ఆదివారం 25 అక్టోబర్ 2020
Devotional - Oct 12, 2020 , 00:59:44

నవగ్రహాల అనుగ్రహానికి.. ‘ఓం సహస్ర రశ్మయే నమః’

నవగ్రహాల అనుగ్రహానికి.. ‘ఓం సహస్ర రశ్మయే నమః’

నమోస్తు సూర్యాయ సహస్ర రశ్మయే

సహస్ర శాఖాన్విత సంభవాత్మనే

సహస్ర యోగోద్భవ భావ భాగినే

సహస్ర సంఖ్యాయుధ ధారిణే నమ:

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుభాశుభ గ్రహాలుంటాయి. అవి అన్నీ మనకు శుభాన్నే కలిగించాలన్నా, ఆయా గ్రహాలు మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపించాలన్నా వాటిని నియంత్రించే సహస్ర కిరణ తేజస్సును ప్రార్థించాల్సి ఉంటుంది. 

మన శరీరం కూడా పూర్తి సౌర మండలమే. మన హృదయం, ప్రసరణ వ్యవస్థలు రవికి ప్రతీకలు. మనస్సు, ఇంద్రియాలు, జీర్ణ వ్యవస్థలన్నీ చంద్రునికి ప్రతీకలు. అదే విధంగా నాడీ వ్యవస్థకు బుధుడు, హార్మోన్‌ల వ్యవస్థకు శుక్రుడు, ఎముకలు, కండర కణజాల వ్యవస్థలకు కుజుడు, విసర్జక- శ్వాస వ్యవస్థలకు శని, దురాశకు రాహువు, నిరాశకు కేతువు సంకేతాలుగా కారణాలవుతున్నాయి. భూమిచుట్టూ ఉన్న గ్రహాలు భూమికి వేర్వేరు దిశల్లో ఉన్నప్పుడు భూవాతావరణంలో మార్పు వచ్చినట్లుగానే, మన జాతకాలలో ఉన్న గ్రహాలు లగ్నానికి వేర్వేరు దూరాల్లో ఉన్నప్పుడు ప్రభావాలు వేరుగా ఉంటుంటాయి. ఈ ప్రభావం ఎప్పటికీ అనుకూలంగానే ఉంచుకోవడానికి ఆయా గ్రహాలకు అధినాథుడైన సూర్య భగవానుని ప్రార్థించడం ఉత్తమం. 

‘సహస్ర’ అంటే ‘అనేకం’. ‘రశ్ములు’ అంటే ‘కిరణాలు’ లేదా ‘పగ్గాలు’. ‘రశ్మి’ అంటే వ్యాపించింది. అనేక కిరణాలతో మనలో వ్యాపించేవాడు సహస్ర రశ్మి. మనకు వేర్వేరు గ్రహాల వల్ల ఏర్పడిన బంధనాల (పగ్గాలు)ను తొలగింపజేసి మనలో అనంతమైన శక్తిని ప్రసరింపజేయడానికి సహస్ర రశ్ములను వినియోగించుకుంటాడు సూర్యుడు. గ్రహపతి అయిన సూర్యుని సహస్ర రశ్మి శబ్దాన్ని నిరంతరం జపించడం ద్వారా నవగ్రహాల వ్యతిరేకమైన కిరణ ప్రభావం తొలగిపోతుంది. జ్ఞానం, ప్రకాశం, తేజస్సు, కీర్తి, సంపదలకు ఆలవాలమైన సహస్ర రశ్ముల ప్రభావంతో నవగ్రహ అనుగ్రహం అధికంగా కలుగుతుంది. అందుకోసం, ప్రతిరోజూ కనీసం 1 గంటసేపు ‘ఓం సహస్ర రశ్మయే నమ:’ అని జపించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలిగి, ఆనందం అధికమవుతుంది. 

సాగి కమలాకరశర్మ


logo