సోమవారం 26 అక్టోబర్ 2020
Devotional - Oct 18, 2020 , 23:29:59

గీతా సంస్కృతిని అలవర్చుకుందాం!

గీతా సంస్కృతిని అలవర్చుకుందాం!

ద్వాపరయుగం కంటే ముందే, కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ‘భగవద్గీత’ తొలుత సూర్యునికి చెప్పబడింది (4వ అధ్యాయం, 1వ శ్లోకం). ఆనాటి రాజర్షులు దానిని తాము పాటించారు. వారు తమ పాలనలోని ప్రజలకు ఆ ‘గీతాజ్ఞానం’ అమలుచేయడమేకాక ‘గీతా సంసృ్కతి’నీ అందించారు. అయితే, ఈ ‘గీతాసంస్కృతి’ ప్రజల జీవనవిధానంలో భాగం కావడం అన్నది కాలక్రమంలో అదృశ్యమైంది. ఈ కారణంగానే శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో తిరిగి అర్జునునికి దానిని బోధించాడు. ఇంతకూ, ‘గీతా సందేశానికి, గీతా సంస్కృతికి తేడా ఏమిటి?’ అన్నది కీలకం. ‘గీతా సందేశం ‘విద్య’ అయితే, గీతా సంస్కృతి దాని తాలూకు ‘విజ్ఞానం’. అభ్యసించే విద్యను ‘జ్ఞానం’ అంటాం. దీనిద్వారా విన్నదానిని ఆచరణలో పెట్టినప్పుడు అది ‘విజ్ఞానం’ అవుతుంది. ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు ‘జ్ఞానం విజ్ఞాన సహితం’ అన్నాడు. 

సిద్ధాంత జ్ఞానంతో సహా ఆచరణాత్మక విజ్ఞానాన్ని కూడా తాను బోధిస్తున్నట్లు ఆ దేవదేవుడు స్పష్టం చేశాడు. ‘గీతా సందేశం’ పూర్తిగా విన్న తర్వాత అర్జునుడు ఆ ‘జ్ఞానాన్ని’ పూర్తిగా ఆచరణలో పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇలా, అతడు తనచుట్టూ ఆవరించిన చీకట్లను తొలగించుకొని, వెలుగులను సుస్థిరం చేసుకున్నాడు. మానవుల విషయంలో ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసిన కార్యమే తప్ప దానంతట అదే ఒనగూడే స్థితి ఎంతమాత్రం కాదు. రోడ్డుపై వెళ్లే వ్యక్తికి దారిలో గుడి కనబడితే ఒక్క క్షణం ఆగి దేవునికి నమస్కరిస్తాడు. పుట్టినరోజు నాడు పిల్లలు కొత్తబట్టలు వేసుకొని తల్లిదండ్రుల కాళ్లు మొక్కుతారు. అత్తమామలు, భర్త, పిల్లలకు భోజనాలు పెట్టిన తర్వాతే ఇంటి ఇల్లాలు తాను తింటుంది. పెద్దలు ఎదురైతే రెండుచేతులు జోడిస్తాం. నుదుట తిలకం పెట్టుకుంటాం. ఇదంతా భారతీయ సంస్కృతి. ‘భగవద్గీతా సందేశం’ కూడా ఇదేవిధంగా మన నరనరాల్లో జీర్ణించుకొని పోవాలి. అప్పుడు మనిషి దాని ప్రకారమే జీవనయాత్రను కొనసాగిస్తాడు. ఇదే ‘గీతాసంస్కృతి’. అలా కాక, గీతను కేవలం పారాయణానికే పరిమితం చేసి, శ్లోకాలను కంఠోపాఠం చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ‘అద్భుతమైన గీతా జ్ఞానగంగ’ ద్వారా లభించవలసిన ‘సంపూర్ణ ఫలం’ అందకుండా పోతుంది. గీతను కేవలం ‘విద్య’ స్థాయికే పరిమితం చేయకుండా అది మన జీవన సంస్కృతిలో భాగం కావాలి. 

‘భగవద్గీత’లో చెప్పిన సందేశాలను ‘శ్రద్ధావంతులైనవారు’ తమ నిత్యజీవితంలో ఆచరిస్తూనే ఉంటారు. ‘గీతా సందేశం’లో ‘మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘నన్ను స్మరించు. నా భక్తుడివికా. నన్ను పూజించు. నాకు నమస్కరించు’ అన్నది ఆయన సందేశం. ‘పత్రం పుష్పం ఫలం తోయం. పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, జలమైనా ప్రేమతో అర్పిస్తే నేను స్వీకరిస్తాను’. దేవదేవుని ఇలాంటి బోధనలన్నిటినీ ఆచరణలోకి తేగలిగితే ‘గీతా సంస్కృతి’ మనకు అద్భుత ఫలితాలనిస్తుంది. అర్జునుని దృష్టిలో ‘గీతాచరణ’ అంటేనే ఆచరణాత్మకమైన ‘గీతా సంస్కృతి’. మానవ జీవితంలో వెలుగులు శాశ్వతంగా ప్రసరింపజేసే ఎన్నో సందేశాలు ‘భగవద్గీత’లో ఇమిడి ఉన్నాయి. ఆ అన్నిటినీ మనమూ ఎప్పుడైతే ఒక్కొక్కటిగా అమలుచేయడం మొదలుపెడతామో అప్పుడే మన జీవితంలోకి కూడా ‘గీతాసంస్కృతి’ ప్రవేశిస్తుంది. ఫలితంగా ప్రతి ఒక్కరూ చీకట్లకు అతీతమైన జీవనకాంతిని సుస్థిరం చేసుకోగలుగుతారు. అప్పుడు శారీరకంగా ఆరోగ్యవంతులం కావడమేకాక మానసిక ప్రశాంతతతో గొప్ప విజయాలనూ సొంతం చేసుకోగలం. చివరకు జన్మ సాఫల్యంతో ముక్తిని సాధిస్తాం.

డా॥వైష్ణవాంఘ్రి సేవక దాస్‌

98219 14642


logo