శనివారం 24 అక్టోబర్ 2020
Devotional - Oct 05, 2020 , 00:54:47

సృష్టి నుంచి శరణాగతి వరకు!

సృష్టి నుంచి శరణాగతి వరకు!

‘అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ మూతయః

మన్వన్తరేశానుకథా నిరోధో ముక్తిరాశ్రయః’

-శ్రీశుక ఉవాచ (శ్రీమద్భాగవతం)

‘శ్రీమద్భాగవతం’లో పది రకాల విశేషాలు ( సృష్టి, ప్రతిసృష్టి, వివిధ లోకాలు, భగవంతునితో పొందే సంరక్షణ, సృష్టి ఊతం, మన్వంతరాలు, భగవంతుని లీలలు, భగవత్‌ ప్రాప్తి, ముక్తి, సంపూర్ణ శరణాగతి: శ్రీమద్భాగవతం: 2.10.1) ప్రస్తావితమైనాయి. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని శబ్దావతారంగా భావించే ‘శ్రీమద్భాగవతాన్ని’ మొట్టమొదట ప్రబోధించింది శ్రీ శుక మునీంద్రులవారు. పై శ్లోకంలో వారు భాగవతంలోని పది విశేష విభాగాలను గురించి ప్రస్తావించారు. మానవుని మదిలో ఉత్పన్నమయ్యే సమస్త సందేహాలకు, ప్రశ్నలకు ‘భాగవత పురాణం’లో పరిపూర్ణ సమాధానాలు లభించాయి. కాకపోతే, వాటిలోని అంతరార్థాన్ని తెలుసుకోగలగాలి. జిజ్ఞాసువులైన వారు ఈ సమస్త సృష్టికి మూలాధారం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వుంటారు. అందుకోసం నిరంతరం పలు రకాల ఆధారాలను అన్వేషిస్తుంటారు కూడా. అంతేగాక, సృష్టికి సంబంధించిన ఇంకా ఎన్నో ప్రశ్నలు తరచూ అటువంటివారిలో ఉత్పన్నమవుతుంటాయి. 

ఈ విశ్వానికి మూలాధారమేమిటి? సమస్త సృష్టిలో మొట్టమొదటి జీవుడు ఎవరు? నేను ఎవరిని? ఈ ప్రపంచంలోకి నేను ఎందుకు జన్మించాను? ఇన్ని రకాల దుఃఖాలు ఎందుకు? నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? భయంకరమైన వ్యాధులు ఎందుకిలా నానాటికీ ప్రబలుతున్నాయి? ఎప్పుడూ సంతోషంగానే ఉండాలనుకుంటున్నా ఎందుకీ దుఃఖాలు? మంచివారు ఇబ్బందులు పడుతూ, చెడ్డవారు మాత్రం పురోగతి చెందడం భావ్యమేనా? ఏమీ తెలియని పసిపిల్లలు అంగవైకల్యంతో జన్మించడం అన్యాయం కాదా? భగవంతుడనే వాడొకడున్నాడా? ప్రపంచంలో ఎందుకిన్ని సమస్యలు? భగవంతునికే కనుక కరుణ ఉంటే అమాయకులైన పసిపిల్లలకు సైతం కష్టాలు కలిగిస్తాడా? భగవంతుడు నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడా? కొందరు అందంగా, మరికొందరు అందవిహీనంగా ఎందుకు జన్మిస్తారు? కొందరు బలవంతులుగా, మరి కొందరు బలహీనులుగా ఎందుకుంటారు? భగవంతుడు నిష్పక్షపాతే అయితే, లోకంలో ఎందుకిన్ని అసమానతలు? కాలం, ప్రకృతి.. అంటే ఏమిటి? వీటిని శాసించేది ఎవరు? దుర్మార్గులు ఎందుకున్నారు? భగవంతుని వాస్తవిక స్వభావం ఏమిటి? ప్రపంచంలో దేవుని పేరిట ఇన్ని మతాలు దేనికి? కొందరి మధ్య మతాల పేరుతో గొడవలు అవసరమా? ‘కుల వ్యవస్థ’ అంటే ఏమిటి? సమాజంలో కొన్ని వర్గాలవారి అణచివేతకు గల కారణాలేమిటి? ప్రకృతి విపత్తులు దేనికి? ఆనందంగా ఎలా జీవించగలం? జీవిత అంతిమ లక్ష్యం ఏమై వుండాలి? జీవితంలో సమతుల్యతను ఎలా సాధించటం..?

ప్రతి వివేకవంతుని మదిలో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటాయి. ‘హరే కృష్ణ’ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు పై శ్లోకాన్ని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా వివరించారు. శ్రీల శుకదేవ గోస్వాముల వారు వివరించిన ఈ దశ విధాలైన అంశాలు సకల ప్రశ్నల నివృత్తి పథాలు. ‘బుద్ధిమంతులైన వారు ఈ జ్ఞాన ఉపకరణాన్ని సద్వినియోగ పరచుకోగలరు’ అని ఆయన తెలియజేశారు. పైన తెలిపిన పది అంశాలన్నీ ‘శ్రీమద్భాగవతం’లో అత్యత్భుత రీతిలో ఎంతో లోతుగా వివరితమైనాయి. అందుకే, శ్రీమద్భాగవతం ‘సకల సందేహ నివృత్తి పథం’గా అభివర్ణితమైంది. కనుకే, ప్రతి రోజూ ఎవరైతే భాగవత పఠనం చేస్తారో, వారు జీవితంలో ఎదురయ్యే సకల దుఃఖాలను, ఆవేదనలను, ఆటుపోట్లను అధిగమించి విశుద్ధమైన కృష్ణప్రేమను పొందగలరు. హరే కృష్ణ.


logo