ఆదివారం 25 అక్టోబర్ 2020
Devotional - Oct 05, 2020 , 01:48:22

ఏది కలియుగ ధర్మం?

ఏది కలియుగ ధర్మం?

మన సనాతన ధర్మాలు కొన్ని యుగయుగానికి మారుతూ వస్తున్నాయా? ఉదాహరణకు రామాయణంలో తండ్రిమాటకు గొప్ప విలువ వుంటే, మహాభారతంలో కౌరవులు దానిని పెడచెవిన పెట్టారు. కానీ, ఒక కొడుకు తల్లికి ఇచ్చిన మాటకోసం ఏకంగా పాండవులు అయిదుగురూ భార్యనే పంచుకొన్నారు. ‘ఏకపత్నీ భావన’ ద్వాపరయుగంలో ఏమైంది? మరి, కలియుగానికి ఎలాంటి ధర్మాలు ఉంటాయి?

-డి.సాయితేజ, సుచిత్ర సర్కిల్‌, సికింద్రాబాద్‌

ఆత్మకు సంబంధించిన ధర్మమే సనాతనం. అయితే, దేశకాలాలనుబట్టి మానవులు ఆచరించే ధర్మాలు మాత్రమే నానా రకాలుగా ఉండటమేకాక మారుతూ ఉంటాయి. దానధర్మాలు, రాజధర్మాలు, మోక్షధర్మాలు, స్త్రీ ధర్మాలు, భక్తుల ధర్మాలు, జాతిధర్మాలు, కులధర్మాలు ఇలా ఎన్నెన్నో ధర్మాలు ఉన్నా అన్నిటినీ ‘సనాతన ధర్మాలు’గా చెప్పలేం. కేవలం ‘ఆత్మధర్మమే సనాతన ధర్మం’. భగవంతుడే శ్రీరామునిగా మానవ పాత్రను పోషించాడు. కాబట్టి, లోకధర్మాలను చూపిస్తూ పితృవాక్పాలన, ఏకపత్నీ వ్రతం, మైత్రీధర్మం, ప్రభుధర్మం, రాజధర్మం వంటివి ఆచరించి చూపించాడు. అయితే, కౌరవులు తండ్రిమాట వినక పోవడం ధర్మచ్యుతికి సూచనే కాని అదే ధర్మమని కాదు. భగవంతుడు, భగవత్‌ ప్రతినిధులు ధర్మపాలన చేసి చూపిస్తారు, అధర్మపరులు ధర్మాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తారు. ద్రౌపది తన కోర్కె మేరకు అయిదుగురిని భర్తలుగా పొందిందే కానీ, పాండవులు ఒకే వనితను వివాహమాడటం అనేది యుగానికి సంబంధించిన ధర్మం కాదు.

 ఇక, సాక్షాత్తుగా భగవంతుడే అవతరిస్తే దేవదేవుని ప్రభావమేమిటో చూపడానికి, ఏ విధంగా ప్రతీ వనితా ఆకర్షితం అవుతుందో చూపడానికే శ్రీకృష్ణుడు 16,108 మంది రాచకన్యలను వివాహమాడాడు. మానవులు ఆ దేవదేవుని అనుకరించడం కాకుండా, ఆ స్వామి చెప్పిన సందేశాలను (భగవద్గీత) అనుసరించే ప్రయత్నం చేయాలి. సత్యయుగంలో ప్రజలు శాంతులు, వైరం లేనివారు, సర్వజీవులపట్ల మైత్రి కలవారు, అన్ని పరిస్థితులలో స్థిరచిత్తులై వుంటారు. కాబట్టి, వారు పాటించే ధర్మాలు మహోన్నతంగా ఉంటాయి. తర్వాత వచ్చే త్రేతాయుగంలో జనులు ధర్మపరులు, మోక్షసాధనలో అభిరుచి కలిగిన వారై ఉంటారు. అప్పటికే సత్యయుగంతో పోలిస్తే రెండు సద్గుణాలు తగ్గిపోయాయి. ద్వాపరయుగంలో జనుల ఒకే సద్గుణం జిజ్ఞాస. కలియుగం వచ్చేసరికి మానవుల సద్గుణాలు శూన్యమైపోయాయి. వారికి ఎలాంటి ధర్మపాలనా తెలియదు. వారికి చెప్పిన యుగధర్మం కేవలం ‘హరినామ సంకీర్తనం’ మాత్రమే. మనం సత్యం, దయ, తపస్సు, శౌచం పాటిస్తూ, హరినామాన్ని ఆశ్రయిస్తే కలి ప్రభావం నుండి బయటపడి ముక్తులమవుతాం.

- డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్‌

98219 14642


logo