ఆదివారం 25 అక్టోబర్ 2020
Devotional - Sep 21, 2020 , 00:12:39

దుర్మార్గునికి దివ్యరూపమా?

దుర్మార్గునికి దివ్యరూపమా?

ఏ ప్రయోజనాన్ని ఆశించి శ్రీకృష్ణుడు పరమ దుర్మార్గుడైన ధృతరాష్ర్టునికి తన దివ్యరూపాన్ని చూపాడు?

-విరజ, సిద్దిపేట

‘మహాభారతం’లో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని మూడుమార్లు చూపినట్లుగా కనిపిస్తుంది. మొదటిసారి రాయబారానికి వచ్చినప్పుడు శాంతిస్థాపన లక్ష్యంగా ధృతరాష్ర్టునికి, రెండవమారు అర్జునుడిని యుద్ధంపట్ల కర్తవ్యోన్ముఖుడిని చేయడానికి, మూడవమారు జ్ఞానిని అనుగ్రహించడానికి ఉదంకునికి విశ్వరూపాన్ని చూపాడు. విశ్వ ప్రణాళికలో ఒక కార్యం జరిగింది అంటే దానికి ఒక కారణం ఉంటుంది. విశ్వరూపాన్ని చూపిన ప్రతిసారి దానికి ఒక ప్రయోజనం ఉన్నది. విశ్వం స్వరూపం విశ్వరూపం. కాలమాన పరిస్థితులకు అతీతంగా విశ్వాన్ని దర్శించడం విశ్వరూప సందర్శనం. దర్శించేందుకు కనీస అర్హత ఉంటుంది. తనది కాని దేహాన్ని ధరించినవాడు ‘ధృతరాష్ర్టుడు‘. తన పూర్వపుణ్య ఫలితంగా వ్యాసపుత్రునిగా జన్మించాడే కాని, తనలోని ఈర్ష్యాసూయలను జయించలేకపోయాడు. ఆ దర్శన ఫలితాన్నీ అనుభవించలేక పోయాడు.

విశ్వరూపాన్ని చూపడంలోని ప్రయోజనాలకూ పరిమితులున్నాయి. ధృతరాష్ర్టునికి సభలో విశ్వరూపాన్ని చూపడం ద్వారా కృష్ణుని పట్టి బంధించాలనే దుష్టచతుష్టయ దుర్నీతిని బద్దలు కొట్టడం, కృష్ణుడు దివ్యబల సంపన్నుడని, తానొక్కడేకాక విచిత్రాయుధధారులైన విచిత్రరూపులు అనేకులను చూపించి దుర్యోధనాదులకు భయం కల్గించడం, విధి పాండవులకు అనుకూలంగా ఉన్నదని, తద్వారా కౌరవులకు సహాయపడే ఉద్దేశ్యంతో ఉన్న రాజులకు కృష్ణ రక్షితులైన పాండవులను జయించలేమనే నిరాశను కలిగించడం, దానివల్ల వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం, వారంతా మరోమారు ఆలోచించుకునే అవకాశం ఇవ్వడం.. ఇవన్నీ కృష్ణుడు ఆశించిన ప్రయోజనాలు. ధైర్యం అంటే ప్రజ్ఞ లేదా ధరించే శక్తి. కౌరవ కూటమి ధైర్యాన్ని దెబ్బతీయడం ప్రధాన ప్రయోజనం.ధృతరాష్ర్టుని అభ్యర్ధనపై దివ్యచక్షువుల నివ్వడం వల్ల అతనిలో మార్పు వచ్చి రాయబారం సజావుగా జరుగగలదని ఆశించడం మరొక ప్రయోజనం. భక్తపరాధీనత మరొక కారణం. దీనివల్ల కృష్ణుడు ఆశించిన ప్రయోజనం సిద్ధించిందా? ఒకవేళ నెరవేరితే ధృతరాష్ర్టుడు అర్ధరాజ్యాన్ని పాండవులకు ఇచ్చి ఉండవలసింది కదా. ధృతరాష్ర్టుడు ‘దుర్గ్రాహ్య కేశవో బలాత్‌" అంటాడు. ‘అజేయుడైన కృష్ణుని బంధింపగలవా?’ అని దుర్యోధనుని మందలిస్తాడే కాని, అర్ధరాజ్యాన్ని ఇస్తాననే సాహసం మాత్రం చేయడు. దానికీ కారణాలనేకం. ముఖ్యంగా ధృతరాష్ర్టుని చిత్తవృత్తి విశ్వరూపాన్ని దర్శించడంతో కొంత మారినా, అర్ధరాజ్యం ఇవ్వడం అతని చేతిలో లేదు. మరోవైపు పుత్ర వ్యామోహాన్నీ జయించలేకపోయాడు.

విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు భీతిల్లి సమర్పణా భావనతో కృష్ణుని స్తుతిస్తాడు. కానీ, ధృతరాష్ర్టునిలో భయమూ లేదు, సమర్పణా భావనా లేదు. అంటే, అతను సందర్శించింది పరిమితమైన రూపాన్నే కాని, సమగ్రమైన విశ్వరూపాన్ని కాదు. అతనికి విశ్వరూప సందర్శనం వల్ల తాత్కాలిక మార్పు కలిగినా, పాత వాసనలకు దూరం కాలేకపోయాడు. logo