ్మచారిణి’ (బ్రహ్మం యేన చరయితి బ్రహ్మచారి) అనీ అన్నారు.  అర్ధనారీశ్వర తత్తంలో ఆమె తలపై అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉన్నందున ‘చంద్రఘంట’ అన్నారు. చిరునవ్వు ముఖంతో విశ్వాంతరాలను సృజించేది కనుక ‘కూష్మాండ’ అయింది. స్కందుని(కుమారస్వామి)కి తల్లి కాబట్టి, ‘స్కందమాత’గా వర్ణించారు. కాత్యాయనుడు అనే మహర్షికి పుత్రికగా జన్మించినందున ‘కాత్యాయిని’ అనే పేరు వచ్చింది. ‘అలోకంబౌ పెంజీకటి’ వంటి శారీరక వర్ణం కలది కనుక, ఆమెను ‘కాళరాత్రి’ అన్నారు. ఎల్లకాలమూ ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే ఉండటంతో ‘మహాగౌరి’గా పిలుస్తున్నారు. తన వయసు ఎప్పుడూ మారదనడం ఎందుకంటే, ఆమె కాలానికి అతీతురాలని చెప్పడమే. సకల సిద్ధులను ప్రసాదించేది కనుక ఆమెను ‘సిద్ధధాత్రి’ అన్నారు. 

లలితా త్రిపురసుందరిని అర్చిస్తే భోగాలు, మోక్షాలు సిద్ధిస్తాయని వేదవిజ్ఞానం చెబుతున్నది. ‘లోకానతీత్యా లలితే లలితా తేన చోచ్యతే’ అంటున్నది పద్మ పురాణం. ‘లలిత’ అంటే లోకాలను అతిక్రమించేది. ఏది విశ్వవ్యాప్తమో, ఏది అనంత సృష్టి స్థితి లయలకు కారణభూతమో ఆ దివ్య చైతన్యమే లలితాదేవి. ఆమెనే దుర్గాదేవి. ‘దుందుర్గే దురితం హర’. దుర్గమ్మను స్మరించినంత మాత్రాననే సర్వపాపాలు హరిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఈ శక్తిని ఆరాధిస్తే పాపభావనలూ తొలగుతాయి. ‘దుర్గ’ అంటే దుర్గమమైంది. సాధకులు అంత ఆషామాషీగా ఆమెను చేరుకోలేరు. చెక్కుచెదరని స్థిరభావనతోనే ఆమెను ఆరాధించాలి. ‘దుర్గ’ అంటే ‘రక్షణ ఇచ్చేది’ కూడా. ఆ జగదాంబ తనను ఆరాధించేవారిని తప్పక అనుగ్రహిస్తుంది.

పాలకుర్తి రామమూర్తి

94416 66943


logo