శుక్రవారం 30 అక్టోబర్ 2020
Devotional - Oct 01, 2020 , 00:35:23

సత్యమే పరమాత్మ మార్గం

సత్యమే పరమాత్మ మార్గం

‘సృష్టిలోని సమస్త జీవకోటిలో ప్రాణశక్తిగా ఉన్నది పరమాత్మే’ అన్న సత్యాన్ని గ్రహించగలిగినవాడు సాధకుడు. అలాంటివారు అధిక ప్రసంగాలు చేయకుండా ‘మౌన మునుల’ వలె ఉంటారు. ‘ఆత్మానంద’ అనుభూతిలో వారు నిరంతరం ఓలలాడుతుంటారు. ‘పరమాత్మ అంతటా ఉన్నాడు’ అనే అనుభవం పొందడానికి నాలుగు సాధనాల (సత్యం, తపస్సు, సమ్యక్‌ దర్శనం, బ్రహ్మచర్యం)ను చూపించింది ‘ముండకోపనిషత్తు’. వీటిలో సత్యం అన్నిటికంటే తేలికైనట్టు కనిపించినా అదే అత్యంత కఠినమైంది. ‘సత్య సంధత’ (జీవితమంతా సత్యాన్ని వ్రతంగా ఆచరించడం) ఎంతో కష్టం. ‘సత్యాయ మిత భాషిణాం’ అన్నది రఘువంశీయుల సద్గుణం. తక్కువ మాట్లాడటం ఎందుకంటే.. ‘అబద్ధాలు రాకుండా ఉండటానికి’. ‘సత్యమేవ జయతే నానృతం. ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుంది. అసత్యానికి జయం ఉండదు’ అని వేదాంతాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. దేవతలు, ఋషులు నిరంతరం సత్యమార్గాన్నే అనుసరిస్తారు. పరమాత్మకూడా సత్యరూపంలోనే ప్రకాశిస్తాడు.

మన దేశానికి, జాతికి ఒక సనాతన నినాదం.. ‘సత్యమేవ జయతే’. ‘సత్యం, అహింసల’నే ఆయుధాలుగా మలచుకొని సాగిన ‘భారత స్వాతంత్య్ర సంగ్రామం’ యావత్‌ ప్రపంచానికే ఆదర్శమైంది. ప్రాచీన భారతీయ సాహిత్యమూ సత్యానికి భద్రమైన స్థానం కల్పించింది. అన్ని కాలాలకు ‘సత్యమార్గమే అనుసరణీయం’. ‘మహాభారతం’ అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజును ఉద్దేశించి, ‘సూర్యుడు దేనిలో నిలిచి ఉంటాడు?’ అని అడిగితే, ‘సత్యంలోనే’ అని సమాధానమిస్తాడు. సత్యమంటే ‘ఋజువర్తనం’. అందుకే, సూర్య కిరణాలు ‘ఋజుమార్గం’లోనే ప్రసరిస్తాయి. కనుక, ‘సత్యమే దేవతల మార్గం’. సత్యమే ఈశ్వర స్వరూపం. ధర్మంలోనే సత్యం నెలకొని ఉంటుంది. సత్యమే అన్నిటికీ మూలం. సత్యాన్ని అనుసరించకపోతే పరమ పదమే ఉండదు. 

సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా

సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్‌

- శ్రీరాముడు (రామాయణం: అయోధ్యకాండ,

109వ సర్గ, 13వ శ్లోకం)

‘సత్యమే ధర్మం. సత్యమే లక్ష్మి, సత్యమే అన్నిటికీ మూలం. అదే అన్ని ధర్మాలకు ఆధారం..’ అన్నదే శ్రీరాముని శాసనం. నాలుగు యుగాలలో మొదటి (కృత) దానికే ‘సత్యయుగమని’ పేరు. ఈనాటికీ ‘సత్యం, ధర్మం, నీతి, అహింస’ వంటి వాటిమీదే జీవనం కొనసాగించేవారిని ‘సత్తెకాలపు సత్తెయ్యలు’గా పిలుస్తారు. యుగాలు మారేకొద్దీ ధర్మదేవతకు ఒక్కో కాలు పోయి కలియుగంలో ఒంటికాలిమీద నిలబడే దుస్థితి ఏర్పడింది. అందుకే, ఇన్ని అనర్థాలు, అన్యాయాలు, అధర్మవర్తనలు. సత్యం కోసం యావత్‌ జీవితాన్ని అంకితం చేసిన హరిశ్చంద్ర మహారాజు దానినే తన ఇంటిపేరుగా మలచుకున్నాడు. వచ్చినవాడు వామనుడుకాడని, తనను పూర్తిగా అణగ దొక్కగలవాడని తెలిసినా బలి చక్రవర్తి తన మాటను వెనక్కి తీసుకోలేదు. ‘తిరుగన్నేరదు నాదు జిహ్వ, మాట తిరుగలేరు మానధనులు’ అని ఆడిన మాటకోసం సర్వస్వాన్నీ ఆనందంగా అర్పించుకొన్నాడు.

‘మహాభారతం’లోని ‘శకుంతలోపాఖ్యానం’లో నన్నయ, ‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె ఒక దిగుడు బావి మేలని’, అలాంటి నూరు దిగుడు బావులకంటే ఒక యజ్ఞం మేలని, అలాంటి నూరు యజ్ఞాలకంటే ఒక కొడుకు మేలని, అలాంటి కొడుకులు నూరుగురికంటే ఒక సత్యవాక్కు మేలని’ చాటి చెబుతాడు. సత్యాన్ని వదిలేయడమంటే పరమాత్మ మార్గం నుంచి తప్పుకోవడమే. ఒక్కోసారి సత్యం నిష్టూరంగానూ ఉండవచ్చు. కాని, దాని ఫలాలు మధురంగానే ఉంటాయి. ‘సత్యం బ్రూయత్‌, ప్రియం బ్రూయత్‌, న బ్రూయాత్‌ సత్యమప్రియం’. ‘ఎప్పుడూ నిజమే పలకాలి. ఇష్టంగా మాట్లాడాలి. అప్రియమైన సత్యాన్ని కొన్ని సందర్భాలలో పలుకక పోవడమే మేలు’ అంటున్నది ‘మనుస్మృతి’. దీనినే ‘మహాభాగవతమూ’ బలపరిచింది. అనంతామాత్యుడు రచించిన ‘గోవ్యాఘ్ర సంవాదం’ లాంటి కథలూ సత్యస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి కథలను ఈతరం పిల్లలకు చెప్పగలిగితే భావి భారతావని సత్యధర్మాలతో విలసిల్లుతుంది.


- మరుమాముల దత్తాత్రేయశర్మ

94410 39146