ఆదివారం 25 అక్టోబర్ 2020
Devotional - Oct 18, 2020 , 23:29:59

విద్యాభివృద్ధి, జ్ఞాన వికాసానికి.. ఓం ఐం సరస్వత్యై నమః

విద్యాభివృద్ధి, జ్ఞాన వికాసానికి.. ఓం ఐం సరస్వత్యై నమః

‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా’

మనలో కదిలే జ్ఞాన చైతన్యమే సరస్వతీ దేవి. ‘సరతి’ అంటే ‘కదిలేది’ అని అర్థం. జ్ఞానానికి ఉండే కదలిక ఎంతో విశిష్టమైంది. బయటికి కనిపించేవి వస్తు, వ్యవహార, ప్రాపంచిక జ్ఞానాలు. కానీ, వీటిని నియంత్రించేవి అంతరమైన మానసిక, ఆత్మ జ్ఞానాలు. జ్ఞాన స్వరూపం అంతా ఒక్కటే. మన అవసరం కోసం వేర్వేరు జ్ఞానాలుగా వాటిని విభజించాం. మనలోని చైతన్యాన్ని మనం నిరంతరం దర్శించే విధానమే జ్ఞానం. ఈ స్ఫురణతో జీవితాన్ని గడపడం ద్వారా స్థాయిని, సంతోషాన్ని, సంతృప్తిని నిరంతరం వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. 

విద్య అన్నా, వేదం అన్నా తెలుసుకునే జ్ఞానమే. ఆ జ్ఞానసిద్ధి కోసం నిరంతరం జ్ఞానశక్తి స్వరూపిణి అయిన సరస్వతీ దేవిని   ప్రార్థించాలి. సూర్యుని వెలుగు తెలుపు. ఆ తెలుపు మనమీద పడితే మన స్వరూపం లోకానికి తెలుస్తుంది. ఆ తెలుపు వేర్వేరు వస్తువుల మీద పడితే వస్తు, లోక స్వరూపాలు తెలుస్తాయి. ఆ తెలుపుకు సంకేతమే సరస్వతీ దేవి. సూర్యకాంతి పూర్ణ స్వరూపమే సరస్వతీ శక్తి. ఆ దేవతానుగ్రహనికి ‘ఐం’ బీజాన్ని ఉపాసించాలి. అందుకే, మనలో జ్ఞానం, చైతన్యం, విద్య, ఆనందం అన్నీ పెరగాలంటే, సక్రమమైన విద్యాభివృద్ధి సకాలంలో సరైన ఎదుగుదల కావాలంటే ‘ఓం ఐం సరస్వత్యై నమః’ జపం చేయాల్సిందే. కేవలం విద్యార్థులేకాదు, జ్ఞానార్థులందరూ ఈ మంత్రాన్ని ప్రతి రోజూ కనీసం 1 గంటసేపు చేస్తే విద్యాబుద్ధుల వికాసంతోపాటు జ్ఞానసిద్ధితో జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరు.

సాగి కమలాకరశర్మ


logo