శనివారం 24 అక్టోబర్ 2020
Devotional - Oct 12, 2020 , 00:58:54

ప్రకృతి తత్త్వానికి ప్రతీక మన బతుకమ్మ!

ప్రకృతి తత్త్వానికి ప్రతీక మన బతుకమ్మ!

‘బతుకమ్మ’ పండుగ ఒక శిష్టాచారం కాకపోయినా, ‘ప్రజల సహృదయ నివేదన’లా రూపాంతరం చెందింది. ఇందులోని పాటల గళార్చన అమ్మవారికి ఇచ్చే సంగీతహారతి. ఒక ఆటలాగా చుట్టూ తిరిగినా, అదే ఒక ప్రదక్షణగా మారుతుంది. మోగే చప్పట్లు, వినిపించే ఆడబిడ్డల కాళ్ల పట్టీల చప్పుళ్లు ఆమె భజనకు మేళతాళాలు. ‘ప్రకృతి స్వరూపిణి’ అయిన అమ్మవారిని తంగేడు, అడవి చామంతి, కట్ల, గన్నేరు వంటి అడవిపూలతో ‘బతుకమ్మ’ రూపంగా పేర్చి పూజించడం ప్రపంచంలోనే అత్యంత అరుదుగా మన దగ్గరే కనిపిస్తుంది. 

ఏ శుభకార్యాలు అయినా మొట్టమొదట గణపతిని, తర్వాత ‘పసుపు ముద్ద’తో గౌరీదేవిని పూజించడం మన ఆనవాయితీ. మాంగల్యబలం, దాంపత్య బంధం బలంగా, క్షేమంగా ఉండాలన్నదే మహిళల జీవితకాల ఆరాటం. బతుకమ్మ పండుగపూట మహాసంబురంగా సాగే వారి ఆటపాటలన్నీ ప్రధానంగా తమ ఆకాంక్షలనుతీర్చమని అమ్మవారిని వేడుకొనేవే. పూర్తిగా పేర్చిన బతుకమ్మ ‘శ్రీ చక్రం’ ఆకారంలో ఉంటుంది. ఇదొక గొప్ప ప్రత్యేకత. మనిషికి, మరీ ముఖ్యంగా మహిళలకు, పూలకు మధ్య బంధం ఎంతో బలీయమైంది. మానవ శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ‘మూలాధారం’ నుండి ‘సహస్రారం’ వరకు! అలాగే, ప్రకృతిలోనూ పంచతత్త్వాలు ఉన్నాయి. ఇదే ‘బతుకమ్మ’లోనూ నిక్షిప్తమై ఉన్నది. పూలలోకూడా పృథ్వీ తత్త్వం, వాయు తత్త్వం, అగ్ని తత్త్వం, ఆకాశ తత్త్వం ప్రతీకలుగా కనిపిస్తాయి. ‘బతుకమ్మ’ పళ్లెంలో ముందుగా పేర్చేది తంగేడు పువ్వు. ఇది పృధ్వీతత్త్వనికి దగ్గరగా ఉంటుంది. దీనికి వ్యాపకత్వం చాలా ఎక్కువ. తర్వాతిది గునుగు పువ్వు. ఇది వాయుతత్త్వాన్ని సూచిస్తుంది. కట్లపూల మధ్యలో ఖాళీస్థలం ఉంటుంది. అది ఆకాశ తత్వానికి ప్రతీక. ఎర్రటి పూలలో అగ్నితత్తం ఉంటుంది. పంచభూతాత్మకమైన మన శరీర తత్త్వానికి, అన్ని తత్త్వాలూ కలగలిసిన బతుకమ్మ ఆరాధ్యనీయం.

బతుకమ్మ ఆటపాటలు చోళులు, కాకతీయుల కాలం నుండి కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ధర్మాంగుడి కథే దీనికి నిదర్శనం. ‘కాకతమ్మ’ కాకతీయుల ఆరాధ్య దేవత. గుమ్మడిపూలతో గోపురం చేసి, ఆ దేవతను వారు ఆరాధించే వారన్నది చరిత్ర. ‘ఆ గుమ్మడి పూల గోపురమే నేటి బతుకమ్మ’. ఈ పండుగ అసలు మూలాలు ‘బృహత్‌ అమ్మ’ ఉద్యమంలో ఉన్నాయని ప్రముఖ వాస్తుశిల్పి, రచయిత ఆవాల బుచ్చిరెడ్డి ప్రాథమిక పరిశోధనలో తేలింది. రాజేంద్ర చోళుడు ‘బృహత్లింగాన్ని’ తంజావూరుకు తరలించిన తర్వాత నాటి తెలంగాణ ప్రాంత ప్రజలు తమ ఆక్రోశాన్ని ఒక ఉద్యమంగా మార్చారు. చోళరాజుకు తమ నిరసన తెలిపే ప్రయత్నమే ‘బతుకమ్మ’ వేడుక సృష్టికి కారణమైనట్టు తెలుస్తున్నది. ఆ కాలంలో జరిగిన అనేక యుద్ధాలలో గుళ్ళు, గోపురాలు పాడై పోవడం, అవి శిథిలం కావటం, ఆడవాళ్లకు భద్రత లేకుండా పోవడం.. వంటి కారణాలు బతుకమ్మ వేడుక పుట్టుకకు కొంత దోహదపడ్డట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. ‘బృహత్‌ లింగాన్ని’ తొలగించిన తర్వాత ఇక్కడ పార్వతిని ‘బృహత్‌ అమ్మ’గా ప్రజలు కొలిచినట్లు తెలుస్తున్నది. కాలక్రమంలో ఇదే ‘బతుకమ్మ’ ఆటపాటల ఆరాధనా రూపాన్ని సంతరించుకొని ఉంటుంది.

ప్రతి స్త్రీమూర్తిలోనూ అమ్మవారిని దర్శించడం భారతీయ సంస్కృతి. ఆడబిడ్డలు తమ కష్టాలనుండి ధైర్యంగా గట్టెక్కి, సుభిక్షంగా బతకాలనే ఆకాంక్షను వ్యక్తంచేస్తూ ఆ పదాలనే పాటలుగా మలిచి పాడుతూ, ఆటలు ఆడుకోవడం ‘బతుకమ్మ’లో ప్రధానంశమైంది. ఈ తొమ్మిది రోజులు ఆడపిల్లలు ‘బతుకమ్మ’ ఆడుతుంటే, పెద్దవాళ్లు గౌరమ్మకు చెబుతున్నట్టుగా ‘మెట్టినింట్లో ఎలా నడుచుకోవాలో, పెద్దవారు, భర్త, అత్తమామలపట్ల ఎలా గౌరవ మర్యాదలు చూపాలో.. అనేక పాటల రూపంలో పరోక్షంగా వారికి హితవు చెప్పడం ఆచారంగా మారింది.

‘బతుకమ్మ’ ఆట ఆడుకునేటప్పుడు ఆ ప్రదేశంలో పరిశుభ్రతకు చిహ్నంగా తొలుత నీళ్ళు చల్లుతారు. వెంపలి మొక్కను నాటుతారు. పసుపు కుంకుమలు చల్లి, దానిచుట్టూ ‘బతుకమ్మ’లను పెడతారు. ‘బతుకమ్మ’ను సతీదేవితోనూ పోలుస్తారు. ఎందుకంటే, తన భర్తను అవమానించినందుకు, తండ్రి అని కూడా చూడక దక్షుణ్ణి ఎన్నెన్నో మాటలని, చివరకు ఆ హోమంలోనే తనువు చాలిస్తుంది సతీదేవి. దక్షుడు తాను చేసే యజ్ఞానికి దేవతలందరినీ పిలిచి, తన అల్లుడైన శివుడిని పిల్వక, అవమానించిన ఫలితం ఇది. అంటే, భర్తకు విలువ ఇవ్వకపోతే పుట్టింటి వాళ్ళు అయినా, కన్న తండ్రి అయినా అవసరం లేదనే తత్తాన్ని ఇది తెలియజేస్తున్నది. 

అమ్మ కడుపు నిండుగా...

బతుకమ్మను పూర్వకాలంలో ‘సిబ్బి’ అనే తీగతో పళ్ళెంలా అల్లి, దాంట్లో  పేర్చేవారు. ఇప్పుడు పళ్ళాల్లో పేరుస్తున్నాం. బతుకమ్మను ఒక్కొక్క వరుస రకరకాల పూలతో పేరుస్తూ పోతున్నప్పుడు లోపల గర్భం వస్తుంది. దానిని ఆకులతో నింపుతాం. ‘ఇది స్త్రీ తత్త్వానికి చెందింది కాబట్టి, ఆ జగజ్జనని కడుపు నిండుగా ఉండాలి. అప్పుడు మన బతుకులూ చల్లగా వుంటాయి’ అన్నది ప్రజల విశ్వాసం. బతుకమ్మ ముందు వెడల్పుగా, తర్వాత త్రిభుజాకారంలో, పైన గోపురం వలె వస్తుంది. పైన గుమ్మడిపూలతో అలంకరించి, దానిలో పసుపుముద్దను గౌరమ్మకు ప్రతీకగా ఉంచుతారు. ‘కూష్మాండం’ అంటే గుమ్మడి పువ్వు. అది అమ్మవారి రూపం. ఆ రూపానికి సంబంధించిన పుష్పాన్ని పెట్టి పూజించడం ఆనవాయితీ. అమ్మవారి స్థానం ఆజ్ఞాచక్రం. ఆపై ఉండేది సహస్రార చక్రం. అది శివ-శక్తి స్థానం. ఇదీ ఇందులోని అసలు తత్తం.

- వేముగంటి శుక్తిమతి

99081 10937


logo