గురువారం 29 అక్టోబర్ 2020
Devotional - Oct 18, 2020 , 23:29:59

దుఃఖ సంహారిణి దుర్గ!

దుఃఖ సంహారిణి దుర్గ!

శరన్నవరాత్రుల దీక్ష ఒక మహావ్రతం. ఈ సమయంలో చతుష్షష్ట్యుపచార పూజలు, చండీపారాయణాలు, హోమాలు, మూలా నక్షత్రంలో సరస్వతీ పూజా, కుమారీ కన్యా సువాసినీ ఆరాధనలు వంటివాటితో ఆ జగదాంబ కరుణా కటాక్షానికి పాత్రులు అవుతారని సర్వశాస్ర్తాలు చెబుతున్నాయి.

శరత్కాలే మహాపూజా క్రియతే యాచవార్షికీ స్తుతాసంపూజితాప్పుః ధూపగంధాది భిస్తథా దదాతి విత్తం పుత్రాంశ్చమతిం ధర్మే గతింశుభాం॥

- మార్కండేయ పురాణం

‘ఎవరైతే శరన్నవ రాత్రులలో, నన్ను పూజిస్తారో వారికి అవసరమైన సంపదలను, సత్సంతానాన్ని ప్రసాదిస్తాను. ధర్మాన్ని అనుసరించాలనే సద్బుద్ధినీ పొంది, చివరకు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని వారు చేరుతారు’.

‘శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే’. ‘నువ్వు తప్ప అన్యమెరుగనని’ తనను ఆశ్రయించిన వారిని, వారి యోగక్షేమాలు తప్ప, నాకు మరొక ధ్యాస లేదన్నంత ప్రేమతో అక్కున చేర్చుకుని, అనుగ్రహించే మహాతల్లి జగన్మాత. ఆమెనే దుర్గాదేవి. ‘దుర్గా’ అంటేనే, మానవుల సమస్త కోరికలను తీర్చి, సకల సుఖాలనూ ఇచ్చేదని అర్థం. మహావిఘ్నం, శోకం, దుఃఖం, నరకం, యమదండం, మహాభయం, రోగం మొదలైన అన్నిటినీ నశింపజేసే అమ్మవారు ఆమె. 

‘దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా’ (లలితాసహస్ర నామాలు). ఎంతటి దుఃఖాన్నయినా తొలగించి, సమస్త సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. దీనినే ‘దేవీ భాగవతమూ’ స్పష్టంచేసింది. ధర్మ సంస్థాపనే లక్ష్యంగా, సాధుజనుల సంరక్షణకు దుష్టశిక్షణకు ఆయా యుగాలలో అనేక రూపాలలో ఆమె అవతరిస్తుంది. 

శాస్ర్తుల వేంకటేశ్వరశర్మ

98499 09165


logo