బుధవారం 28 అక్టోబర్ 2020
Devotional - Oct 07, 2020 , 05:54:54

ధ్యాయేత్‌ కుండలినీ దేవీం!

ధ్యాయేత్‌ కుండలినీ దేవీం!

‘తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానర మయీం

నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్‌

మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా

మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీమ్‌!’

- ఆదిశంకరాచార్యులు (సౌందర్యహరి: 21)

‘లలితా త్రిపుర సుందరి’ తత్త్వాన్ని ఆదిశంకరులు వర్ణించిన విధం ఇది. ఆ అమ్మ స్వరూపం ‘తటిల్లేఖ’ (మెఱుపుతీగ) వంటిది. ‘తటిల్లతా సమరుచిః’ అన్నది లలితా సహస్ర నామం. అది ‘మెఱుపుతీగ’ వంటి ప్రకాశం. కాకపోతే, క్షణకాలమే మెరుస్తుంది. లౌకికంగా మనకు కనిపించే మెఱుపుతీగ కాదు ఇది. మనసులో శాశ్వతమైన ఆనందాన్ని సిద్ధింపజేసే ‘కాంతిరేఖ’. ‘బిసతంతు తనీయసి’ (లలితా సహస్రనామం) అంటే.., ‘తామరతూడులోని దారం ఎంత సూక్ష్మమో అంతటి సూక్ష్మమైందని’ అర్థం. ‘తన్వీ’ అన్న మాటా అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీమూర్తిని వర్ణించడానికే వాడుతారు. దానికి సమానమైన పదం తెలుగులో లేదు. ‘తపన శశి వైశ్వానర మయీం’. సూర్య చంద్రాగ్నిమయమైన కాంతి కలిగింది. సూర్యుడు తపనుడు, వేడిని ప్రసరిస్తాడు. చంద్రుడు శీతలత్వాన్ని అందిస్తాడు. అగ్ని జ్వలింపజేస్తుంది. సాధనలో ఈ మూడూ అవసరమే. సాధించాలనే తపన ఉంటే తపస్సు (అన్యభావన లేని ధ్యానస్థితి) సాధ్యమవుతుంది. అప్పుడు మనసు నిండా ప్రశాంతతే. అది జ్వలనంతో నిరంతరం ఉత్తేజితమవుతుంది. ‘తపన శశి వైశ్వానర మయీం’. ఎలాగైతే, అమ్మ సూర్యచంద్రాగ్ని మయమైందో అదే తత్వాన్ని సాధకులకూ అనుగ్రహిస్తుందన్న మాట. 

‘షణ్ణాం అపి ఉపరి కమలానాం’. షట్చక్రాలపైన సహస్రారంలో ఆసీనమైన శక్తి ఆమె. ఆమె 16వదైన ‘పూర్ణామృత కళ’ అమృతమయం.‘మూలాధారం’లో సర్పాకృతిలో సుప్తావస్థలో ఉండే ‘కుండలినీ శక్తి’ ఆరు చక్రాలగుండా ప్రయా ణించి, సహస్రారం చేరి, అక్కడ అమృతత్వాన్ని పొందుతుంది. సహస్రారమే ‘బ్రహ్మరంధ్రం’. ‘స్పురత్‌ విద్యుల్లతాకృతిం ధ్యాయేత్‌ కుండలినీ దేవీం’. ఆదిశక్తి మూలాధారంలో జాగృతమై సహస్రారం చేరుతున్నట్లుగా సాధకుడు భావిస్తూ ఉపాసనలో నిమగ్నం కావాలి.  దీనినే ‘సమయోపాసన’ (అంతరంగ ఉపాసన) అంటారు. సాధనలో ఈ కుండలినీ శక్తి విద్యుల్లతలాగా మదిలో స్ఫురిస్తుందట. దానిని మన అంతరంగంలో ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే అమ్మ దర్శనం అంత గొప్పగా ఉంటుంది. మూలాధారంలో శక్తి జాగృతమై స్వాధిష్ఠానం చేరే క్రమంలోనే సాధకునిలో ‘సత్ప్రవర్తన’కు బీజం పడుతుంది. ‘స్వాధిష్ఠానం నుంచి విశుద్ధి వరకు’ సాగే వేళ సత్కర్మలకు అంకురార్పణ జరుగుతుంది. విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రం చేరేవరకు మనసులో ‘సద్భావనలు’ నిండిపోతాయి. అక్కడ్నించి సహస్రారం చేరినప్పుడు ‘సచ్చిదానందం’ సాధకుని సొంతమవుతుంది.

‘మహా పద్మాటవీ సంస్థా’ (లలితా సహస్రనామం). ‘బ్రహ్మరంధ్రం’లోని ‘మహాపద్మారణ్యం’లో లలితాదేవి విహరిస్తుంది. ఈ అద్భుత శక్తిని గుర్తించడానికి మనసులో ఏ మాలిన్యాలూ లేని ‘స్వచ్ఛస్థితి’ ఉండాలి. అంటే, ‘త్రికరణ (మనసు, వాక్కు, కర్మ) శుద్ధి’. అవిద్య, అనుమానం, మాయ వంటి మాలిన్యాలన్నీ నశించాలి. అప్పుడు ‘దహరాకాశం’ (హృదయాకాశం, సహస్రారాకాశం) శుద్ధమై అమ్మ దర్శనానికి అర్హత లభిస్తుంది. ఇంతటి చిత్తశుద్ధి కలిగిన మహాత్ములు మాత్రమే లలితా అమ్మవారి తత్త్వాన్ని దర్శించి, ధరించగలుగుతారు. ఈ స్థితిలోనే మనసు ‘సత్వరజస్తమో’ గుణ ప్రవృత్తులకు అతీతంగా సహస్రారంలో అమృతత్త్వాన్ని ఆస్వాదిస్తుంది. దీనినే ‘పరమానందలహరి’ (పరమాహ్లాద లహరి, పరమం, అంతిమం) అంటారు. ‘సూక్ష్మ తరోపాసన’ (కుండలినీ ఉపాసన) నుంచి ‘సూక్ష్మ తమోపాసన’ (తత్త్వోపాసన) వరకూ సాగే ఈ ధ్యానస్థితి పూర్తిగా ‘భావనా గమ్యం’ (ఊహాత్మకం). ‘తటిల్లేఖా..’ అనడంలోని అంతరార్థం ఇదే.logo