సోమవారం 26 అక్టోబర్ 2020
Devotional - Sep 28, 2020 , 00:46:55

అధిక ప్రాధాన్యం స్త్రీలకేనా?

అధిక ప్రాధాన్యం స్త్రీలకేనా?

మన సనాతన ధర్మంలో పూజలు, నోముల విషయంలో పురుషులకంటే ఎక్కువ ప్రాధాన్యం స్త్రీలకే ఇచ్చారు. ఎందుకుని? - డి. రామ్‌గోపాల్‌, మల్లాపూర్‌,  హైదరాబాద్‌

‘వ్రత్యతే అన్నాదిక ఇతి వ్రతం.’ అంటే అన్నం తినడం, మొదలైన పనులను విడిచి చేసేదే వ్రతం. తమ కుటుంబానికి మేలూ, లాభమూ జరగాలని కోరుకొని చేసేవే వ్రతాలూ, పూజలూ, నోములూ అనేవి. ‘నన్ను-ఓము’ అంటే ‘ఓ దైవమా! నన్ను రక్షించు’ అని వేడుకొంటూ చేసేదే నోము.          ‘నన్నోము’ అనేదే క్రమంగా ‘నోము’గా మారింది.

వివాహంలో భాగంగా  పెండ్లి కూతురే పెండ్లికి ముందుగా గౌరీపూజ చేస్తుంది. పెండ్లినాటి నుండే ఆమెకు ఆ ఏకాగ్రత అలవడుతుంది. ఏకాగ్రతలోనూ, భక్తిశ్రద్ధలలోనూ, కుటుంబ సంక్షేమం కోసం ఆధ్యాత్మికంగా పాటుపడటంలోనూ పురుషునికంటే ముందుండే స్త్రీకే పూజలలోనూ, నోములలోనూ అధిక ప్రాధాన్యం కల్పించబడింది. ఆమెకు ఉండే సహనం అనేది అందుకు అదనంగా తోడైంది.

భర్త తోడుగా లేకున్నా స్త్రీలు వ్రతాలను చేసుకోవచ్చు. అలాంటి స్త్రీల వ్రతాలు సుమారు 108 వరకూ ఉన్నాయి. ఇంటి పట్టునే ఉండే  స్త్రీలు తమంత తాముగా ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాధాన్యతా నియమం అనేది ఒక ఒరవడిగా మారడానికి వారు స్వతంత్రంగా చేసే ఈ వ్రతాలు కూడా ఒక కారణమై ఉండవచ్చు. స్త్రీ తాను చేసే వ్రతాలన్నిటినీ తన భర్త క్షేమాన్ని కోరే చేస్తుంది. తన క్షేమమూ, తన కుటుంబం క్షేమం కూడా అందులో అంతర్లీనంగా ఉండటమనేది అందులోని పరమార్థం.

సహధర్మచారిణి లేకుండా యజ్జాలనూ, వ్రతాలనూ చేసే అధికారం పురుషునికి లేదనేది శాస్త్ర ప్రమాణం. అందుకే, శ్రీరాముడు స్వర్ణసీతను తోడుగా చేసుకొని అశ్వమేధయాగం చేశాడు. వ్యక్తి ప్రవర్తననూ సమాజం కట్టుబాట్లనూ స్మృతులూ, శ్రుతులూ చెప్పినట్లుగా నియంత్రించేదే సనాతన ధర్మం. ధర్మ నిర్దేశాన్ని ధిక్కరించడానికి లేదు. పూజలలో వ్రతాలలో స్త్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే నియమాన్ని ‘సనాతన ధర్మం’ నిర్దేశించలేదు. అది కేవలం ఐచ్ఛికమే. తమ తమ ఇష్టాలనుబట్టే ఇది పాటింపబడుతుంది.logo