మంగళవారం 27 అక్టోబర్ 2020
Devotional - Sep 21, 2020 , 00:12:42

మృత్యుంజయ రహస్యం

మృత్యుంజయ రహస్యం

  • మరణ భయాన్ని పోగొట్టి, అమృతత్వ సిద్ధిని ప్రసాదించే దివ్యమైన మార్గం

మానవులను నిరంతరం వేధించేది ‘మరణ భయం’. నిజానికి మనిషికి మరణం ‘బాధాకరం’ కానేకాదు. మరణించే వ్యక్తికి బాధ ఉండదు. కానీ, వారి ఆప్తులకు బాధ ఉంటుంది. బుద్ధి తెలిసినప్పటి నుండి మనుషులు (ప్రాణులు) నిరంతరం మృత్యుభీతితోనే జీవిస్తుంటారు. దీనిని పోగొట్టే అద్భుత చిట్కా‘మహామృత్యుంజయ మంత్రం’లో వున్నది. దీనిని తెలుసుకొని ఉపాసించిన వారికే ఆ దివ్య ఫలితం లభిస్తుంది.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ

తస్మాదపరిహార్యే ర్థే నత్వం శోచితు మర్హసి ॥

- భగవద్గీత (2-27)

‘జనన-మరణాలు విడదీయరాని జంట’ అని భగవద్గీత చెబుతున్నది. ‘పుట్టుక’ అనేది ఉన్నదంటే, దాన్ని వెన్నంటి మృత్యువుకూడా తప్పక ఉంటుంది. ఎప్పటికైనా రెండూ కలిసి ఉండేవే. ఈ రెండూ లేకుండా పోవడాన్నే ‘అమృతత్వ సిద్ధి’ అంటాం. మృత్యువు నుండి విముక్తితోపాటు అమృతత్వాన్ని కూడా ప్రసాదించేది ‘మహామృత్యుంజయ మంత్రం’.

‘ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్‌ 

ఉర్వారుకమివ బంధనా న్మృత్యో ర్ముక్షీయః మా మృతాత్‌ ॥. 

మానవాళికి మృత్యువును దూరం చేసే గొప్ప వైదిక మంత్రం ఇది. ‘జన్మ-మృత్యు జరారోగాల’ నివారణే ప్రయోజనంగా ఈ‘మహామృత్యుంజయ మంత్రం’ ప్రసిద్ధినొందింది. మరి, ‘అవి లేకుండా ఉండాలంటే, ఏం జరుగాలె?’. ఉపనిషత్తులు, భగవద్గీత, సమస్త వేదాంత శాస్త్రం చెప్పే అద్భుత రహస్యం ఈ ప్రశ్నలోని సమాధానమే. 

పరమశివునికి చాలా ఇష్టమైన మంత్రంగానూ దీన్ని జపిస్తారు. ‘జన్మతోను, వయసు పైడిన తరువాతా వచ్చే రోగాలతోపాటు మృత్యుభయాన్ని కూడా పారదోలే అద్భుత మంత్రమిది’ అని ‘శాంతి కమలాకర’ గ్రంథం (రచయిత: కమలాకర భట్టు) పేర్కొంటున్నది. పరమశివునికి అభిషేక సమయంలో ఉపయోగించే రుద్రాధ్యాయ మంత్ర పరంపరలో చివరగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని పఠించి, అభిషేకరం పూర్తి చేయడం మన సంప్రదాయం. ఈ మంత్రాన్ని దర్శించిన మహర్షి వశిష్ఠుడు. అనేక వేదమంత్రాల వలె ఇదికూడా వేదగాయత్రీ ఛందస్సులో నాలుగు పాదాలతో ఉంటుంది. దీనిని ఎంత ఎక్కువగా జపిస్తే ఫలితం అంత అధికంగా ఉంటుంది. 


మానవులను నిరంతరం వేధించేది ‘మరణ భయం’. నిజానికి మరణం ‘బాధాకరం’ కానేకాదు. మరణించే వ్యక్తికి బాధ ఉండదు. కానీ, వారి ఆప్తులకు బాధ ఉంటుంది. బుద్ధి తెలిసినప్పటి నుండి మనుషులు (ప్రాణులు) నిరంతరం మరణ భయంతోనే జీవిస్తారు. ‘దీనిని పోగొట్టమని’ పై మంత్రంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. ఇది లభించే కిటుకు కూడా నిజానికి అందులోనే ఉన్నది. ‘దోసపండు తీగబంధం నుండి వీడినట్లు’ సుకరంగా ‘ప్రాణోత్క్రమణం’ (ప్రాణం పోవడం) ప్రసాదించమనే వేడుకోలు అది. ‘బంధనాత్‌' అనేమాట ‘సంసార బంధనాన్ని’ తెలియజేస్తుంది. ‘సంసార బంధం’ నుండి విముక్తమైతేనే ఈ ‘దేహబంధం’ సుకరంగా వీడిపోతుంది. కనుక, మరణ భయంలో నిజంగా ఉన్నది ‘సంసారబంధ భయం’. దీన్ని తొలగించుకోవాలన్న మాట. సంసారమంటేనే జన్మ పరంపర. దీనికి కర్మతోనే సంబంధం. ఈ ‘కర్మ సంబంధం’ తొలగితే ‘సంసార సంబంధం’ తనంతట తాను వెళ్లిపోతుంది. ‘సంసారబంధం’ పోతే లభించేది ‘మోక్షమే’. అదే ‘అమృతత్వసిద్ధి’. ఇది జ్ఞానంతో మాత్రమే తెలుసుకోదగ్గది. 

ఆత్మజ్ఞానమంటేనే బుద్ధిగమ్యం. బుద్ధితో జరిపే నిరంతర పర్యాలోచన ఫలితంగా ‘ఆత్మజ్ఞానం’ లభిస్తుంది. ‘తపస్సు’ అన్నా కూడా ఇదే. అందుకే, ‘తపసా బ్రహ్మ విజి జ్ఞాసస్వ’ అన్నది ‘తైత్తిరీయోపనిషత్తు’. ‘తపస్సుతో బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి’ అని ఈ ఉపనిషత్తు బోధిస్తున్నది. ‘బ్రహ్మవిత్‌ బ్రహ్మైన భవతి’. బ్రహ్మజ్ఞానమే ముక్తి. బ్రహ్మజ్ఞానియే బ్రహ్మం’ అన్నది ఇందులోని పరమార్థం. ‘మహామృత్యుంజయ’ మంత్రం ఈ రెండు కోర్కెలనూ తీరుస్తుంది. ‘ఓ పరమేశ్వరా! మృత్యువునుండి నాకు విముక్తిని ప్రసాదించు. అదికూడా దోసపండు తీగనుండి ఎంత సుకరంగా విడిపోతుందో అంత సుకరంగా సుమా’ అన్నది మొదటి ప్రార్థన. ఇక, రెండవ వేడుకోలు: ‘నేను అమృతత్వం నుండి దూరం కాకుండా ఉండాలె’ అన్నది. ‘ముక్షీయ మా మృతాత్‌'. అమృతత్వం ఆత్మ సహజస్థితి. మృత్యువు ఎక్కడ్నించో వచ్చి ఆత్మను అంటుకొంటుంది. తత్తవేత్తలు చెప్పేదికూడా ఇదే. కనుకే, ‘మృత్యువునుండి ముక్తినీ, అమృతత్వ స్థితినీ (రెంటినీ)’ ప్రసాదించమని వేడుకోవడం ఈ మహామృత్యుంజయ మంత్ర లక్ష్యం. 

ఆత్మకు కర్మబంధం తెచ్చి పెట్టుకొన్నదే కాని, స్వతస్సిద్ధంగా ఉన్నదికాదు. అది ఎలాంటిదంటే, అమితాసక్తితో కూడిన తన్మయాత్మక భావన. ఆత్మస్థితికూడా ఇలాంటిదే. ఆత్మ తాను శరీరంతో తాదాత్మ్యాన్ని కల్పించుకొని, తనకు లేని కర్మబంధాన్ని కొని తెచ్చుకొంటుంది. తద్వారా ‘సంసారచక్ర భ్రమణానికి’ లోనవుతుంది. తన స్వతస్సిద్ధమైన అమృతత్వానికి దూరమై, సంసారబంధ దుఃఖాన్ని కొనితెచ్చుకొంటుంది. ‘ఈ స్థితినుండి దూరం చెయ్యమనే’ మహా మృత్యుంజయ మంత్రం కోరుతుంది. సాధకులు ఈ పరమార్థాన్ని గ్రహించి ఆరాధించాలి. అప్పుడు అది ‘నిరంతర ధ్యాస’గా పరిణమిస్తుంది. ఫలితంగా, మృత్యువునుండి విముక్తిని, దానితోపాటే అమృతత్వ స్థితినీ ఈశ్వరశక్తి ప్రసాదిస్తుంది. ఇదే ‘జీవన్ముక్తి’. ఈ రకంగా, మనిషిలోని మరణ భయాన్ని తొలగించి, జీవన సార్థకతను ప్రసాదించే అద్భుత రహస్యం ఈ మంత్రంలో ఇమిడి ఉంది. 

ఆరోగ్యంతోపాటు ఐశ్వర్యం!

భగవదారాధన అన్నది జపం, తపస్సు, ధ్యానం ఇలా ఏ రూపంలోనైనా వుండవచ్చు. దేనికైనా ‘నిరంతర స్మరణ’ ముఖ్యం. పరమేశ్వరుడు అష్టమూర్తి. పంచభూతాలు (5), సూర్యచంద్రులు (2), యజ్ఞకర్త (1).. వీరు పరమేశ్వరుని అష్టమూర్తులు. వీరితోనే ఈశ్వరుడు జగద్రక్షణ చేస్తుంటాడు. ఈశ్వరుని మూడవకన్ను ‘జ్ఞాననేత్రం’. ‘త్రియంబకుడు’ (ముక్కంటి) అంటేనే మూడు కన్నులు కలవాడు. ‘మేం మూడు కన్నులున్న పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం’ అని మహా మృత్యుంజయ మంత్రం ద్వారా వేడుకొంటాం. ఇంతేకాదు, పరమేశ్వరుడు మంచిగంధం కలవాడేకాక పుష్టివర్ధనుడు కూడా. ‘గంధం’ అంటే ‘వాసన’. ‘గంధ అర్దనే’. ‘అర్దనం’ అంటే రక్షణ. అత్యంత సులభోపాయంగా భక్తులకు రక్షణ కల్పించేవాడు. ఇంతేకాదు, ‘ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్‌'. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవుడు కూడా. ‘మంచి ఆరోగ్యంతో కూడిన ఐశ్వర్యాన్ని’ పొందితేనే ఈ లోకంలో సుఖజీవనం సాధ్యమవుతుంది. అందుకే, మహామృత్యుంజయ మంత్రోపాసన.


logo