ఆదివారం 25 అక్టోబర్ 2020
Devotional - Oct 05, 2020 , 23:35:23

సమభావమే సర్వోన్నతం!

సమభావమే సర్వోన్నతం!

సచ్చిదానంద ఘన స్వరూపుడైన పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, నిష్క్రియుడు, నిరామయుడు, కూటస్థుడు. ఐనా, తన మాయాశక్తి (ఇచ్ఛా, జ్ఞాన, క్రియ)తో సగుణ సాకార రూపంతో ప్రకటితమవుతున్నాడు. మాయ తాలూకు ‘సత్త రజ స్తమో’ గుణాలను స్వీకరించిన పరమాత్మయే ఈ లోకాలన్నింటినీ సృష్టించి, పోషించి, లయం చేస్తున్నాడు. పరమాత్మ ఒక్కడే. కానీ, అనేక రూపాలతో తన (మూల ప్రకృతి)లోనే మహత్తత్తం, అహంకారం, పంచభూతాల విశేషాలతో బ్రహ్మాండాన్నంతా (విశ్వం) సృష్టించాడు. ఈ సకల జగత్తే ఆయన ‘విరాట్‌ (స్థూల)’ స్వరూపం. ‘వివిధం రాజతే శోభతే ఇతి విరాట్‌' (వివిధ రూపాలతో ప్రకాశించేవాడు).

‘ఈ విరాట్‌ పురుషునికి పాదాల కిందిభాగం పాతాళం, పాదాల పై భాగం రసాతలం. ఆయన చీలమండలు మహాతలం, పిక్కలు తలాతలం, మోకాళ్లు సుతలం, తొడలు అతల-వితలాలు. భూతలం ఆయనకు నడుము, భువర్లోకం నాభి, సువర్లోకం వక్షస్థలం, మహర్లోకం కంఠం, జనలోకం ముఖం, తపోలోకం నుదురు, సత్యలోకం శిరస్సు. ఇంద్రాది దేవతలు అతని బాహువులు, దిక్కులు చెవులు, అశ్వినీ దేవతలు ముక్కు. అగ్ని ఇతనికి నోరు, నేత్రాలు ప్రకాశ శక్తి సూర్యుడు. భ్రూస్థానం బ్రహ్మదేవుడైతే శ్వాసయే అనంతవాయువు. కాలం ఇతని గమనం. మూలప్రకృతి తన హృదయం, మనస్సు చంద్రుడు, విజ్ఞానశక్తి మహత్తత్తం. రుద్రుడే అహంకారం’ అని భాగవతం అభివర్ణించింది. సర్వభూతాల, సర్వలోకాల సమష్టి రూపం ఇదే. ఈ విశ్వమంతటా పరమాత్మయే నిండి ఉన్నాడు. సూర్యుడు ఎలాగైతే, తన మండలాన్నంతా ప్రకాశింపజేస్తూ, బయటా వెలుగులను ప్రసరింపజేస్తున్నాడో అలాగే, పరమాత్మ కూడా బ్రహ్మాండం లోపల, వెలుపలా మహోన్నతంగా ప్రజ్వలిస్తున్నాడు. ‘ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌' అన్నది ‘ఈశావాస్యోపనిషత్తు’. విష్ణు సహస్ర నామస్తోత్రం కూడా ‘విశ్వం విష్ణుః’ అన్నది.

ఈ చరాచర జగత్తులో జీవులు నాలుగు విధాలు (జరాయుజాలు: గర్భస్థ మావి, అండజాలు: గుడ్లు, స్వేదం: చెమట, ఉద్భిజాలు: భూమిని చీల్చుకొని వచ్చేవి)గా పుడుతున్నాయి. ఇవి నీటిలో, భూమ్మీద, ఆకాశంలో చరించేవిగా మూడు రకాలు. గుణాలను బట్టీ విభజన జరిగింది. ‘సత్తగుణ’ సంపన్నులు దేవతలు, రజోగుణం కలవారు మనుషులు, తమో గుణం కలవి పశుపక్ష్యాదులు. జీవులన్నీ వాటి కర్మల ఫలితంగా శుభాశుభాలు, మిశ్రిత ఫలాలను అనుభవిస్తూ, ప్రళయకాలంలో మళ్లీ పరమాత్మలోనే కలిసిపోతాయి. ఇలాగే, జగత్తు అంతా ఆయనలోనే లీనమవుతున్నది. కనుక, పరమాత్మయే శాశ్వతుడు. మిగిలినవన్నీ నశించిపోయేవే. అన్ని ప్రాణులకు చెందిన వివిధ వృత్తులలో, జీవునిగా అన్ని పదార్థాలు, గుణాలను అనుభవిస్తూ, అన్నిటా తానే అయి ‘అంతర్యామి’ (అంతరాత్మ)గా వెలుగొందుతున్నాడు.

పంచభూతాలు (ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి), వాటి గుణాలు (శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం లేదా వాసన), వీటిని గ్రహించే జ్ఞానేంద్రియాలు (చెవులు, చర్మం, కండ్లు, నాలుక, ముక్కు), వివిధ క్రియలు చేసే కర్మేంద్రియాలు (వాక్కు, చేతులు, కాళ్లు, జననేంద్రియం, విసర్జకావయవం), వీటికితోడు మనసు (సంకల్ప- వికల్పాలు), బుద్ధి (నిశ్చయం), అహంకారం (నేను), చిత్తం అనే నాలుగు.. మొత్తం 24 తత్తాలు. వీటితో ఏర్పడే జీవులు, వాటి తత్తాలు అన్నీ పరమాత్మ అంశలే. ఇలా విశ్వమంతా వ్యక్తావ్యక్త రూపాలలో ప్రకటితమవుతున్న పరమాత్మ తత్తాన్ని అవగాహన చేసుకొనే మానవులే ఆయన సన్నిధిని చేరగలుగుతారు. ‘భగవద్గీత’ సైతం ‘సమం పశ్యన్‌ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్‌ న హినస్తి ఆత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్‌' అన్నది. అందుకే, అన్ని భూతాలలో, విశ్వమంతటా మనం పరమాత్మను చూడగలగాలి. వివిధ ప్రాణులపట్ల భేదభావం లేకుండా ‘సమత్వదృష్టి’ని అలవరచుకోగలగాలి.

దోర్బల కుమారస్వామి

94400 49608


logo