బుధవారం 28 అక్టోబర్ 2020
Devotional - Sep 21, 2020 , 00:12:42

కాలం, ధనం, శ్రమవ్యర్థం కాకుండా ఉండటానికి..

కాలం, ధనం, శ్రమవ్యర్థం కాకుండా ఉండటానికి..

సుమంతో సుమంతో 

శ్రీకార్త వీర్యార్జునాయ నమ:

ఓం కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్‌

తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే॥

మానవ జీవిత కాలం అతి చిన్నది, అత్యంత విలువైంది, ముఖ్యమైంది. ఈ తక్కువ కాలంలో తమ పూర్వకర్మల ప్రభావాలను తగ్గించుకుంటూ, ఉత్తమ జీవితం వైపు, జీవన్ముక్తి వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ, వేర్వేరు రూపాల్లో మనకు కాలం, ధనం, శ్రమ వ్యర్థం అవడం వల్ల దీనిని సాధించలేకపోతుంటాం. చేసే ప్రతి పనిలోనూ ఈ మూడు అంశాలే ప్రాధాన్యం వహిస్తాయి. ఎంతో కష్టపడి సాధించాల్సిన ప్రగతిని సాధించినా ఏదో రూపంలో మళ్ళీ నష్టాలు కలుగుతూనే ఉంటాయి. దానివల్ల మళ్ళీ మన కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంటుంది. 

దీంతో ఎంతో కాలం, చాలా ధనం, మన మానసిక, శారీరక శ్రమ అంతా వ్యర్థమై పోతుంది. కోల్పోయిన తర్వాత మళ్ళీ సాధించడం కన్నా, కోల్పోకుండా ఉండటమే ఉత్తమం కదా. అందుకే, మన జీవితంలో ఏదీ మనం కోల్పోకూడదని అనుకొంటే, పోయింది కూడా మళ్ళీ పొందాలనుకుంటే ‘సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జునాయ నమ:’ అనే మంత్రోపాసన మంచి తరుణోపాయం. కార్తవీర్యుడు విష్ణువు సుదర్శన చక్రాంశ సంభూతుడని పౌరాణిక కథనం. అటువంటి కార్తవీర్యుని స్మరణతో నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుందని కూడా స్తోత్రాలు చెబుతున్నాయి. 

ఇంటినుండి ఎవరైనా వెళ్ళిపోయినా, మన వస్తువులు ఏవైనా మనకు కనిపించకుండా ఇబ్బంది పెడుతున్నా, సరైన సమయంలో పనులు జరుగక చికాకులకు గురి చేస్తున్నా, రావలసిన ధనం సరైన సమయానికి రాకపోయినా, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తున్నా.. ఈ మంత్రోపాసన తప్పనిసరిగా శుభఫలితాలను అందిస్తుంది. సమస్య తీవ్రతనుబట్టి ‘సుమంతో సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమ:’ మంత్ర జపాన్ని కనీసం 1 నుండి 3 గంటల పాటు చేస్తూ ఉంటే వెంటనే అనుకూలత, కార్యసిద్ధి కలుగుతాయి. ఈ మంత్ర జపం ద్వారా పనులు పూర్తయి మనకు చివరకు విజయం, సంతోషం, సంతృప్తి, ఉత్సాహాలు కలుగుతాయి.logo