గురువారం 29 అక్టోబర్ 2020
Devotional - Oct 10, 2020 , 00:11:52

ఒక ఆత్మ- మూడు శరీరాలు

ఒక ఆత్మ- మూడు శరీరాలు

దేహం నశ్వరం. ఆత్మ శాశ్వతం. మనం చిరిగిపోయిన బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లుగానే ‘ఆత్మ పాతదేహాన్ని వదిలి, కొత్తదేహాన్ని ధరిస్తుందని’ చెప్పాడు గీతాకారుడు. ‘పుట్టిందల్లా గిట్టవలసిందే’. కనుక, దేహమూ నశించకతప్పదు. ఆత్మ అన్నది పరమాత్మ అంశ కాబట్టి, దానికి జనన మరణాలు, ఆద్యంతాల్లేవు. దేహంలో ఉన్నంతకాలం అది ‘దేహాత్మ’. దేహంలోని చైతన్యాన్ని ‘జీవుడు’ అంటున్నాం. కనుక, దేహాత్మను ‘జీవాత్మ’గానూ పిలుస్తాం. దేహాన్ని వదిలిన తర్వాత జీవాత్మ విశ్వచైతన్యంలో కలుస్తుంది, కనుక అది ‘విశ్వాత్మ’ అవుతుంది. ‘పరమాత్మ’ అన్నది విశ్వాత్మకున్న మరో పేరు. పరమాత్మకు పాపపుణ్యాలు ఉండవు. పరమాత్మ స్వరూపమైన జీవాత్మకు కూడా అవి అంటవు.

ప్రాణి అన్నాక పని (కర్మ) చేయకతప్పదు. మనం చేసే మంచి పనులకు ‘పుణ్యం’, చెడ్డ పనులకు ‘పాపం’ వస్తుంది. అనేక జన్మల నుంచి మనం చేస్తున్న ‘పాపపుణ్యాలు’ ఒకచోట రాశిగా మన పేరుపైనే ఉంటవట. అవే ‘సంచిత కర్మలు’. వీటి నుంచి కొన్ని కర్మలను మనంతట మనమే ఎంచుకొని, వాటి ఫలాన్ని ఈ జన్మలో అనుభవించడానికి మనవెంట తెచ్చుకొం టాం. ఆ కర్మల పేరు ‘ప్రారబ్దం’. కర్మఫలాన్ని మరణానంతరం మనమే మోసుకెళ్లి ‘సంచిత’ రాశిలో కలుపుకొంటున్నాం. ఆ రాశిలోంచి కొన్ని ఫలాలు మరుజన్మకు వెంట తెచ్చుకొంటున్నాం. జీవాత్మకు పాపపుణ్యాలుండవు, అంటవు. కనుక, అది కర్మఫలాలను మోసుకెళ్లదు, తీసుకురాదు. జీవాత్మ వదిలివేసిన దేహా న్ని ఖననమో, దహనమో చేస్తున్నారు. కనుక, పాత దేహం కావాలన్నా లభించదు. అలభ్యతనొందిన మృతదేహానికి, జన్మనెత్తిన నూతన దేహానికి సంబంధం లేదు. మరి, ‘ఈ దేహానికి చెందిన కర్మఫలాలు ఆ దేహాన్ని ఎలా చేరుతున్నాయి? ఆ దేహం వాటిని ఎందుకు అనుభవిస్తున్నది?’ ఇవే మనలను వేధించే ప్రశ్నలు.

మనం బనీను, బనీనుపైన చొక్కాను, చొక్కాపైన కోటును ధరిస్తాం. మన శరీరాన్ని కప్పుకొనేందుకు ఏకకాలంలో మూడు వస్ర్తాలను ఉపయోగిస్తున్నట్లే ఆత్మకూడా ఒకదానిపైన ఒకటి అన్నట్లుగా మూడు శరీరాలను ధరిస్తుందట. అవి: ‘స్థూల’, ‘సూక్ష్మ’, ‘కారణ’ శరీరాలు. జన్మించిన నాటినుంచీ మరణించేదాక మనకు కనపడేది ‘స్థూలదేహం’. ఇది పాంచభౌతికం. అంటే, పంచభూతాల (ఆకాశం, గాలి, అగ్ని, నీరు, మట్టి)తో ఏర్పడేది. ఈ ‘స్థూలదేహం’ లోపల ‘సూక్ష్మదేహం’ ఉంటుం ది. ఇది కంటికి కనపడదు. కానీ, ‘స్థూలదేహం’ వలె ఇదీ పాంచభౌతికమే. బహుశా ఇది పంచభూతాల ‘తన్మాత్ర’ల రూపంలో ఉంటుందేమో, తెలియదు. ‘తన్మాత్ర’ అంటే ‘గుణం’ (స్వభావం). ఆకాశానికి శబ్దం, వాయువుకు స్పర్శ, అగ్నికి రూపం, జలానికి రసం, భూమికి గంధం తన్మాత్రలు. ఈ ‘సూక్ష్మదేహం’ లోపల ఉండేదే మూడోదైన ‘కారణదేహం’. ఇది కేవలం ‘జ్యోతిమాత్ర చైతన్యం’. జీవాత్మను ‘అహంకారం’ ఆలింగనం చేసుకొన్నందున ఏర్పడిందే ‘కారణ శరీరం’గా భావించవచ్చు. ఇక్కడ ‘అహంకారం’ అంటే ‘నేను’ అన్న స్పృహ.

స్థూలదేహాన్ని మాత్రమే వదలిన ఆత్మకు మరి రెండు (సూక్ష్మ, కారణ) దేహాలు ఉన్న కారణంగా అది ‘దేహరహిత శుద్ధాత్మ’ కాజాలదు. ఆత్మ పరమాత్మలో లీనం కావాలంటే స్థూలశరీరంతోపాటు సూక్ష్మ, కారణ దేహాలు కూడా నశించాలి. మన పాపపుణ్యాలకు చెందిన సంచిత, ప్రారబ్దాలను ఆత్మ ధరించిన సూక్ష్మ శరీరం అంటించుకుంటుంది. మరుజన్మకు మోసుకెళుతుంది. సూక్ష్మదేహం కూడా స్థూలదేహం లాగానే పాంచభౌతికం కనుక ఇది సాధ్యపడుతున్నది. దేహధారణ కారణంగా జీవాత్మగా మారిన పరమాత్మ అంశ ‘ఆత్మ విస్మృతి’కి లోనవుతుంది. ‘సంచిత, ప్రారబ్దాల’ కారణంగానే ఈ ‘విస్మృతి’ ఒక్కొక్క దేహంలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. చైతన్య స్థాయీ భేదం వల్లే ఈ విస్మృతి ప్రస్ఫుటమవుతుంది. మానవుల్లో కొందరు బుద్ధిమంతులుగా, మరికొందరు మందబుద్ధులుగా ఉండటానికి గల కారణం ఇదన్న మాట.