బుధవారం 28 అక్టోబర్ 2020
Devotional - Oct 01, 2020 , 23:50:22

నామ సంకీర్తనమే మన పారాయణం!

నామ సంకీర్తనమే మన పారాయణం!

యజ్ఞయాగాదులను నిర్వహించలేక, వేదవేదాంగాలను అభ్యసించలేక, శాస్ర్తోక్త ధర్మ, జ్ఞాన మార్గాలను అనుసరించలేక, ఇంద్రియ నిగ్రహం సాధ్యమవక, చంచలమైన మనసు వశంలోకి రాక, యోగాభ్యాసం చేయలేక, దుష్కరమైన భక్తియోగమూ సాధ్యపడకపోయినా.. దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ కలియుగంలో ‘నామ సంకీర్తనం’ అనే సులభోపాయంతోనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. ‘కలౌ నామ సంకీర్తనమ్‌' అనే సూక్తి దీనినే పేర్కొన్నది. ‘భగవన్నామ సంకీర్తనం’ చేయాలంటే ఇతర వస్తుసామగ్రితో, ధనరాశులతో పనిలేదు. దూరప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు. పుణ్యక్షేత్రాలలో నివాసం చేయాలనే నియమం లేదు. శరీరానికీ ఎక్కువ అలసట ఉండదు. భగవంతునిపై ప్రేమ (భక్తి) ఒక్కటి ఉంటే చాలు. దీనికి శ్రద్ధ, ఏకాగ్రత, విశ్వాసాలను తోడు చేసుకుంటే సరిపోతుంది.

ఆర్తావిషణ్ణాః శిథిలాశ్చభీతాః ఘోరేషుచ వ్యాధిషు వర్తమానాః

సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతు॥

- వేదవ్యాస మహర్షి (శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రాలు: ఫలశ్రుతి)

దానధర్మాలు చేయాలంటే సంపదలు ఎక్కువగా ఉండాలి. తీర్థయాత్రలు చేయాలంటే శరీర ఆరోగ్యం ముఖ్యం. చేతిలో డబ్బు ఉండాలి. బరువు బాధ్యతలు తీరాలి. ఇవేవీ లేకున్నా, దేశకాల వయోలింగ వర్గభేదం లేకుండా అందరూ సులభంగా చేయగలిగే ‘భగవన్నామ సంకీర్తనం’ వల్ల ఎన్నెన్నో సత్ఫలితాలను పొందవచ్చు. సంపదలను కోల్పోయినవారు, శత్రుభయానికి లోనైనవారు, భయంకరమైన రోగ బాధలను, విషాదాన్ని పొందినవారు శారీరకంగా, మానసికంగా అశక్తులైనవారు ‘నారాయణ నామ సంకీర్తనం’ ద్వారా ఆయన దయకు పాత్రులై తమ కష్టాల నుంచి విముక్తులవుతారు. 

‘శమాయాలం జలం వహ్నేః తమసో భాస్కరోదయః

శాంతిః కలౌహ్యఘౌఘస్య నామ సంకీర్తనం హరేః॥

- విష్ణుపురాణం

నీరు మాత్రమే అగ్నిజ్వాలలను చల్లార్చగలుగునట్లు, సూర్యకాంతి చీకట్లను పూర్తిగా పోగొట్టునట్లు, ‘కలిదోషాన్ని, పాపరాశిని అంతటినీ సమూలంగా నశింపజేసేది భక్తితో చేసే హరినామ సంకీర్తనం’ ఒక్కటే. ‘మధుసూదనుడి నామాన్ని’ ఏకాగ్ర చిత్తంతో కీర్తించేవారు సాంసారిక బాధల నుంచి సులభంగా విముక్తులవుతారు. ‘భగవన్నామ సంకీర్తన’ చేయడానికి వయసుతో పనిలేదు. నదీతీరాలలో, పవిత్రమైన స్థలాల్లో, పుణ్యక్షేత్రాల్లో, దేవాలయాల్లో, ఇండ్లలోని దేవుని మందిరాలలోనే ‘నామ సంకీర్తనం’ చేయాలనే నిమయం కూడా లేదు. పూర్వకాలంలో సదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ప్రయాణ సమయంలో, అలాగే పంక్తి భోజనాల సందర్భంలో అందరికీ భోజన పదార్థాల వడ్డన పూర్తయ్యేవరకు ‘భగవన్నామ సంకీర్తన’ చేసే అలవాటు ఉండేది. ఇలాంటి విధానం ప్రస్తుత కాలంలోకూడా కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తున్నది. అప్పట్లో తమ తమ పిల్లలకు భగవంతుని పేర్లు పెట్టేవారు. పిల్లల పేరును పలికే నెపంతో కూడా ‘భగవన్నామ సంకీర్తన’ చేసినట్లవుతుందని భావించేవారు. గృహిణులు, వృద్ధులు గృహకార్యాలు నిర్వహిస్తూ కూడా సంకీర్తనం చేసేవారు.

‘స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్‌'॥. 

భీష్మాచార్యుల వారివద్దకు ధర్మరాజు వచ్చి, ‘ఎవరి గుణాలను స్తుతించడం వల్ల, ఎవరిని అర్చించడం వల్ల మానవులందరూ లౌకికంగా శుభాలను, అభివృద్ధిని పొందడమే కాకుండా,‘ నిశ్రేయసం’ అనే మోక్షాన్ని కూడా పొందగలరో తెలుపమని’ కోరుతాడు. వెంటనే ఆయన, ‘జగత్తుకు ప్రభువు, పురుషోత్తముడు, దేవదేవుడు, అనంతుడు అయిన శ్రీమహావిష్ణువును వేయి నామాలతో సంకీర్తనం చేస్తే సకల శుభాలు, సంపదలు కలుగుతాయని’ పేర్కొన్నాడు. అందుకే, మన పూర్వుల ఉపదేశాలను శిరసావహిస్తూ, వారిని అనుసరిస్తూ, శుభాలను కలిగించే, కష్టనష్టాలను తొలిగించే ‘నామ సంకీర్తనాన్ని’ చేయడానికి మనమూ సిద్ధపడుదాం. మనసుంటే మార్గం ఉండకపోదు. ‘నామ సంకీర్తనం’ చేయాలనే దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకుంటే సమయాన్నికూడా కేటాయించగలుగుతాం. బస్సు, రైలు, విమాన ప్రయాణ సమయాల్లో విశ్రాంతికి కేటాయించుకున్న ఏ సమయంలోనైనా ప్రశాంతమైన మనసును లగ్నం చేసి, భక్తి శ్రద్ధలతో చక్కగా ‘నామ సంకీర్తన’ (మనసులోనైనా) చేసుకోవచ్చు. వ్యర్థమైన మాటలు, అనవసర చేష్టలతో కాలం వెళ్లబుచ్చకుండా ఈ రకమైన భగవత్సేవతో అందరం తరిద్దాం.


logo