గురువారం 22 అక్టోబర్ 2020
Devotional - Oct 17, 2020 , 00:29:29

మోక్ష సాధన మార్గం!

మోక్ష సాధన మార్గం!

సహజాతాల వాలును సమున్నతి వైపు తీర్చడమే సాధన. అవగాహన, అనుభూతుల విమలత, విస్తృతులను బట్టి ‘సాధనా సీమ’ నిర్ణయమవుతుంది. దేశ, కాల, సామాజిక, సాంస్కృతిక, సంస్కార ప్రభావాలను బట్టి సాధనా దిశ, స్వరూపం నిర్ధారితమవుతాయి. భారతీయ ఋషుల అమృతానుభవ దర్శనంలో సాధన గమ్యం ఎప్పటికీ మోక్షమే! ‘మోక్ష’మంటే  ‘జన్మ రాహిత్యం’ లేదా ‘పరమపద ప్రాప్తి’ అన్నది సామాన్య పౌరాణిక భావన. ప్రత్యక్ష అనుభవ పరిమితిలో సునిశితంగా అవలోకిస్తే లోకంలో పొందే ద్వైతానుభవం ఆధారంగా నిర్వికార సత్య చైతన్యదీప్తిని దర్శించి, దానిని తన అమృతానంద అనుభవంగా పట్టుకోవడమే ‘మోక్షం’. అంటే, భౌతిక ప్రపంచంలోని అనంత భేద విలాసాలకు పట్టు పడటం లౌకికం. ఆ విలాసాల ప్రయోజనాల పరిమితిని గ్రహించి, వాటికి అవతల వాటిని విజ్ఞతతో నిరాకరించి, అంతర్ముఖీనత తో లోపలి ఆత్మానందాన్ని ఆవిష్కరించుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. ఇదే మోక్షసాధనా మార్గం.

ఎవరు ఏ విషయంలో సాధన చేసినా అది తమ వయసు, మనసు, శక్తియుక్తులు, నిష్ఠను బట్టి, ఇంకా అందిన అనుభవం గల గురు మార్గదర్శనాన్ని బట్టి, దేశకాలానుకూలతలను బట్టి, క్రమబద్ధంగా, సమయ నిబద్ధతతో సాగవలసి ఉంటుంది. అయితే, మన సాధన గమ్యం నిరంతరమూ మన ఎరుకలో ప్రజ్వలిస్తూ ఉండాలె. చింతన దాని చుట్టే సాగుతూ ఉండాలె. అప్పుడు ఎలాంటి విఘ్నాలు వచ్చినా సాధన దారి తప్పదు. సాధనలో రెండు భాగాలుంటై. ఒకటి: గమ్యం వైపు పురోగతి. రెండు: అందుకు అవరోధాలను కల్పించే అంతః శత్రువుల నియంత్రణ. ప్రపంచంలో సర్వసాధారణంగా సాధన సాగేది జ్ఞాన వికాసానికి, నైపుణ్యాల వృద్ధికి, జీవన అర్థ పుష్టికి, కీర్తిసిద్ధికి! అయితే, లౌకికజీవనం అశాశ్వతత్త్వాన్ని, అందులోని సుఖాల సాపేక్ష పరిమితిని దాని విజృంభణం మనిషిని పరాధీనం చేస్తుంది. తనను దాస్యంలో పడవేసే విపరిణామాలను గ్రహించినవారు లౌకిక జీవనగతిని మౌలికావసరాలకు మాత్రమే పరిమితం చేస్తారు. అలా, నిత్య నిరపేక్షానందం వైపు ఆధ్యాత్మికంగా ప్రయాణిస్తారు. ఇందులో, ఈ సుదీర్ఘ చరిత్రలో, మానవ కృషి అనేక మార్గాలను ఆవిష్కరించింది. ప్రఫుల్లమైన భారతీయ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో జ్ఞాన, కర్మ, భక్తి, రాజయోగాది మార్గాలు రాజమార్గాలుగా విస్తరిల్లినై. ఏ మార్గంలోనైనా సాధన ఫలవంతం కావాలంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అవసరం. అది సాధనా దిశకు, దశకు సంబంధించిన విశద విజ్ఞత అంతఃస్సూత్రంగా, సమృద్ధ ప్రవాహంగా సాగవలసి ఉంటుంది. లేకుంటే, సాధన దారితప్పిపోయి ప్రయోజనం కాస్తా సన్నగిల్లుతుంది.

వర్తమానంలో ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి రెండు విషయాల్లో విధిగా జాగరూకత, శ్రద్ధ, నిష్ఠ చూపవలసి ఉంటుంది. ఒకటి: సాంకేతికాభివృద్ధి, నాగరికత దిశ, శాసనదృష్టి ప్రబల వినియోగవాదపు మహావ్యాపార బంధనంలో చిక్కుకుపోవడం వల్ల, ఇంద్రియ సుఖాల కాంక్ష నిరంతరం ప్రజ్వలింపజేయబడటం వల్ల ఐహికతపై అతిజాగ్రత్తగా, అతిదృఢంగా పరిమితిని విధించుకోవలసి ఉంటుంది. రెండు: మారిన పరిస్థితుల్లో, ఎవరి విశ్వాసాలూ, ఆచారాలూ ఎలా ఉన్నా భౌతిక, వ్యావహారిక దూరాలు వీడి, అందరూ ఆత్మీయతతో అనివార్యంగా కలగలిసి జీవించవలసిన సందర్భమిది. కాబట్టి, విశ్వజనీన విజ్ఞానపు గీటురాయిపై తమ విశ్వాసాలను గీసి, వన్నె దిద్దుకొని, విశ్వాధారమైన అద్వయ పరబ్రహ్మాన్ని అవగాహనకూ, అనుభూతికీ తెచ్చుకొని తీరవలసి ఉంటుంది. అప్పుడే సాధనా జీవి తం శివప్రదం కాగలుగుతుంది.


logo