శనివారం 31 అక్టోబర్ 2020
Devotional - Sep 26, 2020 , 00:04:08

మూడు ముళ్లు - ఏడడుగులు!

మూడు ముళ్లు - ఏడడుగులు!

స్త్రీ పురుషులు శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా, సమాజబద్ధంగా దంపతులై సాంసారిక జీవితాన్ని కొనసాగిస్తూ, ధర్మార్థ కామమోక్షాల సాధన దిశగా వీలు కలిగించే ప్రక్రియ ‘వివాహ ప్రక్రియ’. వివాహబంధంతో స్త్రీ పురుషులు ఇరువురి మధ్య సదవగాహన ఏర్పడి, ఆరోగ్యకరమైన దాంపత్య జీవనం కొనసాగి, జీవితాలకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఫలప్రదమైన సంతాన రూపంలో వంశం ‘మూడు పూవులు ఆరుకాయలు’గా శోభిస్తుంది. వేదమంత్రాల మధ్య మంగళ సూత్రంతో మూడు ముళ్లు వేసి, ఆ తర్వాత ఏడడుగులు నడిచి ‘నవ దంపతులు’ అవుతారు. జీలకర్ర, బెల్లం మధ్య విడదీయరాని బంధం వివాహ బంధానికి ప్రతీక.

మూడు ముళ్లలో మొదటి రెండు ముళ్లు గట్టిగా, మూడో ముడి వదులుగా వేస్తారు. మొదటి ముడి రెండు శరీరాలను, రెండవ ముడి రెండు మనసుల్ని గట్టిగా బంధించి వేస్తే, మూడవ ముడి వానప్రస్థం తర్వాత మోక్షప్రాప్తి కోసం వదులుగా ఉంటుంది. ‘మనో వాక్కాయ కర్మల’ సాక్షిగా మూడు ముళ్లు వేస్తారు. ‘త్రికరణ శుద్ధి’గా దాంపత్యం నెరపమని పెద్దలు ఆశీస్సులు అందిస్తూ వివాహ క్రతువు నిర్వహిస్తారు. క్షయం, స్థాపనం, వృద్ధి అనే ఈ మూడు అంశాలకూ మూడు ముళ్లు నిదర్శనం. వివాహ బంధంతో బ్రహ్మచర్యం క్షయిస్తుంది. గృహస్త జీవితం స్థాపితమవుతుంది. ఫలితం ఏమిటంటే, సంతానాభివృద్ధి. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ పటిష్ఠమై వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహ సమయంలో కన్యాదాత ‘ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి’ అంటూ వరునితో చేయించే ప్రతిజ్ఞలు కూడా మూడే కనుక, మూడు ముళ్ల బంధం ముచ్చటైన బంధం! ఈ మూడు ముళ్ల బంధం ‘ముళ్ల బంధం’ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దంపతులదే.

తన్మయత్వం కలిగించే తలంబ్రాల కార్యక్రమం తర్వాత పరమ పావనమైన అగ్నిహోత్రుని సాక్షిగా పాణిగ్రహణం చేసిన వరుడు, వధువుతో ఏడడుగులు వేయిస్తాడు. అదే ఏడడుగుల బంధం! అలా ఏడడుగులు నడిచాక, వధువు గోత్రం వరుని గోత్రమవుతుంది. అలా ఏడడుగులు నడిస్తే, వధువు ఇంటిపేరు వరుని ఇంటిపేరవుతుంది. అందుకే, ఇది సప్తపది!! మొదటి అడుగు ఇష్టం కోసం, రెండవది బలం కోసం, మూడవ అడుగు వ్రతం కోసం, నాల్గవది సౌఖ్యం కోసం, ఐదవ అడుగు ఇంద్రియ పుష్టికై, ఆరవది ఋతువుల కోసం, ఏడవ అడుగు గృహస్థాశ్రమ హోమ యజ్ఞాల కోసం.. హోతలను అనుగ్రహిస్తూండాలని ఆ సర్వాంతర్యామిని అర్థిస్తూ, వరుడు వధువును ఏడడుగులతో అనుసరిస్తాడు. మూడు ముళ్లూ- ఏడడుగులతో ఏర్పడిన బంధం ఏడేడు జన్మల బంధంలా మారి ‘నవ దంపతులు’ ఆదర్శ గార్హస్థ్య జీవితం గడపాలన్నదే మహర్షుల ఆశంస.. ఆర్యుల ఆకాంక్ష.. పెద్దల ఆశీర్వాదం కూడా.