గురువారం 22 అక్టోబర్ 2020
Devotional - Oct 15, 2020 , 01:03:57

దాసుని హృదయంలోనే దేవుడు!

దాసుని హృదయంలోనే దేవుడు!

దాసభక్తి లోకోపకారకమేకాక మోక్షసాధనమనీ ఆంజనేయస్వామి మొదలు ఎందరో రామభక్తులు లోకానికి చాటి చెప్పారు. ‘నాకు దాసమారుతిగా వుండటమే ఎంతో ఇష్ట’మని హనుమంతుడు వెల్లడించాడు. భగవత్సేవ చేసే అవకాశం దొరకకుంటేనే మారుతి బాధపడతాడు. అసాధారణ వినయ విధేయతలతోనే తాను నిరంతరం శ్రీరామునికి సేవ చేశాడు. ‘పరాక్రమానికి మూలం, బుద్ధికి పునాది, వివేచనా శక్తికి బీజాంకురం దాస్యభావమే’ అన్నది ఆయన భక్తితత్త్వం. మంచి నడవడి, జ్ఞానం, పవిత్రత, నిర్భయత్వం వంటి సద్గుణాలు లేకపోతే ‘దాస్యభక్తి’ కుదరదు. ఇవన్నీ కలిగిన ఆంజనేయుడు శ్రీరామునికి ఒక దాసునిలా సేవ చేయటమే తప్ప ప్రతిఫలం కోరలేదు. సూర్యుని వద్ద నవ వ్యాకరణాలు నేర్చినా ఒద్దికగా వుండేవాడు. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం చేరే వేళ, బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు తొలిసారిగా పరిచయమైన తరుణంలో శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. కారణం, అతని వినయం, పలుకులలో స్పష్టత, మృదుత్వం, నిశ్చలత! ‘పెద్ద పండితుడై ఉంటాడు’ అని రాముడు భావించాడు. 

రామునికేకాదు, సీతమ్మ వారికికూడా అత్యంత ప్రేమపాత్రుడైన దాసానుదాసుడు పవన సుతుడు. పట్టాభిషేకం తర్వాత రాముడు అందరికీ కానుకలు ఇస్తుంటాడు. హనుమంతునికి ఏం ఇవ్వాలని సీతమ్మ ఆలోచిస్తుంది. తన మెడలోని నవరత్నాల హారాన్ని రామునితో మారుతికి ఇప్పిస్తుంది. ఆంజనేయుడు కన్నీరు పెట్టుకొంటాడు. అందులోని ఒక్కొక్క పూసనూ కొరికి పారేస్తుంటాడు. సభికులంతా ఆశ్చర్యంతో అలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తారు. ‘ఈ పూసల్లో నా రాముడు కనిపిస్తాడేమోనని చూస్తున్నాను’ అని సమాధానమిచ్చాడు. ఆఖరుకు గోర్లతో ఛాతినే నిలువునా చీల్చుకొని తన హృదయంలో సీతారాములు ఉండటాన్ని అందరికీ చూపించి ఆనందిస్తాడు. ‘ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ వాయుపుత్రుడు చెమ్మగిల్లిన కండ్లతో దాసుడై’ ఉంటాడు. ‘ఏ భృత్యుడైతే యజమాని కోసం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, కష్టమైన పనినైనా కూడా ఇష్టంగా చేయగలుగుతాడో అతడే నిజమైన పురుషోత్తముడు, దాసుడు’ అంటున్నది రామాయణం. ‘బుద్ధిమతాం వరిష్టం’ అన్నట్లు మృదుమధుర భాషణతో సీతమ్మ బాధను తొలగించడానికై ఈ మహాబలుడు పడిన తిప్పలు ఇన్నీ అన్నీ కావు. అశోకవనంలో రావణాసురుని వేగులు అనేక రూపాలలో మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. రావణాసురుడు బలగంతో వచ్చి సీతమ్మను బెదిరించి వెళ్ళటమూ చెట్టు పైనుండి ఆంజనేయుడు గమనించాడు. జానకి ఆత్మత్యాగానికి సిద్ధపడుతుంది. ఆమె ఎవ్వరినీ, ఎవ్వరి మాటలను నమ్మే పరిస్థితిలో లేదు. అప్పుడు ఓ మానసిక శాస్త్రవేత్తవలె ఆలోచించి, హనుమ అద్భుతంగా ‘రామనామం’ గానం చేశాడు. అతను సీతమ్మను తన పలుకులతో నమ్మించి, ఊరడించిన తీరు అనూహ్యం. 

రామదూతగా అతను ప్రదర్శించిన ‘కుశాగ్రబుద్ధి’ అనితర సాధ్యం. తన సమయోచిత ప్రజ్ఞకు సరిసమానం ఆయన దాసభక్తి. ‘దాసమారుతి’గా తాను ఎప్పుడూ సీతారాముల పాదాల చెంత వుంటూ వినయ విధేయతలనే ప్రకటించాడు. హనుమంతునిలో ఒక్కోసారి చిన్నపిల్లల చేష్టలే మనకు కనిపిస్తాయి. చూడామణిని తీసుకుని రాముడు ఆప్యాయంగా కౌగిలించుకొని, ‘నీకేం కావాలో కోరుకో’ అన్నాడు హనుమంతుడిని. ‘మీపట్ల అవ్యాజమైన ప్రేమ నాలో తగ్గకుండా చూడు స్వామీ. నాలో అన్యభావానికే చోటు వుండరాదు’ అంటాడు. మోక్షం కావాలనో, ధనం కావాలనో స్వార్థపరమైన కోరికలు హనుమ కోరనే లేదు. ఒకసారి సీతమ్మ తన పాపిటలో సింధూరం దిద్దుకోవటం చూశాడు. ‘ఇదెందుకు పెట్టుకున్నావు తల్లీ’ అని అడిగితే, ‘సింధూరమంటే రామునికి ఎంతో ప్రీతి’ అంటుంది. దాంతో తెల్లవారి తన ఒళ్ళంతా సింధూరం పూసుకుని సభకు వస్తాడు. భక్తి పారవశ్యత అంటే ఇదీ. ‘ఎవరైతే పూర్తి సమర్పిత భావం, శ్రద్ధాసక్తులతో భగవత్‌ ప్రేమతో సేవ చేస్తారో వారే దాసభక్తులని’ నిరూపించాడు మారుతి. 


logo