బుధవారం 28 అక్టోబర్ 2020
Devotional - Sep 21, 2020 , 00:12:42

జమదగ్నికి ముంగిస జన్మ!

జమదగ్నికి ముంగిస జన్మ!

పితృదేవతల శాపం

‘తన కోపమే తనకు శత్రువు’. అందుకే, చాలామంది కోప రహితులుగా వుండాలని అనుకొంటారు. కానీ, ‘పూర్తిగా కోప రహితులు కావడమూ నష్టదాయకమేనని’ వెల్లడించే కథ ఇది. పరశురాముడు తన తండ్రి జమదగ్నిలోని కోపాన్ని పూర్తిగా పోగొట్టాలనుకొంటాడు. కానీ, వారి పితృదేవతలు కథను మరో మలుపు తిప్పుతారు. ఏం జరిగిందో చదవండి:

పరశురాముని తల్లి రేణుక చేసిన చిన్న తప్పు (నదిలో జలకాలాడే రాజదంపతులకేసి ఆనందంగా చూడటం)కే తండ్రి జమదగ్నికి పట్టరాని కోపం వస్తుంది. వెంటనే ఆమె తలను నరికేయమని నలుగురు కొడుకులను ఆదేశిస్తాడు. వారు ‘మాతృహత్య మహాపాపమని’ తిరస్కరించడంతో, అయిదో కొడుకు పరశురాముడిని ఆదేశిస్తాడు. పరశురాముడు మారుమాట్లాడక తన గొడ్డలితో తల్లి తలను నరికేస్తాడు. ‘తన మాటను ధిక్కరించిన నలుగురు అన్నల తలలూ నరకమని’ జమదగ్ని ఆదేశించగానే పరశురాముడు వారి తలలూ నరికేస్తాడు. కోపం తగ్గిన తర్వాత జమదగ్ని కొడుకు పరశురాముణ్ణి ఏదైనా కోరిక కోరుకోమంటాడు. అప్పుడు, తన తల్లిని, అన్నలను బతికించమంటాడు. వారికి మహర్షి ప్రాణం పోస్తాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. పరశురామునికి మరో వరమియ్యాలనిపించింది జమదగ్నికి. ‘కోరుకో’మంటాడు. 

“తండ్రీ! నా చేతిలో హతమైన ఐదుగురినీ బతికింపచేశారు. మన కుటుంబంలోకి ఆనందం తిరిగి వచ్చింది. కానీ, కొద్ది తడవైనా సరే, ఈ కుటుంబంలో దుఃఖం తాండవించింది. ఆవేదన, ఆందోళన రాజ్యమేలాయి. మీ క్రోధమే దానికి కారణం. ఇక నుండి మీరు నా కోసం ఈ కోపాన్ని వదిలిపెట్టాలి. ఇది నా ప్రార్థన” అన్నాడు పరశురాముడు. “తథాస్తు” అన్నాడు తండ్రి. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకానొక రోజు వాళ్లింట్లో పితృకార్యం వచ్చింది. ఆ నిమిత్తం స్వయంగా ఆవు పాలు పితికి ఒక కొత్త కలశంలో భద్రపరిచాడు జమదగ్ని. ‘క్రోధ దేవత’ పొరపాటు అనిపించేలా, కావాలనే పాల కలశాన్ని తన్నింది. పాలు ఒలికి పోయాయి. విషయాన్ని గ్రహించికూడా మిన్నకుండి పోయాడు జమదగ్ని. క్రోధ దేవత జమదగ్ని వద్దకు వచ్చి, “భృగువంశం వారికి కోపం ముక్కుమీదే వుంటుంది. నువు ఇందుకు మినహాయింపుగా వున్నావు. మహర్షీ! నన్ను క్షమించు. క్షీరాన్ని నేనే ఒలకపోశాను” అన్నది. “విధి లిఖితాన్ని ఎవరూ తప్పింపలేరు. నువు మటుకు ఏం చేయగలవు. వెళ్లిపో” అన్నాడు జమదగ్ని. పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహించాడు జమదగ్ని. కాని, పాలు లేని లోటు అట్లే వుండిపోయింది. 

ఆ రాత్రి పితృదేవతలు జమదగ్నికి కలలో కనిపించారు. “క్రోధ దేవత కావాలని కాలితో తన్ని పాలను  వొలకపోసింది. నీవామెను క్షమించి వదిలేశావు. నీవామెను శపించి ఉండాల్సింది” పితృదేవతల గొంతులో కోపం ధ్వనించింది. “తాపసికి కోపం పనికిరాదన్న ఉద్దేశ్యంతో నేను క్రోధదేవతను శపించలేదు” అన్నాడు జమదగ్ని. “కోపగించవలసిన చోట కోపానికి రాకపోవడమూ దోషమే. ‘యాదేవీ సర్వభూతేషు క్రోధరూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః’ అన్న దేవీస్తుతిని వినలేదా? క్రోధం స్వయంగా జగన్మాత స్వరూపం. చెడును శిక్షించేందుకు కోపం అనివార్యం” అన్నారు పితృదేవతలు. “కోపం రాకపోవడం దోషమంటారా?” అడిగాడు జమదగ్ని. “నిస్సందేహంగా. దౌష్ట్యాన్ని రూపుమాపడానికి, నేరస్తుణ్ణి శిక్షించడానికి క్రోధాన్ని ఉపయోగించాలి. దోషిని సంస్కరించడానికి కోపాన్ని వినియోగించాలి. క్రోధం నీ అధీనంలో ఉండాలి. నువు కోపానికి లోబడకూడదు. కోపం నీకు ఉపకరణం కావాలి. అంతేకానీ, కోపం చేతిలో నువు ఆయుధం కాకూడదు. లోకక్షేమం కోసమే నీ కోపం ఉపయోగపడాలి. నీ అహాన్ని సంతృప్తి పరచుకొనేందుకు కాదు” అన్నారు పితృదేవతలు. “తండ్రులారా! నా సందేహాన్ని పటాపంచలు చేశారు. నా దోషాన్ని క్షమించండి” వినయంగా చెప్పాడు జమదగ్ని. “నువు చేసిన తప్పు క్షమార్హం కాదు. మరుజన్మలో నువు ముంగిసవై పుడతావు” శపించారు పితృదేవతలు. 

“పితృదేవతలారా! ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు. నాకు శాప విమోచనాన్ని స్రసాదించండి” ప్రార్థించాడు జమదగ్ని. ‘దోషరహితులైన బ్రాహ్మణులు స్వార్థరహితంగా పలికిన సాధువాక్యాలను ఆక్షేపించినపుడు నువు ముంగిస రూపం వదిలి నిజరూపాన్ని పొందుతావు” చెప్పి అంతర్ధానమై పోయారు పితృదేవతలు. అలా, ముంగిస జన్మనెత్తిన జమదగ్ని అనేక ఏండ్లపాటు ఆ రూపంలో ఉండి, ధర్మరాజు చేసిన అశ్వమేథ యాగాన్ని బ్రాహ్మణులు వేనోళ్ల కొనియాడుతుంటే, ఆ యాగాన్ని తక్కువ చేసి మాట్లాడి శాప విమోచనాన్ని, ఆ పైన జన్మ రాహిత్యాన్ని పొందాడు. మహాత్ములు శాపగ్రస్తులైనా లోకకళ్యాణానికే పాటుపడతారనడానికి ఈ కథ ఒక ఉదాహరణ.logo