శుక్రవారం 23 అక్టోబర్ 2020
Devotional - Sep 28, 2020 , 01:06:54

చంద్రమా మనసో జాతాః

చంద్రమా మనసో జాతాః

చీకటి తమస్సుకు ప్రతీక. దానిని తేజోవంతం చేసేది వెన్నెల. మనసులో పరచుకున్న మాలిన్యాల చీకట్లను కడిగి వేసే విధంగా ‘శరత్కాల పౌర్ణమి’లో పిండిని ఆరబోసినట్లు వెన్నెల పరుచుకుంటుంది. షోడష కళాప్రపూర్ణుడైన చంద్రునినుండి చంద్రికా మయూఖాలు (వెన్నెలలు) అమృతధారలుగా ప్రవహిస్తూ, ప్రసరిస్తుంటాయి. ప్రశాంతమైన ఆకాశంలోంచి వచ్చే వెన్నెల భూమండలాన్ని పునీతం చేస్తుంది. తేటదనం ‘జ్ఞానానికి’ ప్రతీక అయితే, ప్రకాశం ‘ఆహ్లాదాన్ని, ఆనందాన్ని‘ ఇస్తుంది. అందుకే, జ్ఞానం ఆనందదాయకం కావాలని కోరుకొనేవారు మనసును ఎప్పుడూ శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. దీనికి ‘నిండు చంద్రబింబమే’ ఒక సంకేతం. 

మోక్షసాధనా శీలియైన ప్రతి వ్యక్తీ అంతరంగం ‘వెన్నెల వన్నెలు’ నిండార కురిసే భవ్య నిలయమే. అసలు, ‘చంద్రుడిని ఆరాధించడం ఎందుకు?’ అన్నది సర్వసాధారణ సందేహం. ఆధ్యాత్మికంగా శోధిస్తే అసలు తత్త్వం బోధపడుతుంది. మనమేది సంకల్పించినా శ్రద్ధతో, ఏకాగ్రతతో పూర్తి చేయాలి. అందుకు మన ‘మనసు’ సహకరించాలి. ఆ మనసు ‘చంద్రునికి’ సంబంధించింది. అందుకే, ‘చంద్రమా మనసో జాతాః’ అన్నది వేదం. ‘విరాట్‌ పురుషుని మనసునుండి’ ఆవిర్భవించినవాడు చంద్రుడు. చంద్రునిపై చిత్తాన్ని నిలిపి చంద్రబింబాన్ని శరత్‌ పౌర్ణమినాడు అర్చించడం ద్వారా ‘సంకల్పసిద్ధి’ జరుగుతుంది. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు శరధృతువుకు నెలవులు. ఈ పండు వెన్నెల కాలంలో వాతావరణం ప్రశాంతమవుతుంది. ప్రస్తుత అధికమాసం తర్వాత వచ్చే నిజ ఆశ్వీయుజంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, ఆరాధనలు ఆనవాయితీ. ప్రత్యేకించి శరత్‌ఋతువులో వచ్చే మొదటి పౌర్ణమినాడు చంద్రుని ఆరాధన, వెన్నెలలో లలితార్చన చేసి పాయసాన్ని నివేదించి, ప్రసాదంగా స్వీకరించడం అత్యంత శుభకరం.

చంద్రుడు క్షీరసాగర మథనంలోంచి జన్మించాడు. చంద్రుని ఆరాధించడం వల్ల అతనితోపాటుగా ఉద్భవించిన లక్ష్మీదేవి, ధన్వంతరిలు కూడా సంతోషిస్తారు. లక్ష్మీదేవివల్ల సంపదలు, ధన్వంతరివల్ల ఆరోగ్యం సిద్ధిస్తాయి. ‘శరశ్చంద్ర నిభాననా’ అని లలితాదేవిని సహస్రనామాలలో భాగంగా సంబోధిస్తాం. అంటే, ఆమె ‘ముఖం శరత్కాల పౌర్ణమినాటి వెన్నెలలాగా’ ప్రకాశిస్తున్నదని భావన. చంద్రకాంతిలో వేడి ఉండదు. ప్రసన్నమైన చల్లని వెలుగు మాత్రమే ఉంటుంది. లలితాదేవిని ‘రమా రాకేందు వదనా’ అనీ వేడుకొంటాం. ‘రమా’ అంటే ‘లక్ష్మీ స్వరూపురాలు’, ‘రాకేందు వదనా’ అంటే ‘పౌర్ణమి చంద్రునివంటి ముఖం కలిగింది’ అనర్థం. లలితా సహస్రనామాలలో ‘చంద్రవిద్యా’, ‘చంద్రమండల మధ్య’గా కొలుస్తాం. చంద్రుడు ఆరాధించిన మంత్రరూపిణియైన లలితాదేవియే ‘చంద్రవిద్య’. చంద్రమండలమైన ‘శ్రీచక్రం మధ్య’లో ‘చిద్రూపిణి’గా భాసించేది లలితామాత. ఆమెనే ‘చంద్రమండల మధ్య’గా ఆరాధిస్తాం. చంద్రుడు షోడష (పదహారు) కళాప్రపూర్ణుడు. అమృత, మానద, పూష, తుష్టి, సృష్టి లేదా పుష్ఠి (సృష్టి/ పుష్ఠి రెండిటినీ చెపుతారు. పోషణ శక్తివల్ల పుష్ఠి, సృష్టికి మూలం కనుక సృష్టి), రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. ఈ 16 కళలు చంద్రునిలో భాసిస్తుంటాయి. 

‘పూర్ణామృత కళ’గా అమ్మ చంద్రమండలం మధ్యలో నిలిచి అన్ని కళలకూ జీవాన్ని ఇస్తుంది.

‘శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం’ (సౌందర్యలహరి) అని ఆదిశంకరులు అమ్మవారిని స్తుతించారు. శరత్కాలంలోని శుద్ధమైన, నిర్మలమైన, పరిపూర్ణమైన వెన్నెల వంటి ముఖాన్ని, ‘చంద్రరేఖ సహిత కేశపాశాన్ని కిరీటంగా కలిగిన మూర్తి’గా శంకరులు అమ్మవారిని దర్శించారు. ‘శరత్‌' అంటే స్వఛ్చత, ప్రసన్నత, పరిపూర్ణత్వం, ప్రసాద, ఆనంద భావనలు. ఇవన్నీ అమ్మవారి ముఖంపై దర్శనమిస్తుంటాయి. ఆ భావనలు ప్రతిబింబించడం వల్ల అమ్మ ముఖం అద్భుత సౌందర్యవంతంగా, తేజోవంతంగా భాసిస్తుంది. ముఖం మనస్సుకు దర్పణం. దీనినిబట్టి, ఆ తల్లి మనసును అర్థం చేసుకోవచ్చు. ప్రసన్న హృదయం, దరహాస వదనంతో కనిపించే అమ్మ తలపై చంద్రరేఖ ఉంటుంది. 

అదే, చంద్రరేఖ శివుని తలపైనా ఉంటుంది. అంటే, ‘ఇరువురికీ అభేదం’ అని చెపుతూనే, ఆదిదంపతులకు శిరోభూషణంగా భాసించే ఆ చంద్రుడి ఆరాధన సాధకులకు అనూహ్య ఫలితాలను ఇస్తుంది. పార్వతివల్ల సౌభాగ్యమూ, శివునివల్ల అఖండమైన, అనంతమైన ఆనందమూ లభిస్తాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.

కుండలినీ శక్తికి గొప్ప ఉత్ప్రేరకం

ఆశ్వీయుజ పౌర్ణమిని వివిధ ప్రాంతాలలో కోజాగర పౌర్ణమి, కుమార పౌర్ణమి, చంద్రాది పూజ, కౌముదీ ఉత్సవంగా జరుపుకుంటారు. ‘బాలేందు రేఖ దోచిన లాలితయగు అపరదిక్కు లాగున‘ అంటాడు పోతన రుక్మిణీదేవిని వర్ణిస్తూ ‘భాగవతం’లో.  ‘బాలచంద్రుని స్పర్శతో ఉత్థానమైన కుండలినీ శక్తివలె ఉన్నదని’ డా॥ వారణాసి వీరనారాయణ శర్మ (’అపరాజిత’) అన్నారు. దీనినిబట్టి, ‘చంద్రకాంతులు సోకటంతో కుండలినీ శక్తి అమృతమయమై సహస్రారాన్ని చేరే ప్రస్థానానికి సిద్ధమైంది’ అన్నది వారి భావన. మూలాధారంలోని అసురీశక్తుల నుండి వెన్నెలలు విముక్తిని కలిగిస్తాయి. ‘మూలాధార స్వాధిష్టాన చక్రాలలో తమోగుణం, మణిపూరంలో రజోగుణం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలలో సాత్విక గుణం ప్రవృత్తులు సంచరిస్తూ ఉంటాయి’ (డా॥ వేదుల సూర్యనారాయణశర్మ, ‘అంతరార్థ రామాయణం’: పేజీ- 33). లలితాదేవిని అర్చించడం వల్ల మూలాధారంలో ఉత్థానమై వుండే కుండలినీ శక్తి సహస్రారాన్ని చేరి, త్రిగుణాతీతమైన స్థితిని పొందుతుంది. శరత్కాల పౌర్ణమినాటి చంద్రకాంతులు దీనికి  గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి.logo