మంగళవారం 20 అక్టోబర్ 2020
Devotional - Oct 12, 2020 , 00:59:47

ప్రదక్షిణలతో విశేష ఫలాలు!

ప్రదక్షిణలతో విశేష ఫలాలు!

గుడి చుట్టూ లేదా మన చుట్టూ మనం ‘ప్రదక్షిణలు’ చేస్తుంటాం. పూజలో భాగంగా ఇది ఎందుకు చేయాలి?

- శ్రియాన్ష్‌ కార్తికేయ, వేములవాడ

శరీరంలోని సర్వాంగాలతో చేసే నమస్కారం (ఆత్మ ప్రదక్షిణ) అత్యంత శ్రేయస్కరమని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి.  ‘భూఃప్రదక్షిణ షట్కేన కాశీయాత్రా యుతేనచ సేతుస్నాన శతైరశ్చ తత్ఫలం మాతృ వందనం’. ఒకసారి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయటంతో ఆరుసార్లు భూప్రదక్షిణ ఫలాన్ని, కాశీయాత్ర, సముద్రస్నానం ఫలాల్ని పొందుతాం. అదే పని వినాయకుడు చేసి ఫలం పొందాడు. తమ్ముడైన కుమారస్వామిపైన విజయం సాధించి శివ గణాలకు అధినాయకుడయ్యాడు. సుప్రభాత సమయంలో సూర్యకిరణాలు పడే విధంగా సర్వాంగ ఆత్మప్రదక్షిణ చేసినట్లయితే తనువులోని దోషాలన్నీ తొలగడమేకాక డి-విటమిన్‌ లభించి, ఆరోగ్యవంతులవుతారని ‘యోగవాశిష్టం’ తెలుపుతున్నది. మనసులో ఏకాగ్రతతో ప్రదక్షిణ చేసినట్లయితే వేయిమంది సూర్యుల తేజస్సు వస్తుందనీ వేదమంత్రం చెబుతున్నది.

పెద్దల పాదప్రక్షాళన, ప్రదక్షిణ ఎంతో ఫలప్రదమనికూడా వేదాలు ఘోషిస్తున్నాయి. ‘దేహమే దేవాలయమై’, ఆత్మ దేవుడైనప్పుడు ‘సంచారః ప్రదక్షిణ’ స్తోత్రాన్ని ‘సర్వాంగిరో’ అన్నట్లు శివుని అనుగ్రహం పొందడానికి ఆత్మప్రదక్షిణ అద్భుత మార్గమని ‘శివమానస’ స్తోత్రం చెబుతున్నది. ‘రుక్మిణీదేవి తులసిచెట్టుచుట్టూ మూడుమార్లు ప్రదక్షిణలు చేసి, తులసిపత్రం తాసులో వేస్తే కృష్ణశక్తికి సమతుల్యమైనట్లు’ భాగవతం ద్వారా తెలుస్తున్నది. గోవు, దేవాలయం చుట్టూ చేసే ప్రదక్షిణలవల్ల భగవంతుడు మనల్ని కాపాడుతాడని శాస్ర్తాలు చెబుతున్నాయి. సర్వాంగ ప్రదక్షిణలు, పొర్లు దండాలు పదకొండు, నూట పదహారు, వెయ్యినూట పదహారు.. ఇలా చేయటమూ ‘అరుణాచల క్షే్రత్రం’లో విశేషంగా    కనిపిస్తుంది.

మాడుగుల ,నారాయణ మూర్తి

94411 39106


logo