మంగళవారం 27 అక్టోబర్ 2020
Devotional - Sep 21, 2020 , 01:13:09

రామచిలుక భక్తిమార్గం!

రామచిలుక భక్తిమార్గం!

ఈ సృష్టిలో రకరకాల పక్షి జాతులు ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిది. ఏ పక్షికీ లేని విలక్షణ భక్తిచరిత్ర రామచిలుకది. చిలుకకు ముందు ‘రామ’ అని చేర్చడంతో దాని జీవితం ధన్యమైంది. పూర్వం ఒక చిలుక తన అంతిమ ఘడియలో ‘రామనామం’ ఉచ్చరించి విముక్తి పొందిన వైనం అపురూపం. అది ‘జీవంతి’ అనే ఒక వేశ్య దగ్గర ఉండేది. ఆమె వినోదం కోసమో, కాలక్షేపానికో దానిని ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. చక్కటి మాటలు, పాటలు నేర్పింది. ఆ చిన్ని చిలుక ముద్దుముద్దుగా, మధురంగా మాట్లాడుతుంటే  రోజంతా వింటూ ఆమె ఆనందించేది. అలా వారిద్దరికీ సమయమే తెలిసేది కాదు. ఈ క్రమంలోనే చిలుకకు ‘రామ..రామ’ మాటలుకూడా నేర్పింది. ‘శ్రీ రామ’ అనమంటే  చక్కగా పలికేది. ‘జీవంతి-చిలుక’ ఎంతో ప్రేమగా ఉండేవి. ‘రామ’ అని పిలువగానే రెక్కలు విప్పుకుంటూ ‘జీవంతి’ భుజంపై వాలేది. 

ఓ రోజు ‘రామ’ అని పిలువగా చిలుక రివ్వున వచ్చి ‘జీవంతి’ మణికట్టుపై వాలింది. ప్రేమగా చిలుకను నిమురుతూ, ‘మనిద్దరికీ వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రేపో, మాపో.. నువ్వు ముందో, నేను ముందో..’ అంది. ఆ మాటకు చిలుక చిన్నగా నవ్వి, ‘వెనుకా ముందు ఎందుకూ, ఇద్దరం కలిసే ప్రాణాలు విడుద్దాం. కలిసే ‘రామ..రామ’ అందాం’ అని శ్రీరామ రాగాలాపనతోనే ప్రాణాలు విడిచారు. జీవంతి, చిలుక ‘రామ..రామ’ అని మరణించడంతోనే ‘యమదూతలు’ వచ్చారు. అదే సమయంలో విష్ణుదూతలూ వచ్చారు. అక్కడ ఇద్దరు దూతలకు వాదోపవాదాలు జరిగాయి. యమదూతలు ‘ఆమె పాపి’ అంటే, విష్ణుదూతలు ‘కాదు, ఈమె పుణ్యవతి’ అన్నారు. ఆ వాదన చివరకు యుద్ధానికి దారి తీసింది. విష్ణుదూతలతో తీవ్రంగా గాయపడిన యమదూతలు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. యముడు నవ్వి అన్నాడిలా..

దూతా, యది స్మ రాంతౌ లౌ 

రామనామక్షర ద్వయమ్‌

తదాన మే దండనీ యౌ 

తమోర్నరాయణః ప్రభుః॥

- దాశరథి శతకం (మానసోల్లాస వ్యాఖ్య)

“దూతలారా! వారు మరణించే సమయంలో ‘రామ’ అని పలికారు. ‘రామ’నామం సకల పాపహరణం. మనం వారికి శిక్షలు విధించే వారం కాదు. వారికి సర్వం శ్రీ మన్నారాయునుడే. కనుక, వేశ్యతోపాటు ఆమె పెంపుడు చిలుకా వైకుంఠం చేరడానికి సర్వదా అర్హులు”.

ఎంతటి పాపి అయినా అవసాన దశలో ‘రామ నామ’ స్మరణ చేయగానే మోక్షం పొందుతాడు. ‘రామనామం’ అంతటి పరమ పవిత్రం. సమస్త అమంగళాలను అణచి వేసి, మన మనోభీష్టాలను నెరవేర్చి, అంతిమంగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ‘రామ నామోచ్చారణ’వల్ల చేసిన పాపాలన్నీ తొలగుతాయన్నది ప్రామాణిక సూత్రం. ఈ నమ్మకానికి  జీవంతి, రామచిలుకల ఉదంతమే చక్కని నిదర్శనం. అలా శ్రీ రాముడిని స్మరించిన ‘రామచిలుక’ జీవితం ధన్యమైంది. ఎక్కడ ‘రామ’నామం వినపడుతుందో అక్కడ ఏ భయాలూ ఉండవు. ‘శ్రీరామ జయరామ, జయజయ రామ’ అనే మధుర గానామృతం మనిషిలోని మానసిక రుగ్మతలను సైతం తొలగిస్తుంది. ఒక విధంగా ఇది ‘సర్వరోగ నివారిణి’. మనలోని ధైర్యానికి, సామర్థ్యానికి ప్రతీక. అందుకే, కాబోలు హనుమంతుడు స్వామిని తన హృదయంలోనే నిలుపుకొన్నాడు. మన పూర్వీకులు ఏ పని ప్రారంభించినా ముందు ‘శ్రీరామ జయం’ అని మొదలు పెట్టేవారు. ఆ చిన్ని పక్షులు ‘రామచిలుకలు’ కావడం వెనుక వున్న కథ ఇదీ.

కనుమ ఎల్లారెడ్డి

93915 23027


logo