మంగళవారం 27 అక్టోబర్ 2020
Devotional - Sep 22, 2020 , 01:56:33

ప్రాణ శక్తికి మూలాధారం!

ప్రాణ శక్తికి మూలాధారం!

నేటితరం వారు ‘అనాహత’, ‘ఆజ్ఞ’, ‘సహస్రార’ చక్రాల గురించే ఎక్కువగా మాట్లాడతారు. కానీ, కిందనున్న ‘మూలాధార’ చక్రం ప్రాధాన్యాన్ని పట్టించుకోరు. పిండరూపాన్ని సంతరించుకున్న మానవ దేహాన్ని గమనిస్తే, అదో ‘అతిచిన్న మాంసం ముద్ద’గానే ఉంటుంది. అదే క్రమేపీ ఇంతటి రూపాన్ని తనంతట తానే సంతరించుకుంటుం ది. ఈ విధంగా రూపుదిద్దుకునేలా చేయడానికి అందుకో ప్రత్యేకమైన ‘సాప్ట్‌వేర్‌' ఉంది. దాన్నే ‘ప్రాణమయ కోశం’ (శక్తిమయ శరీరం) అంటారు. ఈ ‘శక్తి శరీరమే’ మొట్టమొదట స్వయంగా ఆవిర్భావమవుతుంది. తర్వాత దానిపైన ఈ ‘భౌతిక శరీరం’ రూపుదిద్దుకుంటుంది. ఒకవేళ ఈ ‘ప్రాణమయ కోశం’లో ఏవైనా లోపాలు, హెచ్చుతగ్గులు ఉన్నట్టయితే ఆ ప్రభావం ‘భౌతిక శరీరం’పైనా పడుతుంది. మన సంస్కృతిలో ఓ సంప్రదాయం ఉంది. ఎవరైనా అమ్మాయి గర్భవతి కాగానే నిత్యం గుడికి వెళ్లేది. అక్కడ ‘దైవ దర్శనం’ చేసుకొని ‘ప్రాణమయ కోశాన్ని’ ప్రభావితం చేయగిలిగిన శక్తి సంపన్నులైన (తపోనిష్ఠ)గల పెద్దల ఆశీర్వాదాలు తీసుకొనేది. ఎందుకంటే, చక్కటి స్పందన గల ‘శక్తిమయ శరీరం’ ఉంటేనే, ఎంతో సమర్థతగల బిడ్డలకు మహిళలు జన్మనివ్వగలుగుతారు.

‘మూలాధారమే’ ఈ ‘శక్తిమయ శరీరానికి’ మూలం (పునాది). ఇప్పటివారికి ‘మూలాధారం’ అన్నిటికన్నా దిగువనగల చక్రమని, అది పట్టించుకోవలసినంత గొప్పదేమీ కాదనే భావన ఉంది. ‘పునాది’ ఎంతో ప్రధానమైంది. అలాగే, ‘మూలాధారం’ కూడా. మనం యోగాభ్యాసం చేసేటప్పుడు అన్నిటికీ మించి ‘మూలాధారం’ మీదే దృష్టినంతా కేంద్రీకరించాలి. ఎందుకంటే, ఇక్కడ స్థిరత్వం సాధించగలిగితే, మిగిలిన దాన్నంతా సృష్టించడం చాలా సులభం. మనం దైవకృపకు పాత్రులం కావాలంటే, అందుకు తగిన ‘శరీరం’ ఉండాలి. అలా కాక తగిన శరీరం లేకుండా, మనమీద అఖండంగా అనుగ్రహం వర్షిస్తే, ఏ మాత్రం తట్టుకోలేం. శరీరం విలవిల్లాడిపోతుంది. చాలామంది తమకు పెద్ద (ఆధ్యాత్మిక) అనుభవాలు కావాలనుకుంటారు. కానీ, వాటిని సాధించడానికి తగినరీతిలో తమ దేహాలను సిద్ధం చేయడానికి మాత్రం సుతరామూ అంగీకరించరు. కేవలం, ఆధ్యాత్మిక అనుభవాలు కావాలంటూ వాటికోసం వెంపర్లాడుతూ సాధనలు చేయడం వల్ల చాలామంది ఇప్పటికే మతులు పోగొట్టుకున్నారు. దేహాలను ఛిన్నాభిన్నం చేసుకున్నారు. యోగ క్రియలో మనం అనుభవాల కోసం వెంపర్లాడేది ఏదీ ఉండదు. కేవలం సంసిద్ధులమవుతాం, అంతే. ‘ఆదియోగి’ ప్రథమ శిష్యులైన సప్తర్షులే ఇందుకు గొప్ప ఉదాహరణ. వారు ఏకంగా 84 ఏండ్ల పాటు అలా సంసిద్ధులవుతూనే వచ్చారు. వారు పూర్తిగా సంసిద్ధులుగా ఉన్నారనే విషయాన్ని గమనించిన తర్వాతే ఆదియోగి, ఇక తను ఏదీ దాచి పెట్టుకోలేదు. సర్వాన్నీ వారికి ఇవ్వక తప్పలేదు. కానీ, ఇప్పటి ప్రపంచం మాత్రం ఇందుకు విరుద్ధంగా తయారైంది. 

‘సద్గురూ! నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించరూ?’ అంటారు చాలామంది. కానీ, అసలు విషయం గ్రహించరు. మన యోగా వ్యవస్థలన్నీ నిరంతరం ‘మూలాధారం’ మీదే కేంద్రీకృతమవుతాయి. కానీ, ఇటీవలి కాలంలో ఏ మాత్రం అనుభవం లేనివారు పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాస్తున్నారు. ‘మూలాధారంపై కాకుండా, ఊర్ధ్వ చక్రాలపైనే అధికంగా ధ్యానం నిలుపాలని’ బోధనలు చేస్తున్నారు. కానీ, జీవితం ఆ విధంగా నడవదు. కొనేండ్ల కిందట నేను రెండు, మూడు రోజుల ‘హఠ యోగ’ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేవాడిని. కేవలం ఆసనాలు వేస్తున్న దశలోనే సాధకులు ‘పారవశ్య స్థితి’లోకి వెళ్లేవారు. తమ పరిమితులను అధిగమించడానికి చాలామంది యోగులు అతి సామాన్యమైన భంగిమలనే ఆశ్రయిస్తారు. ‘హఠయోగం’ ఇలాంటిదే. ‘హఠయోగం’ అంటే ‘నిలకడగా ఉండ టం’. జీవితం ఉల్లాసంగా, అతిశయించిన స్థితిలో సాగాలంటే ఎంతో కొంత ‘పిచ్చి’ అవసరమే. కానీ, అది ఓ నిర్బంధమైతే, జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అది నియంత్రణలో ఉన్నంతకాలం అద్భుతాలు చేయగలం.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌


logo