బుధవారం 28 అక్టోబర్ 2020
Devotional - Oct 09, 2020 , 05:40:58

అనంత సృష్టి స్వరూపుడు!

అనంత సృష్టి స్వరూపుడు!

 ‘సృష్టి ఎలా ఏర్పడింది? ఈ విశ్వానికి మూల స్వరూపమేమిటి?’ ఇవి సర్వసాధారణ సందేహాలు. శ్రీ అనంత పద్మనాభస్వామి రూపంలో మనకు ‘సృష్టి ఆంతర్యం’ బోధపడుతుంది. ‘అనంతుడు, ఆదిశేషుడు’ సర్పాల రూపాలు మాత్రమే కాదు, ‘అనంతుడు’ అంటే ‘అంతం లేనివాడు’ కూడా. ఈ సృష్టికి ప్రారంభం, ముగింపులను చూడలేం కనుక, ఇది కూడా అనంతమే. ఈ అనంత భావనను వ్యక్తం చేయడానికి సర్పరూపమూ ఒక ప్రతీక. కాలాన్ని, విద్యుదయస్కాంత శక్తిని, మూలశక్తిని దేనికైనా ‘సర్పాన్నే’ ఒక సంకేతంగా భారతీయ ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఏదైనా ఒక సంఖ్యలోంచి మరో సంఖ్యను తీసేస్తే మిగిలేది ‘శేషం’. ఈ సృష్టి పూర్తిగా తొలిగిన తర్వాత మిగిలే శేషాన్నే ‘శేషుడు’ అంటాం. ఇక్కడ శక్తి శేషంగా ఉంటుంది. దానికి మొదలు (ఆది) కూడా తోడవడంతో ‘ఆదిశేషుడు’ అయ్యాడు. మొదలు ఉన్నవాడు, చివరికి మిగిలేవాడు ఒక్కడే. మధ్యలో వ్యక్తమయ్యేవన్నీ తాత్కాలికం. శక్తి, చైతన్యం మాత్రమే శాశ్వతంగా ఉండేవి. ఇలా సృష్టి భావాన్ని చెప్పేదే ‘అనంత’ నామం కలిగిన సర్పరూపం. దీనిని ‘చాలా పెద్దది’, ‘ఆద్యంతాల్లేని అనంత రూపమ’ని కూడా మనం అర్థం చేసుకోవాలి.

‘విష్ణువు’ అంటేనే వ్యాపించినవాడు. విశ్వానికి విష్ణువు ప్రతీక. సర్వత్రా వ్యాపించినవాడు విష్ణువు. విశ్వరూపుడైన విష్ణువు పద్మనాభుని అవతారంలో, సర్పరూప ఆదిశేషునిలో, అనంతుని వలె శయనరూపంలో దర్శనమిస్తాడు. విశ్వాంతరాళంలో అంతా చీకటే. ఆకాశమూ విస్తృతమైందే. దీనికి ‘నలుపు లేదా నీలి’ వర్ణం ఉంటుంది. అందుకే, విష్ణు స్వరూపాలకు ముఖ్యంగా ‘నలుపు లేదా నీలివర్ణం’ చేర్చడం సంప్రదాయమైంది. విశ్వరూపాన్ని దాల్చేది కూడా విష్ణువే. ఐతే, అనంతుని పూర్తిరూపం విశ్వం కన్నా పెద్దది. అనంతశక్తిలో ఈ విశ్వం ఒక భాగం మాత్రమే. విశ్వమూ కొంతే వ్యక్తమై ఉంది కాబట్టి, దాని పరిధి కొంత తగ్గింది. అవ్యక్తమైంది కనుక, అనంతుని పరిధి చాలా పెద్దది అవుతున్నది. ‘పద్మం’ వికాసానికి సంకేతం. సూర్యుని రాకతో పద్మం ఎలా వికసిస్తుందో, శక్తి సమ్మేళనంతో విశ్వంలోని కొంతభాగమూ వికసించింది. దీనికి సంకేతమే ‘పద్మం’. ఆ కమలంలోని వాడు బ్రహ్మ. ‘పాంచభౌతిక శక్తి వికాసాని’కి బ్రహ్మ ఒక ప్రతీక కూడా. బ్రహ్మ ఉన్నచోట ప్రకృతి ఉంటుంది. ‘ప్రకృతి’ అంటే ‘పంచభూతాలు’. ఇవన్నీ ఒక ప్రత్యేక స్థితిలో ‘పంచీకరణ వ్యవస్థ’లో అల్లుకున్నాయి. బ్రహ్మదేవుని నాలుగు ముఖాలు ఈ భూమ్మీది నాలుగు దిక్కులకే కాదు, నాలుగువైపులా విస్తరించిన జ్ఞానానికీ ప్రతీకలు.

అనంతమైన శాశ్వత శక్తికి ఆదిశేషుడు సంకేతం. ఇందులోని విశ్వానికి విష్ణువు సంకేతం. నాభి కమలం ప్రకృతి వికాసానికి సంకేతం. బ్రహ్మ విస్తృత పాంచభౌతిక శక్తికి ప్రతీక. ఇదీ ఈ సృష్టి విధానంలోని ఆంతర్యం. మనం ఈ సృష్టిని, విశ్వాన్ని మొత్తంగా ఈ పద్ధతిలో తెలుసుకొని ఆరాధించాలి. ఈ దివ్యసృష్టిలో మనమూ భాగమైనందుకు స్వతఃసిద్ధంగానే ఆనందిద్దాం. ఈ నేపథ్యంతోనే శ్రీ అనంత పద్మనాభ స్వామివారి రూపాన్ని నిశితంగా మనసులో నిలుపుకోగలగాలి. అసలు భారతీయ వైజ్ఞానిక, తాత్తిక దృష్టిలో సృష్టిలోని ప్రతిదీ ఒక ప్రతీకగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రతిరూపాల వెనుక ఉన్నదంతా విజ్ఞానమే. మన అర్చనలన్నీ ఆనందం కోసమే.

-సాగి కమలాకరశర్మ


logo