గురువారం 29 అక్టోబర్ 2020
Devotional - Sep 28, 2020 , 00:47:31

పత్రం పుష్పం పవిత్ర మనసు!

పత్రం పుష్పం పవిత్ర మనసు!

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి

తదహం భక్త్యుపహృతమ్‌ అశ్నామి ప్రయతాత్మనః॥

- భగవద్గీత (9వ అధ్యాయం: రాజవిద్యా యోగం, 26వ శ్లోకం)

‘నిర్మలమైన మనస్సుతో భక్తుడు సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, జలం నాకు అత్యంత ప్రీతికరమైనవి’. ఇవి ఉన్నా, లేకున్నా ప్రత్యేకించి భగవదారా ధనకు ‘పవిత్రమైన మనసు’ ప్రధానం. ఆఖరికి ‘అన్ని విధాలైన పత్ర పుష్పాలు లభించనప్పుడు మరే అనుకూలమైన, నిషిద్ధం కాని పుష్పాలతోనైనా పూజించ వచ్చు’ అని ‘తత్వసాగర సంహిత’ పేర్కొన్నది. అయితే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం కచ్చితమైన నియమాలను విధిగా పాటించాలి. ఏయే దేవతకు ఏయే పుష్పం, పత్రం నిషేధమో శాస్ర్తాలు చాలా స్పష్టంగా పేర్కొన్నాయి. తమల పత్రాలతో పూజ సరస్వతికి, మొగలి-కొడిశె పుష్పారాధన శివునికి నిషేధం. భైరవునికి జిల్లేడు, ఉమ్మెత్త నిషేధాలు. దుర్గాదేవికి గరికపూజ పనికిరాదు. అలాగే, జిల్లేడు, గన్నేరు పుష్పాలు శ్రీదేవికి నిషేధమనీ శాస్ర్తాలు చెబుతున్నాయి.

నిత్యమల్లి, ఎర్రగన్నేరు, మంకెనపూలు, పారిజాతాలు, కనకాంబరాలు, మందా రం, నందివర్ధనం, కలువపూలు, చేమంతి లాంటి కొన్ని పుష్పాలు సర్వదేవతా ర్చనకు పవిత్రం. ఇవిగాక ఒక్కో దేవతను ఆరాధించడానికి ఒక్కో విధమైన పత్ర-పుష్పాలు విహితమైనవిగా ఉన్నాయి. విఘ్నేశ్వరునికి ఒక్క తులసి తప్ప అన్ని రకాల పత్రాలూ ఇష్టమే. తెల్ల జిల్లేడు పూలు, గరిక అన్నిటికన్నా ఆయనకు అత్యంత ప్రీతికరం. తులసిదళాలు కూడా ‘వినాయక చతుర్థి’ పండుగ రోజు ఉపయోగించవచ్చు. అదే దేవీపూజకు అర్క (జిల్లేడు) నిషిద్ధమని ‘భవిష్య పురాణం’ పేర్కొన్నది. శివునికి పనికివచ్చే పూలన్నీ దేవీపూజకూ అనుకూలమే. ప్రత్యేకించి ఎరుపు, తెలుపు రంగుల పుష్పాలన్నిటితో సహా ఉత్తరేణి పత్రం శివపార్వతుల ఆరాధనకు ఎంతో ప్రీతికరం. గాయత్రీదేవి కృపకు పాత్రులం కావాలంటే మల్లిక, మందార, కదంబ, చంపక, గరికతో ఆరాధన శ్రేష్ఠమని శాస్ర్తాలు చెప్పాయి. శ్రీచక్రాన్ని ఆరాధించేవారు తామర, తులసిదళాలు, మల్లె, గులాబీలు, జాజి, గన్నేరు పుష్పాలతో అర్చిస్తే అమ్మ దయను సులువుగా పొంద వచ్చు. ‘శివతత్త్వ సారం’ ప్రకారం ఒక్క మొగలిపూవు తప్ప, సాధారణంగా విష్ణుపూజకు అనుకూలమైన అన్ని పత్ర పుష్పాలూ శివునికీ విహితాలే. గన్నేరు, మందారం, గులాబీ, కలువ లాంటి అనేక పుష్పాలు, జమ్మి, జిల్లేడు, తులసి, బిల్వం మొదలైన పత్రాలు శివపూజకు అత్యంత శ్రేష్ఠం. మొల్ల, అడవి మొల్ల, దానిమ్మ, ముండ్లు కలిగిన పత్రాలు శివార్చనకు పనికిరావు. ‘భవిష్య పురాణం’లో చెప్పినట్టు నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో పుష్పం ప్రీతికరం. పద్మం గురువునకు, మొల్లపూవు రాహువుకు, జాజిపుష్పాలు శుక్రునికి.. అలాగే, బుధునికి సంపెంగ ఇష్టమైనవి.

‘విష్ణు పురాణం’లో వివరించినట్టు తెల్లని సన్నజాజులు, గులాబీ, గన్నేరు, సంపెంగ మొదలైనవి విష్ణువార్చనకు అత్యంత శుభకరం.‘స్కంద పురాణం’ ప్రకారం విష్ణుపూజలో తులసిదళాలతో చేసే సేవ అన్నిరకాల సుగంధ పుష్పాల కన్నా, ఎన్నో ఆభరణాలకన్నా అత్యంత శ్రేయస్కరం. జిల్లేడు, ఉమ్మెత్త, వెలగ, ఎర్రకాంచనం శ్రీమన్నారాయణునికి నిషిద్ధాలుగా శాస్ర్తాలు చెప్పాయి. మానవుడు ఎన్నిరకాల పుష్పాలు, పత్రాలు, ఫలాలతో దేవతార్చనలు చేసినా నిర్మలమైన మనసు, నిష్కల్మషమైన ఆలోచన, నిష్కామమైన క్రియ, సేవాభావం తప్పనిసరి. పవిత్రమైన మనసుతో చేసే పూజలు మాత్రమే సత్వర ఫలితాన్ని అందించి, లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి. ధర్మబద్ధమైన సంపాదనతో, కపటం లేని బుద్ధి, విద్వేషం లేని సౌభ్రాతృత్వంతో కూడిన దైవ ఆరాధనలు సర్వసుఖాలను, సకల శుభాలను అందిస్తాయి.